Take a fresh look at your lifestyle.

కార్మిక నేత నాయినికి కన్నీటి నివాళి

  • ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
  • భారీగా తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు, అభిమానులు
  • శ్రద్ధాంజలి ఘటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

‌తెలంగాణ మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ‌నేత నాయిని నర్సింహ్మారెడ్డి అంత్యక్రియలు గురువారం అశ్రు నయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్య క్రియల క్రతువును నిర్వహించారు. ఆయన కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. నాయిని చితికి ఆయన కుమారుడు నిప్పు పెట్టారు. నాయినిని కడసారి వీడ్కోలు పలికేందుకు ఆయన అభిమానులు, టీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నాయిని బుధవారం అర్ధరాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. గత నెల కొరోనా బారిన పడిన ఆయన 16 రోజుల పాటు చికిత్స పొందారు. ఆ తరువాత కొరోనా నెగిటివ్‌గా వచ్చినప్పటికీ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ ‌సోకడంతో అప్పటి నుంచి అపోలో హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మరణించారు, కాగా, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని సతీమణి భర్తను కడసారిగా చూసేందుకు వీల్‌చైర్‌లోనే మహా ప్రస్థానానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.

భర్తను తలచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. గురువారం ఉదయం నాయిని మృతదేహాన్ని అభిమానులు, టీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల కడసారి చూపుకోసం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ ‌క్వార్టర్స్‌కు తరలించారు. అక్కడ ఆయన భౌతిక కాయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నేతలతో పాటు భారీ సంఖ్యలో ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకర్తగా రాష్ట్ర సాధనకు ఆయన చేసిన పోరాటం మరువలేదనిదని పేర్కొన్నారు, తెలంగాణ తొలి హోం మంత్రిగా చిరస్థాయిగా నిలచి పోవడంతో పాటు కార్మిక నేతగా ఎంతో మంది కార్మికులకు న్యాయం జరిగేలా కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నాయిని అమర్‌రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో తమకున్న ఉద్యమ, వ్యక్తిగత అనుబంధాన్ని తలచుకుని కన్నీరుమున్నీరయ్యారు.  ఆ తరువాత ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు. నాయిని అంత్యక్రియల్లో భాగంగా ఆయన పాడెను మంత్రులు కేటీఆర్‌, శ్రీ‌నివాస్‌గౌడ్‌ ‌మోశారు. మహా ప్రస్థానంలో నాయిని అంత్యక్రియలకు శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, ఎ‌ర్రబెల్లి దయాకరరావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్‌ ‌హాజరయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply