Take a fresh look at your lifestyle.

యోధుడికి కన్నీటి వీడ్కోలు

భారత సైనిక యోధుడికి యావత్‌ ‌దేశం కన్నీటి వీడ్కోలు పలికింది. సైనిక పరంగా భారత్‌కు ప్రపంచంలోని ఎన్ని దేశాలతో సంబంధాలున్నాయో దాదాపుగా అన్ని దేశాలుకూడా తమ దు:ఖాన్ని వ్యక్తం చేశాయంటే ఎంతటి మహా మహుడిని దేశం కోల్పోయిందో అర్థమవుతున్నది. తమిళనాడులోని నీలగిరి జిల్లా కన్నూర్‌ ‌సమీపంలో జరిగిన హెలికాఫ్టర్‌ ‌ప్రమాదంలో త్రిదళాల చీఫ్‌ ‌జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌తో పాటు పదమూడు మంది బుధవారం మృత్యువాత పడ్డారు. ముందుగా తమిళనాడు ఆ తర్వాత దిల్లీకి వీరి భౌతిక కాయాలను చేర్చిన అనంతరం దేశ ప్రముఖులంతా వారికి శ్రద్ధాంజలి ఘటించిన విషయం తెలిసిందే. కాగా దిల్లీలోని ఆయన స్వగృహం నుండి సాగిన రావత్‌ ‌దంపతుల శవయాత్ర అందరి హృదయాలను కదిలించింది. ఆంతిమయాత్ర సందర్భంగా దిల్లీ పురవీధులనిండా బరువెక్కిన హృదయాలతో ప్రజలంతా రోడ్డుకు ఇరువైపుల ఈ దేశభక్తుడి అంతిమ దర్శనంకోసం గంటల కొద్ది బారులు తీరి నిలబడడమే ఆయన పట్ల దేశ ప్రజలకున్న అభిమానం ఎలాంటిదో చెప్పకనే చెబుతున్నది.

శవయాత్ర కొనసాగుతున్న దారిలో మహిళలు, యువకులు జాతీయ పతాకాలను పట్టుకుని, భారత్‌ ‌మాతాకు జై… యోద్ధా అమర్‌ ‌హై.. అంటూ ఈ వీరుని భౌతిక కాయాన్ని ఉంచిన వాహనంపైన పూలనుచల్లి శ్రద్ధాంజలి ఘటించిన తీరు నిజంగానే కన్నీరు పెట్టించింది. దిల్లీలో జరుగుతున్న శవయాత్రను ఎలక్ట్రానిక్‌ ‌మీడియా ద్వారా దేశవ్యాప్తంగా తిలకిస్తున్న ప్రజల గుండెలు కూడా బరువెక్కాయి. భారత్‌ను అనేక క్లిష్ట పరిస్థితులనుండి గట్టెక్కించిన ఆత్యంత నేర్పరిగా జనరల్‌ ‌బిపిన్‌ ‌రావత్‌కు పేరుంది. దేశ చరిత్రలోనే త్రిదళలా చీఫ్ధి గా నియమించబడిన మొట్టమొదటి వ్యక్తి కూడా రావత్‌ ‌కావడం విశేషం. ఆయన ఆ పదవి చేపట్టినన అనతి కాలంలోనే ఆర్మీలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి, సైన్యాన్ని ఆధునీకరించడం ద్వారా అద్భుత సైనికుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఈ సందర్భంగా అనేక దేశాల మిలటరీ వ్యవహారాలతో సత్సంబంధాలను నెలకొల్పడం వల్ల ఆయన మరణంపట్ల వివిధ దేశాలకు చెందిన ఆర్మీ అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేయడమేకాకుండా, తమ సంతాపాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. శ్రీలంక, బూటాన్‌, ‌నేపాల్‌, ‌బంగ్లాదేశ్‌లకు సంబందించిన మిలటరీ అధికారులు స్వయంగా అంతిమ సంస్కార సమయంలో పాల్గొన్నారంటే ఆయా దేశాల ఆర్మీ అధికారుల హృదయాలను ఆయన ఎలా దోచుకున్నారన్నది తెలుస్తున్నది. చివరకు ఇజ్రాయిల్‌ ‌దేశం కూడా సంతాపం తెలిపిందంటే భారత్‌ ‌ప్రతిష్టను ఆయన ఎలా కాపాడుకుంటూ వచ్చారన్నది అర్థమవుతున్నది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా సర్జికల్‌ ‌స్ట్రైక్‌ ‌చేసి ప్రపంచాన్నే ఆశ్చర్యపర్చిన వ్వూహకర్త. ఈ దాడితో పాకిస్తాన్‌ ‌గుండెల్లో దడపుట్టించిన సంఘటన అయితేనేమీ, డోక్లామ్‌ (‌బూటాన్‌)‌లో చైనా ఉద్రిక్తతకు కళ్ళెం వేయడంలో, ఈశాన్య భారత్‌లో తిరుగబాటును నియంత్రించడంలో , మియన్మార్‌లో తిరుగుబాటు శిబిరాలను నిర్మూలించడంలో రావత్‌ ‌పాత్రను భారత్‌దేశం ఏనాడు మరిచిపోదు. భయమన్నదే తెలియని వ్యక్తిగా పేరుండడంవల్లే మోదీ ఏరీకోరి మరో ఇద్దరు సీనియర్‌ ‌మిలటరీ అధికారులను పక్కకు పెట్టి రావత్‌కు త్రిదళాల చీఫ్‌ ‌పదవిని కట్టబెట్టాడంటేనే ఆయన సమర్థతకు నిదర్శనం. అందుకే ఆయన మరణవార్త విన్నవెంటనే ఖిన్నుడైన మోదీ విడుదల చేసిన సంతాప సందేశంలో అత్యంత వ్యూహకర్తగా ఆయన దేశానికి చేసిన సేవ చిరస్మరణీయమని పేర్కొన్నాడు. గత ఇరవై నెలలుగా హిమాలయాల సరిహద్దుల్లో చైనా దురాక్రమణ చేస్తున్నది. అక్కడ ఒకవిధంగా యుద్ద వాతావరణం నెలకొంది. అలాంటి తరుణంలో రావత్‌ ‌మరణం దేశానికి తీరని లోటనే చెప్పాలి.

ముఖ్యంగా ఆయన సహధర్మచారిణి మధులిక రావత్‌కి కూడా ఆయనతోపాటే విగత జీవి కావడం పలువురిని ఆవేదనకు గురిచేసింది. మధులిక రావత్‌ ‌గతంలో సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. వారిద్దరికీ కలిపి ఒకేసారి అంతిమ సంస్కారాన్ని ఆ దంపతుల ముద్దు బిడ్డలు కృతిక, తరణిలు జరుపుతున్న తీరు కూడా ఆందరిని కదిలించింది. ముక్కుసూటిగా తనకు అప్పగించిన బాధ్యతలపట్ల ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, భయపడకుండా చేసుకుపోయే మేరు ధీరుడికి అశ్రునివాళులు తప్ప ఏమివ్వగలం.

Leave a Reply