Take a fresh look at your lifestyle.

88‌వ వసంతంలో కాలిడిన తెలుగు నేలపై జర్నలిజానికి అడ్డా ఎ బి కె

ఆయన జర్నలిస్టు మాత్రమే కాదు. సాహిత్య వేత్త, తత్వచింతకుడు, పీడిత జనపక్ష పాతి, ఉద్యమశీలి. మానవుడు సాధించిన అన్ని వైజ్ఞానిక శాఖలతోనూ ఆయనకు పరిచయం ఉంది. తెలుగు పత్రికా రంరంలో అతి విశిష్ట స్థానం పొంది, సాధారణ జనచైతన్య దిగంతరేఖను విస్తృతం చేస్తున్న వ్యక్తి ఎ.బి.కె. వసంత ఋతువులో అన్ని పూలగంధాలను పూసుకుని విహరించే వాయువులాంటిది ఎ.బి.కె వ్యక్తిత్వం, అని గుంటూరు శేషేంద్ర శర్మ వంటి దిగ్దంత దాదాపు మూడున్నర దశాబ్దాలనాడే కితాబు నిచ్చారంటే ఎబికె అంటే అర్ధమౌతుంది. ఏబికె ప్రసాద్‌.. అనే పేరు తెలుగు జర్నలిజంలో మార్మోగిపోయింది. ఆపేరుతోనే ఆయన పాఠక లోకానికి పరిచయం. అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్‌ అం‌టే అందరికీ తెలియకపోవచ్చు. ఆగస్ట్ ‌నెలకు చరిత్రలో ప్రాముఖ్యం ఉంది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం, స్వాతంత్య్ర సిద్ధి ఈ నెలలోనే.. ఏబికె పుట్టింది కూడా ఈ నెల మొదటి రోజునే! జన్మదినం ఆగస్టు 1.1935. ఏబికె 88వ ఏట ప్రవేశించారు.

తెలుగునేలపై ఒక కొత్త పత్రిక రావాలంటే ఏబికే మనసులో ఆలోచన పురుడు పోసుకోవాలి. ఆస్పత్రులు, డాక్టర్లు, కాంపౌండర్లు, మంత్రసానులు, మందులు, శస్త్రచికిత్స సామగ్రి.. ఇలా అన్నీ ఆయన ఎంపికే.. మంచి పనిమంతుడు అని తలచి బృందంలో కలుపుకుని.. నిఖార్సయిన జర్నలిస్టని నమ్మకం పెంచుకుని బాధ్యత అప్పగిస్తాడు. తాను పుస్తకాల్లో.. చదువులో… రాతల్లో.. అధ్యయనాల్లో మునిగిపోతాడు. అందరినీ నమ్మేస్తాడు (నమ్మదగని వాళ్ళని కూడా..). ఇక తన ప్రపంచంలో మునిగిపోతాడు. యాజమాన్యంతో రాజీపడడు, రాజకీయంతో రాజీపడడు. తనతో తనే రాజీపడడు.. రోజులు, నెలలు.. మహ అయితే మూడు, నాలుగేళ్ళు సాఫీగా సాగిపోతాయి.. కొన్నేళ్ళకు నిజంగానే మునిగిపోతాడు. ఆయనతో ఇంకొందరు కూడా.. ఆయన పేరే ఏ పత్రికకైనా వజ్రకవచం. ఆ కవచ కుండలాలనుకూడా ఇచ్చేసి బయటకి పోతాడావ్యక్తి. కొత్తగా పత్రిక పెట్టే వారికి ఆయన సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీపడి ఉద్యోగం చేయడం ఆయనకిష్టం లేదు. రాజీపడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవారు కాదేమో. ఈనాడులో, ఆంధ్రప్రభలో, ఉదయంలో, వార్తలో, ఆంధ్రభూమిలో… ఎందరో ఆయనన అడుగు జాడల్లో నడిచారు.తెలుగునేలపై దశాబ్దాలుగా జర్నలిజానికి ఆయన అడ్దా.. ఆయన కారా?నాలో ఎన్నో కలాలు తయారయ్యాయి.గళాలు నినదించాయి.ఆయన కలలు ఫలించాయనుకుని సంతోషించాడాయన ‘‘జర్నలిస్టులను – ఎడిటర్లను’’ తయారు చేద్దామనే తపన పడ్డాడు. కొందరు సంపాదకులయ్యారు, ఇంకొందరు కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయన కూడా…. ఎందుకంటే ఆయన రాజీపడడు. పడిఉంటే ఒకే పత్రికలో దర్జాగా వెలుగుతూ ఉండేవాడు. నెలకు లక్షల రూపాయల నజరానాకు అమ్ముడు పోయి ఉండేవాడు. కృష్ణా జిల్లా పునాదిపాడులో పుట్టిన ఆయన తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై నిక్కరేసుకుని దండ చేతపట్టాడు. కొద్దికాలానికే అదంటే గిట్టక బయటికొచ్చేశారు. నాగపూర్లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను ‘విశాలాంధ్ర’ పత్రికకు రాసేవారు. . అలా ఫైనలియర్‌ ‌వచ్చేటప్పటికి తనకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరారు. తొలి ఉద్యోగం విజయవాడ (1958) విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌. ఆం‌ధ్రపత్రిక తప్ప తెలుగులో అన్ని ప్రధాన పత్రికలకూ పనిచేశారు. వార, పక్ష, మాస పత్రికలు, చివరకు చానళ్ళూ కూడా వదలలేదు.. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశారు. కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశారు ‘జనశక్తి’ సంపాదకుడిగా అనేక కేసులు నమోదయ్యాయి.జైలుకెళ్లారు.ఈనాడు, ఉదయం, వార్త(విజయవాడ, వైజాగ్‌ ఎడిషన్లు) పత్రికలకు ఆయన ప్రారంభ సంపాదకుడు కూడా.

