Take a fresh look at your lifestyle.

’’ఆలిశెమెందుకు’’…..?

 ‘‘ఇను బేతాళ్‌! ‌యేంజేయాలె!యట్ల జేయాలె!? అని రొండేండ్ల సంది సర్కార్‌ ‌సోంచాయించే పనిమీద మాగనే వున్నదిగని,నౌకరోళ్ళ ఆశల తోని ఆడుకునుడు ఆగం జేసుడే కద!ధర్నాలు జేసుడుకన్నా జేశేదేమున్నది.‘‘తెలంగాణ యేరు పడ్డంక సెంట్రలోళ్ళ జీతాలకన్న బేత్రిన్‌ ‌గ మన తాన సర్కార్‌ ‌నౌకరోళ్ళ జీతాలిచ్చుకుందాం’’అని జెప్పిన నోరు తాటి మట్ట గీట్లయితె యేం జేయాలని నౌకరోళ్ళు సుత సోంచాయించుతాండ్లు’’అని జెప్పుకుంట నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు…”

vikramarkuduuచెట్టు కొద్ది గాలన్నట్టే,మనిషి కొద్ది ఆశ.ఆశలేని మనుషులే లోకంల కాన్రారనే అనుకోవాలె!పుసుక్కున గన్కుంటె లేనిపోని కొత్త ఆశలు దోశిట్ల బుట్టిత్తరు.గిట్లాశ పడెటోళ్ళు గది నిరాశైతె కర్మనుకుంటరు.జరంత నిజమైతె గన్క యెములాడ రాజన్నకు,మాడారం సమ్మక్కకు ముడుపులు కడ్తరు.ఆశ పడెటోళ్ళు అవుతలోళ్ళకు బెల్లప్పాసొంటోళ్ళే!అయిందాకులబెట్టి కానిది కంచంల బెట్టే ఏలికల నాలికెలు తాటిమట్టలైతాంటె ఆశలు నిరాశవుడే గని తీరుడుండది.వెయిమంది జీవిడిశి తెచ్చుకున్న  తెలంగాణల కోటి ఆశలు తీరుతయనుకున్నం.ఆరేండ్ల సంది ఆశలు నిరాశలైతాండె! తెలంగాణ బతుకు మళ్ళ గఢీల గల్మ కాడ కావలి కాశే కాడికచ్చె! ఆశలు నిరాశలవుడు రివాజైనంక మళ్ళ జెండెత్తుట్ల ఆలిశెమెందుకయితాందో సమజైతలేదు.

‘‘వారీ ! యేం నౌకరిజేత్తానవురా!’’అంటె అవుతలోని ఆశలతోని అడుకునేటి నౌకరని యెవలు జెప్పరు గని మస్తుమంది జేశే నౌకరి దందా గదే!మన ఆశలతోని అవుతలోడు ఆడుకుంటాండని సమజయినా సూత నమ్మెటోళ్ళ సుతుంటరు.గాళ్ళ ను యేమని పిలువాండ్లో యేందో! వాన వరుదలై ఇండ్లూ బండ్లూ కొట్టుక బాయె!అయ్యో!యెంతపనాయె! ఇంట్ల గాసం సుత లేకుంట కొట్టుక పాయె!అని లబ్బ లబ్బ మొత్తుకుంటిరి.బస్తీలన్ని శెరువులైనయి.సర్కారే యేమన్న ఆదుకోవాలన్న ఆశ నినాదమై తొవ్వెక్కింది.జనం ఆశ తోని అందరాటాడుకున్నరు.సర్కారోళ్ళ పాట పదివేల రూపాలు.ఇంకోళ్ళు ఇరువై అనెఇంకోళ్ళు యేకంగ యాభై అనిరి.’’ఛలో!కొట్టుక పొయిన బండ్లు ఇప్పిత్త’’మంటిరి. పదివేరూపాల పంపకాలు పంపుచారైంది.ఆకరుకేమయింది!ఆశ నిరాశై బోడిగుండు మిగిలింది.ఇన్సున్స్ ‌కాయితలుంటె యెంకులాడుక రమ్మనె! అనుకున్నదే అయిందుల్లా!ఆశలు దోశెలైనయి.తామర్లు పూశేదాంక ఎదురు జూశిన కండ్ల తోటి జనం  బక్రా అయిండ్లు.

ఇసొంటి జనం ఆశలు మస్తు ఉల్టా పల్టాలైతాంటయి. దళితుడు ముక్కెమంత్రి జేసుడే నన్న దొర మాటేమైంది!? ఆశతోపోలిగె పేలింది. అటెంకేమయింది! దొరే దళితుడైండు.దళితులను పత్తకు లేకుంట సాగదోలె!పగదే అయింది!లచ్చ నౌక్లమయినయి?సదూకున్న పోరగాండ్ల ఆశ చెట్టు కొమ్మకు ఉరితాడై యేలాడింది. గడ్డి మందు తాగి జీవిడిశింది.ఆశలనాగం జేశి,నౌకర్లీయని సర్కార్‌ ‌నేమనాలె!

- Advertisement -

నీళ్ళు,నిధులు,నియమాకాలని జెప్పి శిలుంబట్టిన తెలంగాణ ను ‘మెరుగుబెట్టి’ బంగారు తెలంగాణ తెచ్చిన మంటిరి. జెండెక్కిచ్చిన జనం ఆశలేమైతానయో తెల్శిందే కద! లచ్చల నౌకర్లు ఇత్తమని బుట్టిచ్చిన ఆశలు యేడాగమైనయో మాగనే యెరుకైతాందికద!ఉన్న నౌకరోళ్ళ బతుకులెట్లున్నయో దినాం మీడియా ముచ్చట్లే జెప్పబట్టె!నౌకరోళ్ళని యెవలన్న మందలి
చ్చి జూడుండ్లి! పుట్టెడు దుక్కంతోని బోరుమంటరు. గీడ నౌకరు జేశి బతుకుడు కంటె బస్టాండ్ల దస్తి బరుసుకోని కూసునుడే జరం నయం!నౌకరోళ్ళుసుత మనుషులేనాయె!గాళ్ళకు సుత  ఆశలుంటయి.గాళ్ళ ఆశలు కడుపు గాలిన ఆశలు. డొక్కలెండిన ఆశలు.అప్పుల పాలైన ఆశలు,నెల మద్దెన ఇంటామె పుస్తెలమ్ముకునే గతిమెల్ల ఆశలు. యేండ్ల సంది నౌకరి జేశిన కాడ  సర్కార్‌ ‌లెక్కలమీంకేలే జీతం జరంతన్న  పెరుగాలనే ఆశ. గీ ఆశ చిన్నదే!రాజకీయాలు జేశేటోళ్ళ కుండే ఆశల తీరుగాదు.నిశాని అయినా సరేగని గల్లీ కాన్నుంచి ఎర్రబుగ్గ కారెక్కి తిరిగేటి మంత్రి కావాలనే ఆశాసొంటిది కాదు.ఎవలికి వాళ్ళు గాళ్ళ యవారం దగ్గట్టుగ దగ్గరపట్లున్న ఓ నాలుగు సర్కార్‌ ‌బూములు కబ్జా జేసుకొని పైనోళ్ళను,కిందోళ్ళను అర్సుకుంటె దశ తిరిగి ఆశలే గాదు ఆశల బాబులు సుత తీరి కాళ్ళకాడ పడుంటయి.నౌకరోళ్ళు గా తీరు గాదాయె! నెలాకరికి చేతుల బడే సాలీ సాలనీ జీతానికి సుత తీరొక్క సర్కార్‌ ‌పన్నులు కట్టాల్నాయే! జీతం ముల్లె వచ్చుడాలిశెం లేకుంట యేడికాడికి పంచుడు,మిత్తీలు కట్టుడైనంక మిగిలేదెంతో యెంత మంది •రుకుల్లా!ఇంటిల్లి పాది అవుసరాలు అప్పుతోవలు జూపిత్తె తెచ్చిన జీతం ముల్లె నెలమద్దెన సుక్కలు జూపెడుతది. మిత్తీలకు మిత్తీలు గట్టే నౌకరోని బతుకుల ‘‘జీతం పెరుగుతది, తీ’’! అనెటి ఆశొక్కటే ముందుకు నడిపిత్తది. సర్కార్‌ ‌నౌకరన్నంక సవ్వాలచ్చ పనులుంటయి.పైన కానూన్‌ ‌జేశి కిందికి పంపుడు మటుకేనాయె!ఎసొంటి కానూనైన దానెంబటుండే పనేదైనా  గాన్నుంచి కిందిదాంక గుంజుక పోయెటోళ్ళు నౌకరోళ్ళేనాయే! చీమల తీర్గ తల్కాయెత్తకుంట పొద్దుననంగ బోయి చీకటాయేటాలకు పని జేశి ‘పైలు’ కోసం కాలెండర్‌ ‌మొగాన జూసుకుంట వుండెటోల్ల ఆశలు నాయమయినయే!ఏ కాలం జూశినా గొర్రె తోక బెత్తడన్నట్టు ముప్పయ్యేండ్లు నోకరి జేశినా పెరిగేటియి అవుసురాలే గని జీతం గాదాయె! వందలల్లుండే ఉప్పు,పప్పు నెల సాదర లెక్కలు వేలల్ల బడ్డది.ఏది కొనబోయినా నెలనెలకూ పిరం గాబట్టె!వస్తువు జేశెటోని కాడఅగ్గువసగ్గువకు కొని వస్తువు దర గింతని నిర్ణయించేది దళారోల్లయి నెల జీతగాండ్ల బతుకులాగం జేయబట్టిండ్లు.సర్కార్ల దయ తోని గిప్పుడు ఉప్పు,పప్పు నూనె బెల్లం అమ్మేటి కార్పొరేట్‌ ‌మాల్‌ అడ్డాలు గల్లిగల్లిల కానత్తనాయి. చిల్లర దళారోళ్ళు పోయి కార్పొరెట్‌ ‌దళారీలు రాజ్జె మేలబట్టె! రాజ్జెం దళారోళ్ళ చేతులల్లుంటె, సర్కార్‌ ‌జుట్టు కార్పొరేటోళ్ళ చేతులుండె! కార్పొరేట్లే రాజ్జెమేలు తాండె!గాళ్ళ జేప్పిందానికల్ల జీ హుజూరనే సర్కార్‌ ‌నౌకరోల్ల ఆశలతోని దినానికో ఇచ్ఛంత్రం జేయబట్టె! అగ్గో!జీతాలు పెంచినం,ఇగ్గొ జీతాలు పెంచినమని టీ.వీ.ల జెప్పబడితిరి.గీ యేతులు శెప్పబట్టి రొండేండ్లు దాటింది గని రూపాయి సుత పెరిగింది లేదు. కరోనా కాలమని జెప్పి కోశిన సగం జీతాలు కిస్తీల లెక్కన ఇయ్యబట్టె!పాత సిన్మా టాకీస్‌ ‌ల కాడ ఎన్కట గారెడాట అయ్యేది. గసొంటి గారెడాటే గిప్పుడు  సర్కారాడబట్టింది.

