Take a fresh look at your lifestyle.

రుబాయిలలో జ్ఞానలోకం…

వస్తుభావ వైవిధ్యాన్ని, సౌందర్యాన్ని దర్శిం పజేసే ప్రక్రియగా రుబాయిలకు పేరుంది. తెలుగు రుబాయిల ప్రయోక్తగా మహాకవి డాక్టర్‌ ‌దాశరథి ప్రసిద్ధులయ్యారు. ఆ పరంపరలో ఎందరెందరో కవులు రుబాయిలను రాశారు. మనసు మూల మలుపులో మినుకు మినుకుమనే జ్ఞాపకాన్ని పలకరించి  స్పర్శించిన అనుభూతిని డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి ఆలోచనాత్మకమైన తెలంగాణ  రుబాయిలుగా మలిచారు. కవి సునిశిత కవిత్వ  గుణానికి ఒక్కో రుబాయి ప్రాతినిధ్యం వహించింది.
తెలంగాణ రుబాయిలు చదువుతూ వెళ్తే ఎందరో నిష్ణాతులను ఆత్మీయంగా ప్రత్యక్షంగా కలిసినట్టు అనుభూతి మిగులుతుంది. ఇది ఒక రకంగా  కవిలో ఉన్న ఉన్నతోన్నత సృజనకు తార్కాణమనిపిస్తుంది. మనిషి జీవిత క్రమంలో చూసిన దృశ్యాలు, సందర్భాలు, గుర్తుండిపోయే సన్నివేశాలు, సంఘటనలు, క్లేశాలు  ఈ రుబాయిల నిండా నిండారి ఉన్నాయి. ఆత్మ పలికిన భావంలా రుబాయిలకు అక్షరీకరణ జరిగింది. రుబాయిలలోని నాలుగు పాదాలలో  ఏ పాదంలో ఎంత వరకు చెప్పాలో, ఎన్ని భావాంశాలుగా పాదాలను విభజించుకోవాలో అన్న విషయాన్ని స్పష్టంగా ప్రణాళికతో  స్పష్టీకరించుకొని రచన కొనసాగింది. తెలంగాణ భాష, నుడికారాల ప్రయోగంతో పాటు  మనిషిని యంత్రంగా  మారుస్తున్న సాంకేతిక పరిజ్ఞానపు విషయాంశాల వినియోగంతో రుబాయిలకు విలక్షణత ఏర్పడింది. ప్రయోగంలో వైవిధ్యం, చమత్కార  సాధనలో నైపుణ్యంతో అభివ్యక్తిలో  కొత్తదనం చేకూరి రుబాయిల్లో  స్వయం సమగ్రత కన్పించింది. వస్తు వైవిధ్యాన్ని పాటించడంలో కొన్ని రుబాయిలలో కవి కత్తి మీద సాము చేసి కూడా నిపుణతను అదే ఉధృతిలో  కొనసాగించడం చెప్పుకోదగిన అంశం. పాదాల నిర్మాణ  నిర్వాహణ, చతురత కూడా ఈ సందర్భంగా  ప్రస్తావించదగిందే. కొత్త పోలికలను ఎత్తుకొని ఆసక్తికరంగా వ్యక్తీకరిస్తూనే ప్రత్యక్షంగా హితబోధ, అదృశ్యంగా ఆత్మ బోధ చేస్తూ సున్నితంగా అధిక్షేపించడం, సరళతను పాటించడం ద్వారా అర్థవంతమైన  ఈ రుబాయిల ప్రామాణికత ఎంతో పెరిగింది.