తెలుగువారందరూ ఒకే రాష్ట్రంగా ఉండాలనుకున్న సమైక్యవాది. తన వాదనకు అనుగుణంగా పుస్తకాలు రాసారు. ఆయన ప్రజల మనిషి. కులాలకు, పార్టీలకు అతీతుడు. ఏకొత్త మాధ్యమం మొదలవ్వాలన్నా ఏబికె చేయి పడాల్సిందే.. దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాస పత్రికలు ..ఆయనచేతిలోకి చేరి మూసలోనుంచి బయటపడి కొత్త దారిపట్టాయి. జాతీయ స్థాయిలో ఎందరో పాత్రికేయులకు ఆయన ఒక మార్గదర్శి. అభిమాని. అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశారాయన. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, మాకినేని బసవపున్నయ్య, మేనమామ వాసుదేవరావు లాంటి ప్రముఖుల చర్చలకు ప్రత్యక్ష సాక్షి.. ఆయనను వాళ్లు చాలా ప్రభావితం చేశారు. ఎ.బి.కె వచనానికి సోయగం వుంది, పరిపక్వత వుంది, పరిమళం వుంది, అతను ఒక్కొక్కసారి రచనలో కవిత్వపు తళుకులు చూపిస్తాడు.ఒక్కొక్కసారి ఆవేశంలో అక్షర జలపాతాలు కురిపిస్తాడు.ఈ శిల్పం నిబద్ధత వల్లనే అబ్బింది. అతని సాహిత్య సంపాదకీయాలలో ప్రతీ రచనా ఒక కావ్యం. నిశిత బుద్దితో, సముద్రమంతటి గాంభీర్యంతో, భావనా వైశాల్యంతో సాగిన అద్భుత సాహిత్యదర్శనం, విశ్వ విజ్ఞానాన్ని పిడికిట్లో ఇముడ్చుకున్న రచనలాయనవి. ఆయన అక్షర నిబద్దుడు. తెలుగు భాష కు ప్రాచీనహోదా దక్కించటంలో తెలుగు ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా ఏ.బి.కె. చేసిన కృషి ప్రశంసనీయం. కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం, సచివాలయంలో సంప్రదింపులు జరపడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వత్తిడి తేవడంలో కీలక పాత్ర వహించారు. ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ, తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు. తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు. ఆయన ఇప్పటికీ రాస్తునే ఉంటారు. చిన్నపత్రికైనా.. పెద్ద పత్రికైనా.. ఆయనకు ఒకటే. దేనికైనా రాస్తారు ఆయన… కాలాన్ని, కలాన్ని నమ్ముకున్న ఒక కాలమిస్టు. ఆపర్చునిస్టు మాత్రం కాదు. ఇప్పుడు 80వ దశకం చివరలోకూడా ఆయన ఒక ప్రయోగశాలనే.ఎబికె పత్రికా రంగంలోని అన్ని విభాగాలలో నైపుణ్యం సాధించిన వ్యక్తి. ఫ్రూఫ్‌ ‌రీడింగ్‌, ఎడిటింగ్‌, ‌లీడర్‌ ‌రైటింగ్‌, ‌పేజ్‌ ‌మేకప్‌, ‌పరిశోధనాత్మక పాత్రికేయం.. అన్నింటా మేటి అని స్వయంగా నార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారంటే ఎబికే అంటే ఏంటో తెలుస్తుంది.

