Take a fresh look at your lifestyle.

ఆడపిల్లే అవనికి వెలుగు

చదువులో, పనిలో, తెలివిలో, క్రీడలలో, ఇంటా బయటా ఆకాశంలో సగమంటూ వివిధ రంగాల్లో నేడు అమ్మాయిలు రాణిస్తున్నారు. అయినా ఆడపిల్లలకు నేటికికి సమాజంలో అనేక ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ముక్కుపచ్చలారని బాలికలపై అఘాయిత్యాలు నానాటికి పెరుగుతున్నాయి.   పిల్లలపై లైంగిక దాడుల్లో తొంభై శాతం తెలిసిన వారే చేస్తున్నారు. లైంగిక దాడుల తర్వాత నేరం రుజువు కాకుండా హత్యలు చేయడం మరింత గగుర్పాటు కలిగించే అంశం. ఇరుగుపొరుగు వారు, దగ్గరి బంధువులు సంఘటనకు కారకులైనపుడు పరువు కోసం పోలీస్‌ ‌స్టేషన్లో నమోదు కానీ ఉదంతాలు అనేకం. పురుషాధిక్యత, వివక్ష, అసమానతలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, సామాజిక, ఆర్థిక కారణాలు, బాల్య వివాహాలు అనేక అంశాలు ఆడపిల్లల అభివృద్ధికి ఆటంకమవుతున్నాయి.  మహిళా సాధికారతకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.

వివిధ సర్వేల  ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం  వందల, వేల సంఖ్యలో పసికందులు, బాలికలు, యువతులు అదృశ్యమౌతున్నారు. నిత్యం గృహ హింసలు, అత్యాచారాలు మితిమీరి పోతున్నాయి. పిల్లలను అపహరించి యాచక వృత్తిలోకి దింపడం, బాలికలను, యువతులను అపహరించి వ్యభిచార గృహాలకు అమ్మడం, విదేశాలకు తరలిస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం స్త్రెలలో అవిద్యే.  దేశంలో, ముఖ్యంగా  గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో  బాలికల అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. విద్యా వంతురాలైన తల్లి తన పిల్లలకు సమాజంలో గౌరవ ప్రదమైన స్థానమంకోసం అవసరమైన శిక్షణ నిస్తుంది. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తుంది. స్త్రీలకు తమ కాళ్లపై తాము నిలబడగలమన్న నమ్మకం ఉన్నపుడే  ఆత్మ విశ్వాసం కలుగుతుంది.   మధ్యలో బడి మానివేసే వారి శాతం బాలురకన్నా బాలికలలో ఎక్కువగా ఉంది. ఇది బాలికా విద్యకు పెద్ద ఆటకం. ఆడపిల్లల పెంపకంలో తలిదండ్రులు వ్యత్యాసం చూపుతున్నారు.  తల్లిదండ్రుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఆడ, మగ తేడాలేకుండా పిల్లలను సమానంగా పెంచాలి. అవకాశాలు కల్పిస్తే బాలికలు కూడా అన్ని రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు.

ఆడపిల్లలు చదువుకు  ప్రభుత్వాలు అనుకూల పరిస్థితులు కల్పించాలి. ప్రతి మండలానికి ఒక బాలికల జూనియర్‌ ‌కళాశాల  ఏర్పాటు చేసి బాలికా విద్య అవసరాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. బాలికలకు ఉచిత రవాణా, మెరుగైన హాస్టల్‌ ‌సౌకర్యం కలిగించాలి.  బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు, విశ్రాంతి గదులను కేటాయించాలి. బాలికల కొరకు ప్రత్యేక నవోదయ పాఠశాలలు తెరవాలి.   బాలికలలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలి. బాలికలకు  పౌష్టికాహారం అందేలా చూడాలి. ఓపెన్‌ ‌స్కూల్‌, ‌దూర విద్య కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా అందుబాటులోకి రావాలి.  భ్రూణ హత్యలు నివారించాలి.   బాలికల, మహిళల కోసం చేసిన చట్టాలను పటిష్టంగా అమలుపర్చాలి.  హింస, అత్యాచారానికి గురైన బాధితులకు సత్వర న్యాయం అందించి దోషులకు కఠిన శిక్షలు విధించాలి.  విద్య, సామాజిక రంగాలలో బాలికల ఎదుగుదలకు 2008 నుండి కేంద్రం  నేషనల్‌ ‌గర్లస్ ‌డేవలప్మెంట్‌ ‌మిషన్‌ ‌పేరుతో ప్రతి జనవరి 24 న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల దినోత్సవం నిర్వహిస్తున్నారు. భేటి బచావ్‌, ‌భేటి పడావ్‌ ‌పథకం వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నది.

తెలంగాణ లో బాలికల కోసం ప్రత్యేక సంక్షేమ హాస్టళ్లను ఏర్పాటు చేసి బాలికల చదువుకు అనువైన పరిస్థితులు, సౌకర్యాలు ఏర్పాటు చేయడంవల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించడానికి ముందుకు వస్తున్నారు. బాలికలకు ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించడం, బాలికల ఆరోగ్యం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. జాతీయ అక్షరాస్యతతో పోలిస్తే తెలంగాణలో బాలికల అక్షరాస్యత శాతం ఎక్కువ.  చదువులోనేగాక క్రీడా, సాంస్కృతిక, సాహిత్య రంగాలలో కూడ వారు రాణిస్తున్నారు.  పర్వతారోహణలో కూడా తమకు సాటి లేరని నిరూపించు కుంటున్నారు.

కళ్యాణలక్ష్మి, షాది ముబారక్‌ ‌పథకాల వలన తెలంగాణలో బాల్యవివాహాలు  తగ్గుముఖం పట్టాయి. చదువు తర్వాతే పెళ్లి అని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.   షీ టీమ్స్ ‌కూడా బాలికల రక్షణకు బాసటగా నిలుస్తున్నాయి. డయల్‌ 100 ‌నెంబర్‌ ‌గురించి పోలీసులు వివిధ పాఠశాలలో, కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు కూడా బాలికల భద్రతకు భరోసాగా నిలుస్తున్నాయి. బాలికలను సామాజిక వివక్షత, దోపిడీ నుండి రక్షించడం అనేది కేవలం ప్రభుత్వ భాద్యతే కాకుండా ప్రతి ఒక్కరిది. ఆడపిల్లల పట్ల వివక్షతకు తావులేకుండా ప్రతి ఒక్కరూ కృషి చేసినప్పుడే ఆడ, మగ వ్యత్యాసాలు సమసిపోయి ఆడపిల్ల అవనికి నిజమైన వెలుగు అవుతుంది.

కందుకూరి భాస్కర్‌

Leave a Reply