ఆటలోనే  సంగతి గుర్తుకున్నది
ఆదిలోనే ఒప్పుకున్నది గుర్తుకున్నది
వెన్నుపోటె కొత్తగానిబీ  యుద్ధమంత పాతదె
చివరి దాకా పోరుమన్నది గుర్తుకున్నది
పోరాటం ఎడతెగనిది అని చివరి దాకా పోరుమని  గుర్తు చేశారు. కొంత కాలమే మనిషికి పుడమితో రుణం ఉంటుందని చేయవల్సిన పనులేవో గుర్తుపెట్టుకొని ముందుకు సాగాలని అన్నారు. చివరి దాకా జీవితంతో పోరాటమే ఉంటుందన్నారు. కోరుకొని పుట్టడం, కోరినంతనే గిట్టడం సాధ్యం కాదని ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదని అన్నారు. మనిషిని గాయపరిస్తే మళ్ళీ కల్వలేమని, ప్రేమించడంలో మునిగిపోతే ద్వేషించడం ఉండదని అన్నారు. లోకం ఒక చూపరి అని చెప్పి  ఎవరిని వారే శ్రద్ధగా కాపాడుకోవాలని అంటారు. ఏ విషయం గురించైనా  నిర్ధారణ కోరితే లోలోతులను చూడాలని అది భూగోళం చుట్టూ  పొద్దు తిరిగినట్టు అవుతుందని అంటారు.
లక్ష్యం ఆగం చేసే అవకాశాలు వద్దు
గమ్యాన్నే దూరం చేసే జాక్‌పాట్లు వద్దు
చెట్టు బతకడానికి తుంపర సేద్యమే చాలు
కూర్చుంటే కనిపించని కుర్చి అస్సలు వద్దు
ఆడినప్పుడు ఆట విలువ, దుంకినప్పుడు స్వేచ్ఛ ఎత్తులు తెలియరానట్టే అనుభవించిన క్లేశమే చివరకు చుక్కానిగా మారవచ్చని ఒక రుబాయిలో అంటారు. భాష్యం ఎక్కువైతే భావన, వచనం ఎక్కువైతే కవిత, సంపదలు ఎక్కువైతే ప్రేమ తగ్గుతుందన్న సత్యాన్ని వెల్లడించారు. ప్రతీదీ ఒక కాలానికి పరిమితమవుతుంది అంటూ నీతి, ఖ్యాతి ఒక కాలంలోనే చలామణి   అవుతాయని చెప్పారు. కష్టమంతా పోతపోసి  బతుకునంతా తవ్విపోసిన ఆనవాలే వెతల సూచిక అంటారు.
శ్వాసదీసిననాళ్ళు సౌఖ్యంగ ఉండాలి
ఊపిరున్నన్నాళ్ళు ఉత్సాహముండాలి
కాయలన్నీ చెట్టు వీడునని తెలుసూ
పండు రాలేదాక పుండురాకుండాలి
తుదిమొదలు లేని వలయంలో  ప్రయాణం ఎక్కడికి, ఎవ్వరిని చేరిందని ప్రశ్నిస్తారు. అల్పపీడనం వైపే గాలి ప్రయాణం సాగినట్టు ప్రతినడక అనుకూలం వైపే ఉంటుందని స్పష్టం  చేశారు. మనుగడ, నడవడిని నియంత్రించుకుంటే వికాసం వికసితమవుతుందని చెప్పారు. ఎదురుచూపు,  వీడ్కోలలో  ఉన్న తియ్యదనం, కలిసినప్పుడు  కనిపించే అలజడిని బేరీజు వేయమంటారు. కంటి నీటికి కారణాలు తెలిస్తే మనస్సు లోతుగాయాలను  అంచనా కట్టవచ్చని అంటారు. మనస్సులోని అందాలకు కొలమానం లేదని, అది సహజ సౌందర్య శోభితమని కూడా చెప్పారు. మనస్సు ఉతికి ఆరేసే మనోవ్యధలను చెంప మీద జారే కన్నీటి చుక్కను  తడిమితే స్పష్టంగా అర్థమవుతాయని అన్నారు. మనస్సు పిట్ట ఊహా లోకంలో ఒంటరి కోర్కెయై ఎగురుతుందని అంటారు.