తృప్తిని మించిన ఆస్తి లేదని, పత్రిక అమ్మకాలు పెరగడం, తగ్గడం- రెండూ సంపాదకుడి ప్రతిభకు గీటురాళ్లేనంటారాయన. కుత్సితాల లోయలోకి వెళ్లేకొద్దీ మనిషిలో నైపుణ్యాలు అణగారిపోతాయని, కుహనా విమర్శను అక్కడితోనే వదిలేసి, మనసులోంచి తుడిచి వేయగలిగినప్పుడే లక్ష్యాలను చేరగలమన్నది ఆయన దృఢాభిప్రాయం.ఎన్ని అడ్డంకులు ఎదురైనా మానసికంగా దెబ్బతినకూడదు. ఎంచుకున్న బాటను వదలకూడదన్నది ఆయన మార్గం. కొత్త పత్రికలకు పురుడు పోయడం,సరికొత్త ఆలోచనలకు వేదికనివ్వడం, అక్షరాన్ని ఆయుధంగా చేసుకోవడం ఎ.బి.కె విలక్షణత అని,వస్తువు,రూపం కలిపిన మేలిమి కలయికలు, విజ్ఞాన పేటికలు ఆయన సంపాదకీయాలు అని సి నారాయణరెడ్డి వంటి కవి కీర్తించారు. ముట్నూరి, నార్ల, గోరాశాస్త్రి తదితర ఉద్దండులైన నైతిక విలువలు కల్గిన సంపాదకులలో ఎ.బి.కె చివరివాడు అని, ఫ్రెంచి విప్లవం ద్విశత జయంతి సంధర్బంగా (1989 జూలై) ‘‘ఆంధ్రభూమి’’ దినపత్రికలో ఆయన వ్రాసిన సంపాదకీయం చరిత్ర అధ్యాపకుడినైన తనను ఎంతో ముగ్ధుణ్ణి చేసిందని. ఎందరో చరిత్ర అధ్యాపకులకు కూడా అంతుచిక్కని అంశాలను ఆయన ప్రస్తావించడం ఆశ్యర్యం గొల్పిందని వకుళాభరణం రామకృష్ణ ప్రస్తుతించారంటే ఎ బి కె అంటే అర్ధమౌతుంది.

తమిళ సంప్రదాయంలో ‘‘కైవాసి’’ అనే పదం ఉందని,. ఎబికె చేతి చలువ అలాంటిదని,. ఆయన ప్రారంభించిన పత్రికలు యాజమాన్యాలకు ప్రతిష్ఠ చేకూరుస్తున్నాయంటూ, పత్రికలు పరిశ్రమకు, ఆయన మేథాశక్తికి తార్కాణాలని దాశరథి కృష్ణమాచారి కొనియాడారంటే ఎబికె సత్తా ఏంటో తెలుస్తుంది. ఎదుటి వారు అసూయపడేలా బ్రతకడం, ఈర్ష్యతో గింజుకు చచ్చేటంత బాగా వ్రాయడం శత్రువులు కూడా ఔరా అనుకున్నంత ‘‘స్వచ్చంగా’’నైతిక విలువల్ని కాపాడుకోవడం మొండివాని లక్షణాలు. ‘‘నువ్వు మొండివాడివి. గట్టివాడివి! శాపగ్రస్తుడివైన గ్రీకు మహాశిల్పి ‘‘ఫిడియస్‌’’ ‌లాంటివాడివి.నువ్వు అదృష్టం కరువైన అతిలోక బలశాలి ‘‘అట్లాస్‌’’‌లాంటివాడివి. నిజానికి ముందుగా ‘నమస్కారం’ అనాలి. కాని చివరికంటున్నా’’ అని సాహిత్య అకాదెమీ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ సైతం అన్నారంటే ఎబికె సమర్థత అర్ధమౌతుంది.