సర్కార్‌ ‌సదువులు జెప్పే బరువు దించుకోవాలనే జూత్తానట్టు గొడ్తాంది.సర్కార్‌ ‌బళ్ళను,పంతుళ్ళను ఆగంజేశే ముందు గాళ్ళ సంఘాలను కుక్కలు జింపిన ఇస్తారి తీర్గ ఆగం బట్టించింది. ‘‘దొరా! నీ బాంఛను,కాళ్మొక్తం!’’ అనెటోళ్ళకేమొ బిరియానీ దావత్‌ ‌లిచ్చి,అలాయి బలాయిచ్చి అలుముకున్నది. నిలేశి,నిలదీశే సంఘాలను  గఢీ గల్మ లోపటికిసుత రానిత్తలేదు.అందరియి సూత
ఆశలే!ఆశలల్ల యెక్కువ తక్కువలుంటయా! ఎలచ్చన్ల గాలి గొట్టినప్పుడల్ల  సర్కార్‌ ‌నౌకరోళ్ళ ఆశల్ని తూర్పార బట్టుడు రివాజైంది. ఆశలను  గాలిబుగ్గల తీర్గ ఊది,ఊది పలగ్గొట్టబట్టింది. నౌకరోళ్ళు గద్దెమీదున్నోళ్ళ నౌకర్లు ఊడబీకాలనుకుంటె ఆగబట్టుడైతె ఎవలితరం గాదుల్లా!

’’సూడ్రా! బయ్‌!ఇ‌క్రమార్క్’’!  ‘‘ఇప్పటిదాంక యిన్నవు గద! కొత్త రాష్టమాయె!కరోనా కాలమాయె!ఆమ్దానీ ఆగమాయె! కోటెకురాలు తడిపే కాళేశ్వరంకన్న,రైతుబందులకన్న,పించన్ల కన్న జీతాలిచ్చేపైకమే యెక్కువైతాందట!?గీయన్ని యెవలు జూడాలె!?నెల
కాంగనెకాయంగచ్చేటియేనాయె!నౌకరోళ్ళ ఆశలను ఆడియాశలు జేత్తమని సర్కార్‌ ‌జెప్పిందా! నౌకరోళ్ళు జీతాల పెంచాలని సర్కార్‌ ‌సుత అంటాంది కద!రొండేండ్ల సంది గీ ఇకమతు మీదనే కిందుమీదు కాబట్టె!అయినా సుత నౌకరోళ్ళు,పంతుళ్ళు గిట్లధర్నాలెందుకు జేయబట్టిండ్లు!నా ప్రశ్నకు జవాబియ్యకుంటె  మళ్ళబొయిచెట్టుకొమ్మెక్కుత!నీ ఆశను నిరాశైతది పైలం!’’అని యెప్పటి తీర్గనే బెదిరిచ్చేటి బేతాళుని శవాన్ని బుజాన్నేసుకొని ‘‘ఇను బేతాళ్‌! ‌యేంజేయాలె!యట్ల జేయాలె!? అని రొండేండ్ల సంది సర్కార్‌ ‌సోంచాయించే పనిమీద మాగనే వున్నదిగని,నౌకరోళ్ళ ఆశల తోని ఆడుకునుడు ఆగం జేసుడే కద!ధర్నాలు జేసుడుకన్నా జేశేదేమున్నది.‘‘తెలంగాణ యేరు పడ్డంక సెంట్రలోళ్ళ జీతాలకన్న బేత్రిన్‌ ‌గ మన తాన సర్కార్‌ ‌నౌకరోళ్ళ జీతాలిచ్చుకుందాం’’అని జెప్పిన నోరు తాటి మట్ట గీట్లయితె యేం జేయాలని నౌకరోళ్ళు సుత సోంచాయించుతాండ్లు’’అని జెప్పుకుంట నడ్వ బట్టిండు..నడ్వ బట్టిండు…

–       ఎలమంద – తెలంగాణ

Leave a Reply