Take a fresh look at your lifestyle.

‌ప్రాణదాతలకు రక్షణ కవచం

కొరోనా మహమ్మారి వైద్యరంగానికైతే ఓ మేలుచేసింది. ఏదో కారణంగా తరుచూ వైద్యసిబ్బందిపై జరుగుతున్న దాడులకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేయగలిగింది. తమపై జరుగుతున్న దాడుల విషయంలో చాలాకాలంగా వైద్యులు చేస్తున్న పోరాటానికి కొరోనా మార్గాన్ని సులభం చేసిందనే చెప్పవచ్చు. వైద్య సిబ్బందిపై దాడులకు, వేధింపులకు పాల్పడితే కఠినశిక్షలు అమలుపర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌పై గురువారం రాష్ట్రపతి రాంనాథ్‌ ‌కోవింద్‌ ‌సంతకం చేయడంతో ప్రాణదాతలకు రక్షణ కవచం ఏర్పడినట్లైంది. ఇంతవరకు ఉన్న పరిస్థితి వేరు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితి వేరు. కంటికి కనిపించని సూక్ష్మ వైరస్‌ ‌కారణంగా వందలాదిమంది మృత్యువాత పడుతుండగా, భారతదేశంలో వేలాదిమంది వ్యాధిగ్రస్తులు చికిత్సపొందుతున్నారు. ఈ వ్యాధికి గురైనవారికి చికిత్స చేస్తున్న క్రమంలో ఏకాస్త్త ఏమరుపాటున ఉన్నా డాక్టర్లకు అంటుకునే ప్రమాద పరిస్థితిలో కూడా వారు వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటికే మనదేశంతో పాటు వివిధ దేశాల్లో ఈ వ్యాధికి గురైన వైద్యులున్నారు. ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడాలన్న అకుంఠిత దీక్షతో, నిద్రాహారాలు మాని సేవలు అందిస్తున్న డాక్టర్లపై ఇటీవల కాలంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనిపించని శత్రువుపై సరైన అస్త్రశస్త్రాలు లేకున్నా పోరాటం చేస్తున్న వారిని గౌరవించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా ఫలితం లేకుండా పోతున్నది.

సింబాలిక్‌గా డాక్టర్లు, పోలీసు సేవల గుర్తింపుగా వారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలుపాలని ప్రధాని చేసిన ప్రకటన దేశంలో విజయవంతమైనప్పటికీ ఎక్కడో ఒక దగ్గర డాక్టర్లు దాడుల బారిన పడాల్సివస్తూనే ఉంది. వాస్తవంగా తమ పరిస్థితి ఏమిటో అర్థంకాని స్థితిలో డాక్టర్లున్నారు. కొరోనా పేషంట్లకు చికిత్స అందించిన పాపానికి వారికి ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఇంటి యజమానులు నిరాకరిస్తున్నారు. దీంతో కొందరు దవాఖానాల్లోనే జీవనం సాగిస్తున్నారు. స్వంత ఇల్లు ఉన్నవారు భార్యాపిల్లలను వేరేగదిలో ఉంచి వారు మరోగదికి పరిమితమవుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఒక డాక్టరైతే కారునే తన ఇల్లుగా చేసుకుని ఉద్యోగధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఇంతటి జాగ్రత్తలు తీసుకుంటున్నా వారిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రోగులతో సన్నిహితంగా ఉండాల్సిన క్రమంలో వారికి కూడా ఇన్ఫెక్షన్‌లు సోకే అవకాశముంది. ఈ విషయంలోనే వారు మానసికంగా వత్తిడికి గురవుతున్నారు. రోగి ఎంతటి ప్రమాదస్థితిలో ఉన్నాడన్నది అతనికి సంబంధించినవారు అర్థం చేసుకోరు. అలాగే కొరోనాలాంటి మహమ్మారి ప్రపంచదేశాలనే గడగడలాడిస్తున్నది. దీనికి ఇంతవరకు ఏదేశం కూడా సరైన మందును కనుగొనలేకపోయిందన్నది జగమెరిగిన సత్యం. అయినా తమ పేషంట్‌ ‌చనిపోవడంతో అది వైద్యుల నర్లక్ష్యమే కారణమంటూ దాడులు చేస్తున్నారు. కొరోనా అనుమానితులను వారి ఇంటివద్దనే పరీక్షలు చేస్తున్న క్రమంలో కూడా దాడులకు పాల్పడుతున్నారు. నిజామాబాద్‌లో నిజాముద్దీన్‌ ‌మర్కజ్‌ ‌వెళ్ళివచ్చిన వారిలో కొరోనా వైరస్‌ ‌లక్షణాలుండడంతో వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించేందుకు వెళ్ళిన వైద్య సిబ్బందిపై దాడులు జరిగాయి. ఉస్మానియాలో అలానే డాక్టర్లపై కొరోనా అనుమానితులు కొందరు దాడికి పాల్పడ్డారు.

- Advertisement -

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రాళ్ళతో డాక్టర్లపై దాడిచేసినఘటన ఇద్దరు డాక్టర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వైద్యసిబ్బందితొపాటు పోలీసు సిబ్బందిపై వందలాదిమంది దాడులు చేసినలాంటి సంఘటనలతో డాక్టర్లు చికిత్సలనే మానివేసే పరిస్థితి ఏర్పడింది. దీంతో కేంద్రం తక్షణ చర్యలు చేపట్టక తప్పలేదు. వైద్యసిబ్బందిపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌నే తీసుకువచ్చింది. దాడులు చేసేవారిపైన నాన్‌ ‌బేయిలబుల్‌ ‌కేసు నమోదుచేసి, గరిష్టంగా ఏడేళ్ళ వరకూ జైల్‌శిక్షతోపాటు భారీ జరిమానా విధించే విధంగా చట్టాన్ని రూపొందించారు. కేసు తీవ్రతనుబట్టి ఆరునెలలనుంచి ఏడేళ్ళవరకు జైలుశిక్ష అలాగే 50 వేలనుండి రెండు లక్షల వరకు జరిమానా విధించనున్నారు. కేసు చాలా తీవ్రమైనదైతే జరిమానాను రెండు లక్షలనుండి అయిదు లక్షలవరకు విధించనున్నారు. వైద్యసిబ్బందికి సంబంధించిన ఆస్తులేవైనా ధ్వంసం అయిన పక్షంలో అంతకు రెట్టింపు వ్యయాన్ని సంబంధిత వ్యక్తి నుండి వసూలు చేసే విధంగా ఆర్డినెన్స్‌లో పొందుపర్చారు. దాడులకు సంబంధించిన కేసుల దర్యాప్తును ముప్పై రోజుల్లో ముగించి, ఏడాదిలోపుగా తీర్పువచ్చే విధంగా తీర్చిదిద్దారు. గతంలో ఉన్న చట్టాలకు భిన్నంగా చాలా కఠినతరంగా శిక్ష పడేవిధంగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ ‌డాక్టర్లకైతే కవచంగానే ఉపయోగపడుతుంది. అయితే కేంద్రం తమకు కల్పించిన రక్షణతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉంటే అదే పదివేలంటున్నారు సామాన్య జనం.

Leave a Reply