జ్ఞాపకాన్ని  అణచిపెట్టుకోకు
అనుభవాన్ని పాతిపెట్టుకోకు
కలవరాలు ఎన్నున్నా సరే
ఆకాంక్షను తొక్కి పెట్టుకోకు
ఏ తొడుగులు, భేషజాలు, నటనలు, భుజకీర్తులు లేకుండా కలుద్దామంటూ ఆప్యాయంగా పిలిచారు. పుట్టగానే ఆట, అంతకు ముందే సయ్యాట మొదలై సర్దుకుపోవుడం శాశ్వతమైందని  అంటారు. నీరు నిక్కమైనదని అన్నారు. శ్వాసల్లో ముండ్ల కొసలు పెరిగి పోయాయని బాధపడ్డారు. కాలచక్రం తిరుగుతూ గాయం మాసిపోతుందని భరోసా అద్దారు. గాలి గీతాలు, కొత్త లోకాలను అంతం లేని కాలవాహినిలో వెతికిపట్టుకొమ్మన్నారు. కన్ను, గళం ఏదో ఒకసారి మూతపడేదే అని చెప్పారు. తెల్లని ఊహలు, చల్లని కోర్కెలు వసుధపై ఎల్లలు లేకుండా  విస్తరించాలని ఆశపడ్డారు. కళ్ల ముందు చరించే క్షణమే చరిత్ర అన్నారు. నెట్టు, ఫోను లేని రోజును కోరుకుంటూ దయ్యంలా టెక్నాలజి శాసిస్తుందని చెప్పారు. ప్రతి జీవి ఈ భువిలో ఒక చిత్రమే అని అన్నారు. మాట నిలబడడం చాలా కష్టమని  చెప్పారు. గిరిగీసుకొనే మనుషులను తలచుకొని బాధపడ్డారు. ఆనందమే కాదు బాధను పంచుకునే వారే సొంత లోకపు సహచరులు అన్నారు. ఆచరణే గీటు రాయిగా అడుగేస్తే లోకం మారుతుందంటారు. స్వేచ్ఛను  ఎట్టి పరిస్థితుల్లో బంధించలేమని చెప్పారు. స్వశక్తిని దాచుకోవద్దంటారు. మానవత్వం తేలివచ్చి ముఖాలలో ఆనంద కాంతులు వెల్లివిరియాలని కోరుకున్నారు. మాట కావలె కర్ణపేయము/  మనసు కావలె హృదయ పేయము అని చెప్పారు. జ్ఞాపకం చెదరని  పరిమళం/  నమ్మకం విరిసిన సుగంధం అన్నారు. ఎడారిలోకి తరిమితే ఇసుకతో,  తీరానికి నెట్టేస్తే గవ్వలతో ఆడుకుంటానని చెప్పారు. లోకాన్ని, శోకాన్ని వదలని దుఃఖాన్ని చూసానన్నారు.

ఈ పడవను నిలిపేదెలా
ఈ పరుగును నిలిపేదెలా
కాళ్ళల్లో ఇన్ని కట్టెలు
ఈ నడకను నిలిపేదెలా
చూపులోన, సృష్టిలోన అద్భుతాలు దాగి ఉన్నాయని అంటూ సూత్రీకరణలు ఎన్ని ఉన్నా సరళంగా, సహజంగా ఉండాలన్నది మనిషి నేర్చుకోవాలని చెప్పారు. జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగుతుందని చెప్పారు. అన్ని తెలిసినా అవే ఆశలు పెట్టుకొని భ్రమలలో తిరిగే మనిషి బతుకు అర్థరహితంగా మారిందని చెప్పారు.
ఎంత రాసినా ఒడువని ముచ్చట
ఎలా చెప్పినా తరగని ముచ్చట
మనిషి నడతలో అంతా గడబిడ
ఎంత  పొగిలినా తీరని ముచ్చట
తాను నడిచిన నేలను, బతుకులోని వాస్తవాన్ని మరచిపోవద్దన్నారు. చిరుమొక్కల వికాసమే కీర్తికిరీటం ఎగిరిందనడానికి గుర్తు అని తెలిపారు. దొరక కూడనివి పరుగెత్తినా వలవేసినా, తపస్సు చేసినా  దొరకవన్నారు. స్వేచ్ఛాంకురాలను బంధించడం మూర?త్వమని, ఎడతెగని జడివానలో నిలిచి కన్నీరంతా వగచి మరచిపో అంటారు.
