బాపూఘాట్ వద్ద గవర్నర్, సిఎంల నివాళి
న్యూఢిల్లీ/హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. జాతిపిత వర్ధంతిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయన సమాధి రాజ్‌ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణెళి, నావీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎ బదూరియా తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత సేవలు, ఆశయాలను దేశ ప్రజలందరూ స్మరించుకున్నారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. భారత జాతిపిత, ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వాతంత్య్ర సాధించిపెట్టిన మహా నాయకుడు గాంధీజీ. ఆ మహా నాయకుడి 72వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా యావత్భారతావని ఆయనకు నివాళులు అర్పిస్తోంది. సత్యం, అహింసా అనే రెండు సిద్దాంతాలతోనే ఆయన దేశానికి స్వాతత్య్రం సాధించిపెట్టారని భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఆయనకు నేను మనస్పూర్తిగా శ్రద్దాంజలి ఘటిస్తున్నానని అన్నారు. అహింసా మార్గంలో కూడా యుద్ధం చేయొచ్చని ఆయన ప్రపంచానికి చాటిచెప్పారు. ఆ నాయకుడి జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోవని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆయన మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. భారత ప్రజలు ఆయనను నిత్యం స్మరించుకుంటారని ఆయన తెలిపారు.
బాపూఘాట్ వద్ద గవర్నర్, సిఎంల నివాళి
గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాలులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్ధంతి సందర్భంగా గాంధీజీని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సత్యం, అహింస సిద్ధాంతాల ద్వారా ప్రపంచానికి శాంతి సందేశం అందించిన గాంధీజీ మార్గం సదా ఆచరణీయం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించొచ్చు అని గాంధీజీ నిరూపించారు. గాంధీజీ సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపిందని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా బాపుఘాట్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాపుఘాట్‌లో సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రాంమోహన్, హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. జాతిపిత వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి వారు మౌనం పాటించారు. జాతిపిత మహత్మాగాంధీ దేశానికి స్వాతంత్య్ర తెచ్చి పెట్టడమే కాకుండా.. ప్రపంచానికే శాంతిదూతగా నిలిచారని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.