‘‘సంపాదకుని పని అశిధారావ్రతం. ఎ.బి.కె సంపాదకీయాలలో బిందువుల్లో సింధువును చూపాడు. అద్దంలో కొండను చూపాడు. ఎ.బి.కె సంపాదకీయాలు అశిధారావ్రతంతో చేసిన రచనలు శ్యామశబల వ్రతంతో నిగ్గుతేరని అపరంజి రేకులు. ఏ సంపాదకీయం చదివినా నా మట్టుకు నాకు ఏదో నేను కలలోనూ చూడని నందనోద్యానంలో విహరించినట్టు, అపురూప సౌందర్యాన్ని సాక్షాత్కరించుకున్నట్టు, కైలసనాధకోన, ఎత్తిపోతల, కుర్తాళం, నయాగరా జలపాతాలలో జలకాలాడినట్టు ఏ హెలికాప్టర్లోనో ఒంటిగా విహన పథంలో తిరుగుతూ లోకంలోని అతిలోక సౌందర్యాన్ని పర్యవేక్షిస్తున్నట్టు, షేక్‌ ‌చినమౌలానా సాహెబ్‌ ‌నాదస్వరాన్ని వింటున్నట్టు, ఎల్లా వెంకటేశ్వరరావు నవమృదంగనాదాన్నో, అల్లారకా? తబల భాషనో వింటున్నట్టు అనిపిస్తుంది. ఇదొక ప్రపంచం, ఇదొక కొత్త సృష్టి. నేనొక నవ్య ప్రపంచంలో విహరించాను. క్షణక్షణానికి రూపం మార్చుకుంటూ విచిత్ర రూపాలతో అలరిస్తూ తిరిగే మేఘాల మేఘాలయాన్ని చూచాను. రచన విధి సృష్టికి భిన్నమయింది. అది మరొక మహాలోకం. ఎ.బి.కె, మనస్సు మహితం. బుద్ధి మహాతీక్షణం. విమర్శ నిష్పక్షపాతయుతం. ఊహలు సత్యధర్మ సంయుతాలు’’ అని పాత్రికేయ శిఖరాగ్రాన ఎ బి కె ను నిలబెట్టింది ఎవరో కాదు, సాక్షాత్తు తిరుమల రామచంద్ర అంటేనే ఆయన ఔన్నత్యం ఏమిటో తెలుస్తుంది. పత్రికా రణరంగంలో రాజీలేని పోరాటంలో, పట్టుదలలో రాటుదేలిన విక్రమార్కుడు..

ఆయన సృష్టించిన సైన్యంలో నేనొకడిని. నాకలాన్ని సానపట్టింది, ధైర్యం నూరిపోసింది ఆయనే.. నేను ఇప్పటికీ ఆయన అభిమానినే.. ఉదయంలో రెండేళ్ళు.. నేరుగా ఆయన సారథ్యంలో, తరువాత ఓ రెండేళ్ళు మాత్రమే ఆంధ్రజ్యోతిలో ఆయనతో కలసి పనిచేశాను. కానీ, మా మధ్య కలం బంధం 40 వత్సరాలు. వ్యక్తిగతంగా కలసినప్పుడు, ఫోన్‌ ‌లోనూ… ప్రేమగా, ఆప్యాయతతో ‘‘ఏరా. అబ్బాయ్‌. ‌రాధ బాగున్నావా, నీ ఇల్లాలు ఆరోగ్యమేకదా..పిల్లలు అన్నివిధాలుగా స్థిరపడడం సంతోషం’’, అనే పలకరింపే నాకు కొండంత బలం.. ఆయన ఆలోచన, కలం నిర్విరామంగా అడుగులు వేస్తునే ఉన్నాయి. హైదారాబాద్‌, ‌కొండాపూర్‌ ‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌ ‌నిర్వహణలోని వృద్ధాశ్రమంలో కాలం వెళ్ళబుచ్చుతూ కలం కవాతు చేస్తున్నారు..ఈ వయసున కూడా అక్షర అధ్యయనం, ఒక యజ్ఞంగా, ఊపిరిగా భావిస్తూ, ఆపత్కాలంలో మానవాళికి కొంతయినా సహాయం అందిద్దామన్న తపనతో ఉభయ తెలుగురాష్ట్రాలలో కరోనా బారిన పడిన వారిని ఇతోధికంగా సాయం చేయాలన్న మానవత్వంతో 50 వేల రూపాయలు వంతున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి అందచేసిన సామాజిక స్పృహకలిగిన వయోధిక పాత్రికేయునకు వందనం. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం ప్రకటించిన లైఫ్‌ ‌టైమ్‌ ఎచీవ్‌ ‌మెంట్‌ అవార్డు కూడా ఇటీవలే అందుకున్నారు. అక్షర ప్రేమికుడు, అవిశ్రాంత చదువరి, నిబద్ధుడైన పాత్రికేయ గురువు ఎబికె, ఎనభై ఎనిమిదవ వసంతాన కాలిడి, అనుకున్నది ఎలుగెత్తి చాటే ఎడిటర్‌.. అరమరికలు లేని ఆత్మీయ వ్యక్తికి జన్మదినోత్సవ అభివాదాలు. గురువునకు జన్మదిన వినమ్ర నమస్సులు. శతాయుష్కులై అక్షర సూర్యునిగా వెలుగులు ప్రసాదించాలి. ఆయన అక్షర సంపదకు శతకోటి వందనాలు. ఆయన మరిన్ని సంవత్సరాలు పోరాటయోధుడుగా నిలిచి సైన్యాన్ని నడపాలి. సమాజంకోసం!
– నందిరాజు రాధాకృష్ణ, వెటరన్‌ ‌జర్నలిస్ట్.

Leave a Reply