Take a fresh look at your lifestyle.

జల జగడం

పోతిరెడ్డిపాడుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల యుద్ధం
సవాళ్లు, ప్రతి సవాళ్లతో రక్తి కడుతున్న రాజకీయం
రాయలసీమ రతనాలసీమ హామీ ఏమైందంటున్న ఏపీ టీడీపీ నేతలు

తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టుల ద్వారా అక్కడి ప్రాజెక్టులకు మళ్లించడంపై తలెత్తిన వివాదం చిలికిచిలికి గాలి వానగా మారుతున్నది.  తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి సీఎం కేసీఆర్‌  ‌రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి కంకణబద్దులై ఉన్నారని కాంగ్రెస్‌, ‌బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పోతిరెడ్డిపాడుపై ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులను అడ్డుకోవడంలో వైఫల్యం మీదంటే మీదేనంటూ పరస్పర విమర్శలతో రాష్ట్ర రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. దీనికి తోడు ఏపీకి చెందిన టీడీపీ నేతలు సైతం గతంలో ఏపీలో పర్యటించిన సందర్భంగా రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదేనంటూ సీఎం కేసీఆర్‌ ‌చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఏపీ  ప్రభుత్వం జారీ చేసిన జీవో 203తో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర నష్టం కలుగుతుందనీ దీనిని అడ్డుకునేందుకు టీ కాంగ్రెస్‌ ‌నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర జల్‌శక్తి మంత్రికి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 5న రెండు రాష్ట్రాల సీఎంలతో ఏర్పాటు చేసిన అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశానికి డుమ్మా కొట్టడం ఈ సమావేశాన్ని ఆగస్టు 20 తరువాతనే నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ‌కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాయడం ఏపీ ప్రభుత్వానికి మేలు చేసేందుకేనని టీ కాంగ్రెస్‌ ‌నేతలు ధ్వజమెత్తుతున్నారు. పోతిరెడ్డిపాడు అంశంపై దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందనీ, దీనిపై బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచందర్‌రెడ్డి విసిరిన సవాల్‌కు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ‌నేతలు ఎవరూ స్పందించలేదు. దీంతో సీఎం కేసీఆర్‌ ‌దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని తాము చేస్తున్న ఆరోపణలు నిజమైనట్లేనని వంశీచంద్‌ ‌స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయని పక్షంలో బహిరంగ చర్చకు రావడానికి టీఆర్‌ఎస్‌ ‌నాయకులకు భయమెందుకని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, కృష్ణా జలాల వినియోగంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీ ప్రభుత్వ అనుకూల వైఖరి ప్రదర్శించడం సరైంది కాదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పునర్వ్యస్థీకరణ చట్టంకు వ్యతిరేకంగా పోతిరెడ్డిపాడులో వాటాకు మించి నీటిని వాడుకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవడంలో విఫలమైందనీ, దీనిపై సీఎం కేసీఆర్‌ ‌జగన్‌ ‌ప్రభుత్వంపై ఎందుకు వొత్తిడి తీసుకు రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రశ్నించారు. అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశానికి హాజరు కాకుండా వాయిదా వేయమని కోరడంలో ఆంతర్యం ఏమ•ని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.203తో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ప్రతిపక్షాలు, రైతులు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేసీఆర్‌కు చీమకుట్టినట్లయినా లేదని ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు, రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదేనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌చేసిన వాగ్దానం ఏమైందని ఏపీ టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో సీఎం కేసీఆర్‌ ఈమేరకు హామీ ఇచ్చారనీ, ఇప్పుడు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును అడ్డుకోవడం ఏమిటని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు అంశంపై తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల పర్వం కొనసాగుతుండగా వీటిపై సీఎం కేసీఆర్‌ ఏమాత్రం స్పందించకపోవడం విశేషం.

Leave a Reply