కొరోనా వైరస్ ఉధృతమవుతున్న నేపథ్యంలో బడుగు బలహీనవర్గాలకు చెందిన ప్రజలు, మధ్యతరగతి ఉద్యోగులకు సత్వర చికిత్స అందించాలి. ఇందుకు ప్రభుత్వం కొరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లో చేర్చి ప్రజలందరికీ అందు బాటులోకి తెచ్చి ఆదుకోవాలి. కొరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికే నిజమైతున్నది.జూలై చివరి రెండు వారాలలో వైరస్ భారత్ లో విజృంభిస్తుందన్న అంఛనా నిజమైంది. రాజధానిలో పెరిగిన కొరోనా రాష్ట్రమంతా పాకింది.ప్రభుత్వ హాస్పి•ల్లో, పడకలు ఇతర సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో, కోవిడ్ చికిత్సకు రాష్ట్రంలో వందకు పైగా ప్రైవేట్హాస్పిటల్లకు ప్రభుత్వం అనుమతులిచ్చారు.ప్రభుత్వ హాస్పిటల్లలో ప్రభుత్వం సిబ్బందికి పి.పి.ఇ. కిట్లు సానిటైజర్లు, తదితర రక్షణ సౌకర్యాలు అందించటంలో నిర్లక్ష్యం వహిస్తుందని వైద్యులు, సిబ్బంది నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.వైరస్ సోకి, సిబ్బంది పెద్దసంఖ్యలో చికిత్స కోసం క్వారంటైన్ పాలయ్యారు. హాస్పిటల్లో సిబ్బంది కరువై, వైద్యం అందించడంలో జాప్యం పెరిగింది.మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే పాజిటివ్ బాధితులతో లక్షల రూపాయల బేరాలు చేసే స్థాయికి కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాలు దిగజారాయి.దీంతో ప్రజలు ఆందోళన, ఆభద్ర తాభావంతో వున్నారు. అందుకే ప్రజలు, ఉద్యోగులు తక్షణమే ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ లో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 2007 లో అప్పటి సి.ఎం.దివంగత రాజశేఖర్ రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రారంభించారు. దారిద్య రేఖకు దిగువన వుండి, తెల్లరేషన్ కార్డు వున్న వారందరికీ ఏడాదికి రెండున్నర లక్షల వరకు ఉచితంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స చేయబడుతుంది. దీనిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగిస్తూ వచ్చారు. దీని వలన ఎందరో పేదలు తీవ్ర అనారోగ్యానికి గురై మరణం అంచుల దాకా వెళ్ళి, రూపాయి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్యశ్రీ పథకం బడుగులకు వరప్రదాయినిగా మారి, బ్రతుకు భరోసాను ఇచ్చింది. ఈ కొరోనా ఆపత్కాలంలో కూడా పేద ప్రజలకు ఈ భరోసా ఇచ్చేందుకు కోవిడ్ 19 చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని అందరు కోరుకుంటున్నారు. మార్చి నెల తొలి లాక్ డౌన్ విధించినప్పటి నుండి శ్రమజీవుల బ్రతుకు దుర్భరపరిస్థితుల్లోకి నెట్టివేయబడి ప్రమాదపు ఘంటికలు మ్రోగుతున్నాయి.వలస కార్మికుల పరిస్థితి చెప్పనలవి కాదు.పనిచేసే ప్రాంతంలో ఉపాధి కరువై వారిని తీసుకువచ్చిన,వారితో పనిచేయించుకున్న యాజమాన్యాలు వారిని ఆదుకో లేకపోయారు.పస్తులుండలేక ఉన్న ఊరు, తమ సొంత కుటుంబం కోసం సొంత గ్రామాలకు చేరుకున్నారు. అలాంటి వారికి చికిత్స చేయించుకోవడానికి కొరోనా సోకితే చేతిలో పైసా లేని దుర్భరస్థితిలో ప్రాణాలు వదలక తప్పేటట్టులేదు. ఇలాంటి బడుగు జీవులకు చికిత్స అందించడం కోసం ఆరోగ్య శ్రీ పథకం విశేషంగా దోహదపడుతుంది.
