- ఆర్ఆర్ఆర్ చిత్రం నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు
- భారత్ గర్వపడేలా చేశారు : చిత్ర బృందానికి ప్రధాని మోదీ ప్రశంస
- ఆసియాలోనే తొలిసారిగా గోల్డెన్‌గ్లోబ్ అవార్డు
కాలిఫోర్నియా/న్యూదిల్లీ, జనవరి 11 : భారతీయ చలనచిత్ర కీర్తపతాక మరోమారు ఎగిరింది. ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. టాలీవుడ్ టాప్ దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలన చిత్రరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ’గోల్డెన్ గ్లోబ్’ అవార్డును దక్కించుకుంది. సినిమాలోని ‘నాటునాటు’ పాట.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొన్నారు. నాటు నాటు’కు పురస్కారం ప్రకటించిన సమయంలో తారక్, చరణ్, రాజమౌళి.. తమ టేబుల్ వద్ద పైకి లేచి చప్పట్లు కొడుతూ, కేరింతలతో సందడి చేశారు. అనంతరం అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం ట్విట్టర్లో పోస్టు చేసింది. చంద్రబోస్ సాహిత్యానికి కీరవాణి సంగీతం తోడవగా.. రాంచరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ఈ పాటకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ’గోల్డెన్ గ్లోబ్’ అవార్డులు-2023 కార్యక్రమం కాలిఫోర్నియాలో జరుగుతుంది.
భారత్ గర్వపడేలా చేశారు : చిత్ర బృందానికి ప్రధాని మోడీ ప్రశంస
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ’నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి, పాట రచయిత చంద్రబోస్ సహా ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లను ట్యాగ్ చేస్తూ వారికి అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డు భారతదేశాన్ని గర్వపడేలా చేసిందని మెచ్చుకున్నారు. అందులో భాగంగా ప్రేమ్ రక్షిత్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ను కూడా ఆయన కొనియాడారు. దాంతో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ను అనౌన్స్ చేస్తున్న వీడియోను ఆర్ఆర్ఆర్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. ఆ ట్వీట్ ను ప్రధాని మోడీ రీట్వీట్ చేశారు.
ఆసియాలోనే తొలిసారిగా గోల్డెన్‌గ్లోబ్ అవార్డు
జక్కన చెక్కిన ’ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు సృష్టిస్తున్నది. అవార్డుల వేటలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే బ్రిటిష్ అకాడ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్టస్ నాన్ ఇంగ్లిష్ కేటగిరీలో బెస్ట్ ఫిల్మ్ అవార్డు కోసం లాంగ్‌లిస్ట్‌లో చేరిన ఈ చిత్రం.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మక ’గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నది. దీంతో ఆసియాలో ఈ అవార్డు అందుకున్న తొలి సినిమాగా చరిత్ర లిఖించింది. అంతకుముందు అవార్డస్ వేడుకక హాజరైన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం.. రెడ్కార్పేట్పై సందడి చేసింది.