Take a fresh look at your lifestyle.

బతుకమ్మకు హారతి

పల్లవి :
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
పూల సింగిడివమ్మ ఉయ్యాలో
తెలంగాణ సిరివమ్మ ఉయ్యాలో
హారతి హారతి గౌరమ్మ ఉయ్యాలో
జయ హారతి నీకమ్మా ఉయ్యాలో
!! బతుకమ్మా …
త్యాగాల దీప్తివి ఉయ్యాలో
అమరత్వ కీర్తివి ఉయ్యాలో
ఉద్యమ స్ఫూర్తివి ఉయ్యాలో
వీరోచిత చరితవి ఉయ్యాలో
శరణు శరణు తల్లీ ఉయ్యాలో
సకల జన శరణు ఉయ్యాలో
!! బతుకమ్మ…
ఆస్తిత్వ ప్రతీకవి ఉయ్యాలో
సంస్కృతి వేడుకవి ఉయ్యాలో
ఆత్మగౌరవ పతాకవి ఉయ్యాలో
శ్రమ జీవన సింగారివి ఉయ్యాలో
పబ్బతి పబ్బతి తల్లీ ఉయ్యాలో
సబ్బండ వర్గ పబ్బతి ఉయ్యాలో
!! బతుకమ్మా…
మా కంటి వెలుగువి ఉయ్యాలో
మా ఇంటి వేలుపువి ఉయ్యాలో
మా పంట మాగాణివి ఉయ్యాలో
మా బువ్వ మెతుకువి ఉయ్యాలో
వందనం వందనం నీకు ఉయ్యాలో
బహుజన అభివందనం ఉయ్యాలో
!! బతుకమ్మా
కరుణగల్ల తల్లివి ఉయ్యాలో
వరాల కల్పవల్లివి ఉయ్యాలో
శాంతి ప్రసాదిణివి ఉయ్యాలో
విశ్వ తేజదర్శినివి ఉయ్యాలో
ప్రణతి బతుకమ్మ ఉయ్యాలో
తెలంగాణా ప్రణతి ఉయ్యాలో

 (బతుకమ్మ మహోత్సవం సందర్భంగా…)
 – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply