Take a fresh look at your lifestyle.

వన్నెతగ్గని ధిక్కార గొంతుక నాగన్న పాట

కొందరు పాడితే పాట పరవల్లు తొక్కుతుంది కొన్ని గొంతుల నుండి వెలువడే పాటలు ఇట్టే ఆకట్టుకుంటాయి
కొన్ని పాటలకు చర్మంపై వెంట్రుకలు లేసి నిలబడతాయి అట్లే ప్రజలను కండ్లార్పకుండా చూడబుద్ది వినబుద్దైతాది ఆ కోవలోకి చెందిన కవి గాయకుడు అరుణోదయ నాగన్న ఎందుకంటే ఆ పాటకున్న వన్నెలు నేటికి కూడా చెక్కుచెదరలేదు.తను ఎన్నో బాధలన్నింటిని పంటికింద అణగబట్టి నిర్రగా నిక్కచ్చిగా తన మునివేళ్లపై నిలబడి ఒక పరిశీలన గ్రంథంగా అధ్యయనం చేస్తున్న కవిగాయకుడతడు.

తన జీవన గమనంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న మరెన్నో ముండ్లబాటలను దాటొచ్చినా ఎక్కడ చెక్కుచెదరని స్థైర్యం మరెక్కడ మాట జవదాటని నైజం ఈ ప్రజా కళాకారుడిలో ఉండటానికి కారణాలు ఇదంత ఉద్యమ గొప్పతనం,కళ యొక్క విశిష్టత,పాటలోవున్న ప్రజల బలం నాగన్న ఆపాదించుకున్న విప్లవ నినాదమనే చెప్పాలి. నాగన్న పేదరికానికి ఆకలికి దగ్గరిసుట్టం ఖమ్మం జిల్లావాసి గౌండ్ల కులంలో పుట్టి పొద్దుకు కల్లుగీయకపోతే కంచంలో మెతుకుల కోసం వెతుకులాడే దీన కుటుంబంలో పుట్టి కమ్యునిజాన్ని అణువణువునా వంటబట్టించుకొని విప్లవపంథాలో పయనించడం నాగన్నలాంటి గొప్ప వ్యక్తులకే సాధ్యం.

ప్రజలు ఏ కవినైనా ఇంకే గాయకుడికైనా పేరుముందు ప్రజాకవి ప్రజా గాయకుడు అనే బిరుదును అంత తొందరగా ఆపాదించరుఇందులో ప్రజల నిశిత దృష్టి అమోగమనే చెప్పాలి అనేక పోరాటాలలో పాలుపంచుకొని ధిక్కారమై ప్రజలవైపు నిరంతరం ఉన్నప్పుడే ఆ పేరుతో ప్రేమగా పిలుచుకుంటారు అలా ప్రేమగా పిలుచుకునేవారిలో మన నాగన్న ఒకడు.పల్లేరు ముండ్లబాటలో రక్తపు దారిలో వాగుల వంకల నడుమ సెట్టు గుట్టల సందున ఊరి చివర్లో ఉద్యమాల జాడలో పాటై పయనించిన నాగన్న అలుపెరుగని నేటికి కూడా వన్నెతగ్గని పాటకారి.

బాల్యంలో రాత్రిబడి సదువు ఎందరో ఉద్యమకారుల సాన్నిహిత్యం నాటి వర్తమాన సమాజంలో జరుగుతున్న సంఘర్షణల ప్రభావం పెత్తందార్ల దోపిడీ విధానాలు కుల సమాజంలో ఎక్కువ తక్కువనే అణచివేత విధానాలు నాగన్నను ఒకచోట నిశ్చలంగా ఉండినివ్వలేదు. కొన్ని గొంతులు పాటందుకుంటే వింటూనే ఉందమనిపిస్తది అది తెలంగాణ గాయకులలో ఉన్న ఓ మరపురాని పల్లె జీరతనం పగ్గంపెట్టంత పొడవుగా రాగందీసే ఆలాపన ఇలా ఒక్కటేమిటి పాటకున్న అన్ని లయలను ఒంటబట్టించుకొని తెలంగాణమంత చుట్టొచ్చింది నాగన్న ధిక్కార గొంతుక. గుడిసె గుడిసె నడుమ పొడిసెనట సందమామ అంటూ చీకటి నిర్భంద కాలంలో పాడి చివరికి పన్నెండెండ్లపాటు గుడిసెలోనే కాలమెల్లదీశాడు.

- Advertisement -

నాగన్న పాడిన పాటల్లో..
ఆగదు ఆగదు పాట
దండోరా సినిమాలో ..
కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ ..పాట జనాలపై విపరీతమైన ప్రభావం చూపాయి. తెలంగాణ ఉద్యమంలో జనాలను ఉర్రుతలూగించిన పాట •మానుకోట గడ్డకు వందనం రణం చేసిన రాళ్లకు వందనం.. మానుకోట ప్రసాద్‌ ‌రాసిన పాట ఓ సంచలనమే అనొచ్చు. కొన్ని పాటలు నాగన్న కోసమే రాసినట్లుంటాయి అందులో ఒకపాట రామరావు కోసం యోచన రాసినా పాట.. నీవు గొంతెత్తితే గోదావరిలోయ లోయంత ఊగింది ఉయ్యాల.. నీ పాట వింటే నక్సల్‌ ‌బరి నవయవ్వనమయ్యింది.. అంటూ సాగేపాటే కోట్ల జనాల ప్రజాధరణ పొందిన గీతమైంది.

కామ్రేడ్‌ ‌లింగన్న పాట ..చికాగో నగరాణ చిందినా రక్తమా ..అనే పాట సంచారి కలం నుండి జాలువారి సంచలనాలకు వేదికైంది

నాగన్న తెలంగాణలో ఓ పేరుమోసినా కళాకారుడు కానీ మాట్లాడుతుంటే ఎక్కడ కూడా కాసింత పొగరు అనేది ఉండదు. ఇదేదో పొగడ్తల కోసం రాసినా అక్షరాలు కాదు.. ఈ ఆధునిక కాలంలో పేరుకోసం పాకులాడే కాలంలో ప్రజల కోసం ఉద్యమాలు పోరాటాలు విప్లవ రాజకీయ పోరులో జన గొంతుకై పాడి మార్పుకు నాంది పలికినందుకు ఈ నాల్గు అక్షరాలు నాగన్నలాంటి గొప్ప కళకారులను గుండెల్లో దాసుకోవడం కోసమే..! రేపటి సమసమాజంలో నాగన్న జీవితం పాఠంగా చెప్పడానికి ఈ చిన్న ప్రయత్నం.
-అవనిశ్రీ
9985419424.

Leave a Reply