అన్ని వర్గాల ప్రజలు కొరోనా సంక్షోభంతో ఆర్థికంగా చితికి పోయారు. సబ్బండ వర్గాల ప్రజలు ఉపాధి సన్నగిల్లి ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిని అవస్థలు పడుతున్నారు. ఈ సమయంలో లాక్ డౌన్ తాళాలు తెరచుకోవడంతో ప్రజలు పనుల కోసం వెళ్ళగా కొరోనా విజృంభణ తిరిగి రెట్టింపైంది. పలు ప్రాంతాల్లో స్వయం ప్రకటిత లాక్ డౌన్లోకి తిరిగి వెళ్లడం జరుగుతుంది.వందల నుండి వేలు లక్షలు చేరుతున్న పాజిటివ్ బాధితులకు కొరోనాచికిత్సను అందించటంలో ప్రభుత్వ దవాఖానాలు విఫలమయ్యాయి. కిక్కిరిసిన బాధితుల సంఖ్యకు సరియైన వసతులు లేక, తీవ్ర అనారోగ్యంతో కొంతమంది చనిపోవడంతో ప్రజలలో ఆందోళన పడుతున్నారు.భయంతో ప్రభుత్వ హాస్పిటల్లకు వెళ్లలేని పరిస్థితులు కూడా ఉన్నాయి.ఈ నేపధ్యంలో ప్రైవేట్ హాస్పిటల్లన్నీ ఈ చికిత్సను భారీ వ్యాపారంగా మార్చాయి. పాజిటివ్ నిర్ధారించబడిన వారి ప్రాణభయం ప్రయివేట్ హాస్పిటల్ల నిలువుదోపిడికి ఊతమైంది. ఆస్తులను అమ్మి చికిత్స చేయించుకున్న వారు వీధిన పడుతున్నారు. ఆస్తులను అమ్ముకున్నాకూడా వైద్యమందక ప్రాణాలు పోగొట్టుకున్నా వారు ఉన్నారు.ఒకవైపు ప్రైవేటు ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయి కనీస అవసరాలను తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు.మరొక వైపు ప్రభుత్వఉద్యోగులకు మూడునెలల పాటు అందిన సగం వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు, ఆత్మహత్యల పాలయ్యారు. వచ్చిన సగం జీతాలు వారు తమ బ్యాంకేతర అప్పులు, చిట్టీల ఇతర కిస్తీలులు చెల్లించలేక నానా యాతన పడ్డారు.
ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు కిడ్నీ డయాలసిస్, తలసేమియా ఉన్నవారు వైద్యమందక, మందులు కొనలేక ఇబ్బందులు పడ్డారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం కొరోనా కాలంలో ఆర్ధికంగా దెబ్బతిన్న కుటుంబాల ఆరోగ్యం కాపాడటం కోసం కొరోనా చికిత్సను ఈ హెచ్ ఎస్‌లో, ఆరోగ్య శ్రీ లో చేర్చాలనే డిమాండ్ ఊపందుకుంది మన రాష్ట్రంలో కొరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చాలనే డిమాండ్ కు ఆంధ్రాలో కొరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో చేర్చడం బలం చేకూర్చింది.దీంతో మన రాష్ట్రంలో ఈ డిమాండ్ కు ప్రతిపక్ష పార్టీలు గొంతుకలిపాయి.ఉద్యోగులు, సామాజిక కార్యకర్తలు, బుద్ధిజీవులు పలు సందర్భాలలో ఈ డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తెచ్చారు.కేంద్రం ప్రవేశపెట్టిన ‘‘ఆయుష్మాన్ భారత్’’ ప్రధానమంత్రి ఆరోగ్య యోజన పథకం కింద కొరోనా వైద్య పరీక్షలకు ప్రవేశ పెట్టిన మార్గదర్శకాలను అమలు చేయాలని ప్రధాన డిమాండ్‌తో పలు మార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వెయ్యి కోట్ల రూపాయలు అయినా ఖర్చుపెట్టి కొరోనాను ఎదుర్కొంటామని చేసిన ప్రకటనను ప్రజాహితవాజ్యంగా స్వీకరించాలని ఒక న్యాయవాది హైకోర్టుకు లేఖ రాశారు.దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసనం చేసిన వాఖ్యలను పరిగణనలోకి తీసుకొనైనా కొరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ , ఈ.హెచ్.ఎస్.లో చేర్చాలి. ఆరోగ్యకరమైన తెలంగాణ లక్ష్యంగా పేదవాడి బ్రతుకుకు భరోసా కల్పించటమే ‘‘ఉద్యమ పార్టీ సర్కార్’’ ప్రధానంగా భావించాలి.

ఉపాధ్యక్షుడు, టి.పి.టి.ఎఫ్. మహబఃబాద్ జిల్లా. 9989584665,