ఒకపక్క కొరోనా, మరోపక్క సరిహద్దుల్లో చైనాతో ఘర్షణ కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయపార్టీల మద్య ఘాటైన మాటల యుద్దం కొనసాగుతున్నది. భారత- చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో తాజాగా జరిగిన విధ్వంసకాండ నేపథ్యంలో ఎన్డిఏ సర్కార్ శుక్రవారం జరిపిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలన్నీ ఘాటుగానే స్పందించడంతో రాజకీయ వర్గాల్లో ఇప్పుడిది ప్రధానాంశంగా మారింది. దీనికి తోడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంథీ కేంద్ర ప్రభుత్వానికి సందించిన ప్రశ్నలిప్పుడు పలువురిని ఆలోచింపజేసేవిగా ఉండడంతోపాటు, ప్రజల మద్దతుకూడా లభిస్తున్నది. గాల్వన్‌లోయలో మనదేశానికి చెందిన ఒక కల్నల్‌తో సహా ఇరవై మంది సైనికులు మృతి చెందిన విషయంపై అఖిలపక్ష సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన వివరణ వివాదస్పదంగా మారింది. ఈ ఘర్షణలో భారతదేశానికి చెందిన ఒక అంగుళం భూభాగాన్నికూడా చైనా ఆక్రమించలేదని, పైగా మనవాళ్ళే చైనా అంతుచూశారని ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన విషయంపై రాహుల్‌గాంధీతోపాటు ప్రతిపక్షాలన్నీ తీవ్రంగా స్పందించాయి. ప్రధాని చెప్పినట్లు చైనా మన భూభాగంలోకి రానట్లు అయితే మన సైనికులు ఎలా చంపబడ్డారన్నది రాహుల్ ప్రశ్న. వారు నిజంగా ఏ స్థలంలో చంపబడ్డారన్నది ప్రజలకు చెప్పాల్సిందిగా ఆయన కేంద్రాన్ని నిలదీయటంతో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇదే అనుమానం సామాన్య ప్రజల్లోకూడా ఉండడంతో ప్రధాని కార్యాలయం దాన్ని సరిదిద్దే ప్రయత్నంచేసింది. అయితే ఇదే విషయంపై మాజీ ప్రధాని, కాంగ్రెస్ నాయకుడు డా. మన్మోహన్సింగ్ ఘాటైన లేఖను విడుదల చేయడంతో కాంగ్రెస్, బిజెపి పార్టీల మద్య మాటల యుద్దం ప్రారంభమైంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొరోనాను నిరోదించడంలో వైఫల్యం చెందినట్లు, చైనాతో సరిహద్దు వివాదంపైన కూడా నిర్లక్ష్యం చేయవద్దని తన లేఖలో మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలకు బిజెపి తీవ్రంగా స్పందిస్తోంది. కాంగ్రెస్ కాలంలోనే చైనా 43వేల కిలోమీటర్లమేర భారత్ భూభాగాన్ని అక్రమించిందని, ఆ కాంగ్రెస్‌లోనే మన్మోహన్సింగ్ ప్రధాని పదవిని నిర్వహించాడన్న విషయాన్ని మరిచిపోరాదని భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా ప్రతి విమర్శచేయడంతో రాజకీయాలు వేడందుకున్నాయి. పోరాటం లేకుండానే వ్యూహాత్మక, ప్రాదేశిక అంశాల్లో చైనా ఎదుట యుపిఏ సర్కార్ తలవంచిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. 2010 నుంచి 2013 మద్య ఆరు వందలసార్లు చైనా భారత్ మీద దురాక్రమణ చేసిందని, ఆనాడు ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ అప్పుడెందుకు ఆందోళనచెందలేక పోయారని ఆయన సందించిన ప్రశ్నలకు అదే రీతిలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాల స్పందించారు.
2015 నుంచి చైనా 2,264 సార్లు అతిక్రమలకు పాల్పడితే మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేక పోయిందని ఆయన తన ట్విట్టర్లో విమర్శించారు. అలాగే ముప్పై ఏళ్ళలో ఎన్నడూ లేనివిధంగా జమ్ము కాశ్మీర్లో అత్యధికంగా 471 మంది జవాన్లు, 253 మంది పౌరులు మరణించారని, అలాగే 2019 పాకిస్తాన్ మూడువేల 289 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన దానిపై మోదీని ఎందుకు ప్రశ్నించరని ఆయన తన ట్విటర్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డాను ప్రశ్నించడం చూస్తుంటే చైనాతో యుద్ద వాతావరణం కన్నా దేశంలో అంతర్గతంగా రాజకీయ యుద్ద వాతావర్ణమే పెద్ద సవాలుగా మారుతున్నట్లు కనిపిస్తున్నది. ఇదిలా ఉంటే మోదీ వ్యాఖ్యలు భారత్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తన లేఖలో మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రజలను ఇప్పుడు ఆలోచింపజేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చైనా దురాక్రమణ పైన ప్రజలకు తప్పుడు సమాచారమిస్తున్నదంటారు మన్మోహన్సింగ్. వాస్తవంగా ఏప్రిల్ నుండే చైనా గాల్వాన్‌లోయ, ప్యాంగాంగ్ సో లేన్ సహా పలు భారతీయ ప్రాంతాల్లోకి చొరబడుతూనే ఉందని, ఇప్పుడు ఈ ప్రాంతాలు తమవేనని చెప్పే సాహసం చేస్తున్న క్రమంలో చైనా మన భూభాగంలో ఇంచ్ స్థలాన్నికూడా అక్రమించలేదన్నన ప్రధాని వ్యాఖ్య చైనాకు తన అబద్దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అనుకూలంగా మారుతున్నదని మన్మోహన్ చెప్పినట్లు, భారతే తమ భూభాగంలోకి వచ్చిందని చైనా వ్యాఖ్యానించడం గమనార్హం. అందుకే ప్రధాని స్థానంలో ఉన్నవ్యక్తి మాట్లాడేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని సింగ్ తన లేఖలో స్పష్టంచేశారు. దేశంగురించి ఏదైనా వ్యాఖ్యలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరాన్ని ఆయన మోదీకి గుర్తుచేశారు. భవిష్యత్ తరాలు మనల్ని ఎలా చూడబోతాయన్నది ప్రభుత్వం నిర్ణయాలు, చర్యలపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనను నడిపించే నాయకులదే బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఈ బాధ్యత ప్రధానమంత్రి కార్యాలయంపైన ఉంటుందని ఆయన తన లేఖలో వివరించారు. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతతో పాటు తను మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటూ తన సుదీర్ఘలేఖలో మన్మోహన్సింగ్ మోదీకి హితవు చెప్పడంతో ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.