నీవులేని సందర్భంలో నీ దృశ్యం ఉందా
నీవులేని ప్రాదేశికలో నీ వాక్యం ఉందా
నీ ముందటి సంభాషణలన్ని నువు నిజమనుకోకు
నీవు లేని ఏ చోటన, నీ జ్ఞాపకం ఉందా
నువ్వున్నప్పుడు,  లేనప్పుడు జరిగేదేమిని అన్న మాటలకు ఈ రుబాయి ద్వారా చాలా స్పష్టత  ఇచ్చారు. గాలి బహు తుంటరిది/  చేల ఎదన చేయేస్తూ పలకరిస్తది అని ఎంతో  భావాత్మకంగా ఒకచోట చెప్పారు. కాలిబాట కనుమరుగైనట్టుగా జ్ఞాపకమూ క్రమంగా ఆవిరై పోతుందన్నారు.
రాజులే కైకట్టి రాతరాసిన  భాష
సైన్యాధికారులే రచన చేసిన భాష
వేలేండ్ల కిందటా మొలకెత్తి నా తెలుగు
దేవతా వాక్కునకు చేరువయ్యిన  భాష
తెలుగు వెలుగును ఈ రుబాయి ప్రభవింపజేసింది. ద్రవిడ భాషలలో పెద్దోడు తెలుగు అని చెప్పారు. పాలకుర్తిలోన జాను తెలుగును ప్రస్తుతించారు. మనసుకన్నా చిన్నదైన సాఫ్ట్ ‌వేర్‌ ‌వల్ల విశ్వమంతా వేరువేరుగా విడిపోతుందని  వేదన చెందారు. కాలం గీసిన చిత్రపు చిత్రానికి కాలాతీత స్థిరత ఉందని అన్నారు. ఒక్క నాలుక వేయి తీర్లుగ మర్లవేయుట గొప్ప కాదని చురకంటించారు.  నిగారింపు పూవులతో సద్దుల బతుకమ్మకు మనసారా స్వాగతం చెప్పారు. బహుజనమే భవిష్యత్తులో మనుగడ చేపడుతుందని తెలిపారు. ధరణిలో ధన్యులెవరో క్రమానుసారంగా విశ్లేషించారు.
లోకం విస్తరిస్తున్నది నిజమే
శాస్త్రం పరుగు తీస్తున్నది నిజమే
ఇద్దరు మనుషులకు నడమ అంతరం
వటవృక్షమై  నిలుస్తుంది నిజమే
పెరుగుతున్న జీవన వేగంతో తెగిపోతున్న బంధాలను గమనించమన్నారు. రాళ్ళు విసరడం, దుమ్ము జల్లడం, పడగొట్టడం సులభమే కాని ఏదైనా దీక్షతో  నిర్మించి చూసావా అని సూటిగా  ఒక రుబాయిలో ప్రస్తావించారు. మనసు వాహినిలో కొత్తనీరు నిండినప్పుడే అది చైతన్య ప్రపూర్ణమని తెలిపారు.
నలుగురితో కలవడమే నిజమౌ టానిక్‌
‌పలువురితో సంభాషణ నిజమౌ టానిక్‌
‌కొంటే దొరికేది కాని బలవర్థకమూ
ఉత్సాహం, ప్రోత్సాహం నిజమౌ టానిక్‌
అని కలిసి ఉంటేనే ముందడుగు అన్న సూచన చేశారు. సామాజిక స్పర్శతో వస్తువైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సరళత, సమగ్రతతో ఈ రుబాయిలు సాహిత్య ప్రామాణికతను పొందాయి.
( తెలంగాణ సారస్వత పరిషత్తు – 2022 పురస్కారాన్ని తెలంగాణ రుబాయిలు పొందిన సందర్భంగా ఈ వ్యాసం… )
  – తిరునగరి శ్రీనివాస్‌,  8466053933

Leave a Reply