Take a fresh look at your lifestyle.

అం‌తరించి పోతున్న ప్రకృతి సమతుల్యానికి ప్రతీక.. పిచ్చుక

నేడు అంతరించిపోతున్న పక్షుల్లో పిచ్చుక మొదటి స్థానంలో ఉంది. మన స్వార్థం వల్ల ఓ నిండు ప్రాణాన్ని కనుమరుగు అయ్యేలా చేస్తున్నాం. పిచ్చుకలు ఎన్నో తరాలుగా రైతుల నేస్తాలు..గుప్పెడు గింజలు వేస్తే చప్పున పడి ఉంటాయి. కానీ నేడు సెల్‌ ‌టవర్‌ ‌కాలుష్యం వల్ల, తరిగిపోతున్న ప్రకృతి  సంపద వల్ల ఆహారం కొరత వల్ల, వాతావరణంలో మార్పులు వచ్చి అవి అంతరించి పోతున్నాయి. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతలను కాపాడే పిచ్చుకలను కాపాడు కోవల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది.

వాస్తవానికి పిచ్చుకల ఆహారం పంటపొలాలపై దాడి చేసే చిన్న చిన్న పురుగులు, క్రిమికీటకాలు. ఈ సంగతి గ్రహించని చైనీయులు వాటి వినాశాన్ని కోరుకున్నారు. పిచ్చుకలను విచక్షణారహితంగా కాల్చివేశారు. పిచ్చుకలు లేని కారణంగా పంటలకు మరింతగా పురుగుపట్టి 1958-61 మధ్య కాలంలో చైనా తీవ్రమైన ఆహారకొరతను ఎదురుకొంది. ఈ విషయాన్ని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టిందని అంటుంటారు. కాబట్టి చరిత్ర ఎలా ఉన్నా ఈ చిన్ని ప్రాణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. పర్యావరణాన్ని కాపాడే ఈ పిచ్చుకల జాతిని సంరక్షించుకునేందుకు నడుం బిగించాలి. ముఖ్యంగా పల్లెల్లో నివసించే వారు ఊరపిచ్చుకల గూళ్లు కనబడితే వాటిని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి.

కొన్ని సంవత్సరాల క్రితం ఊర పిచ్చుకలు ఎక్కడ చూసినా కనిపించేవి. ఊళ్లలో ఉండే పెంకుటిళ్ళలో ఇవి ఉండటానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ఇవి పల్లె ప్రజల జీవితాల్లో ఒక భాగంగా ఉండేవి. వీటిని ప్రకృతి సమతౌల్యానికి ప్రతీకలుగా భావించేవారు. ఊర పిచ్చుకల జీవితకాలం 13 సంవత్సరాలు.  పిచ్చుకలు ఒకనాడు పంట చేలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. నాడు గ్రామాలలోని ఇళ్ల ముంగిట ఇవి గుంపులుగా వాలడం ఏదో అలికిడి అవగానే తుర్రుమని ఎగరడం వంటి దృశ్యాలు సందడిగా, చూడముచ్చటగా ఉండేవి.

ప్రపంచంలో సుమారు 35 రకాల జాతుల పిచ్చుకలు ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి. ఇంటి పిచ్చుక, స్పానిష్‌ ‌పిచ్చుక, సింధ్‌ ‌పిచ్చుక, సొమాలి పిచ్చుక, కేప్‌ ‌పిచ్చుక, చిలుక ముక్కు పిచ్చుక, ఎడారి పిచ్చుక, చెట్టు పిచ్చుక, సూడాన్‌ ‌బంగారు పిచ్చుక, అరేబియన్‌ ‌బంగారు పిచ్చుక, ఇటాలియన్‌ ‌పిచ్చుక, ఆసియన్‌ ఎడారి పిచ్చుక తదితర జాతులు ఉన్నాయి.
ఇవి దిగుడు బావులలోకి వేలాడుతున్న చెట్లపై కట్టుకున్న గూళ్లు చాలా అద్భుతంగా ఉండేవి. ఇవి పూరిళ్ల చూరులలో గూళ్లు కట్టుకొని జనావాసాలతో మమేకమై ఉండేవి. మెత్తని పీచు వట్టి వాటితో గూడు కట్టడం, గుడ్లను పొదగడం, నోటితో ఆహారాన్ని తెచ్చి పిల్లలకు అందించటం, ఆ పిల్లలు రెక్కలొచ్చి ఎగిరెంత వరకు జాగ్రతగా కాపాడటం మనకు తరచూ కనిపించే దృశ్యాలు. ఈ దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇటువంటి ఆదర్శవంతమైన పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిళ్లను కూడా విడుదల చేసింది.

జనావాసాల మధ్య నివసిస్తున్న పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవ మనుగడకు ప్రమాదమని గుర్తించిన ప్రపంచ దేశాలు  పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించి అందుకు అవసరమైన కార్యక్రమాలను చేపడుతున్నాయి. సెల్‌ఫోన్‌ ‌టవర్లు, పురుగు మందుల వాడకం విస్తృతమవటం, కాలుష్యం, ప్లాస్టిక్‌ ‌వ్యర్థాలు మరియు పచ్చదనం అంతరించి పోవటం పిచ్చుకలు ఘణనీయంగా తగ్గిపోవటానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. జీవన శైలిలో పెనువేగంగా వచ్చిన మార్పే పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా పరిణమించింది. దీంతో పిచ్చుక జాతి అంతరించి పోతోంది. శరవేగంగా పట్టణీకరణ, అంతరిస్తున్న పచ్చదనం, రసాయనాలతో పళ్లు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పిచ్చుకలు అంతరించి పోవడానికి కారణాలని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు. విచ్చలవిడిగా ఏర్పడుతున్న సెల్‌ ‌టవర్లు నుంచి వెలువడే అయస్కాంత తరంగాలు ఆ జాతికి ముప్పుగా పరిణవించాయని ఆందోళన చెందుతున్నారు. కృతిమమైన పిచ్చుక గూళ్లను ఏర్పాటు చేయడం ద్వారా పిచ్చుక జాతిని కొంతవరకు సంరక్షించ వచ్చుని శాస్త్రవేతలు అంటున్నారు.

గతంలో ఊర పిచ్చుకలు పల్లెటూర్లలో విరివిగా ఉండేవి. రైతులు పిచ్చుకల ఆహారం కోసం వరి కంకులను గుత్తులుగా కట్టి ఇంటి చూరులకు వేలాడ దీసే వారు. ప్రస్తుతం పంటలు లేక పిచ్చుకలకు ఆహారం కరువై ఇంకా అనేక కారణాల వలన పల్లెల్లో అవి కనబడటం లేదు. గ్రామాల్లో కనిపించే ఊర పిచ్చుకల జాతి క్షీణ దశలో ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
పిచ్చుక జాతి సంరక్షణకై ఇంట్లో మట్టి పాత్రలో నీరు పోసి ఉంచాలి. వివిధ సందర్భాల్లో ఇంటి ముందు వేసే ముగ్గుల్లో రసాయనాలు లేని పిండితో వేస్తే ఆహారంగా ఉపయోగపడుతుంది. పిచ్చుకల అవాసం కోసం అట్ట, కర్ర లేదా వెదురుతో చేసిన ప్రత్యేక గూళ్లను ఏర్పాటు చేసి ఆశ్రయం కల్గించాలి. ఇంటి ముందు పరిసరాల్లో వివిధ ధాన్యపు గింజలను చల్లితే ఆహారం కోసం ఇంటి వద్దకే పిచ్చుకలు చేరి కనువిందు చేస్తాయి. ప్రతి ఒక్కరు భూమిపై పిచ్చుకల జాతి అంతరించి పోకుండా వాటి సంరక్షణ కొరకు మన వంతు బాధ్యతగా సంరక్షణ కొరకు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.
– పిన్నింటి బాలాజీ రావు హనుమకొండ.
  9866776286

Leave a Reply