Take a fresh look at your lifestyle.

రైతు ఉద్యమంలో చీలిక … ప్రభుత్వం తాజా అస్త్రం

గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో ఎర్రకోటపై రైతు సంఘాల నాయకులు తమ జెండాను ఎగురవేసుకుని దేశంలో రైతుల సత్తాను చాటారు. ఇది ఒక పార్శ్వం. రైతులు లేనిదే భారత్ లేదు. భారత దేశానికి రైతులే వెన్నెముక అని స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుండి ప్రధానులు, ప్రభుత్వంలో ఉన్నత పదవులను అలంకరిస్తున్నవారూ తరచూ చెప్పే మాట అదే. అయితే రైతులకు అధికారంలో కానీ, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో కానీ భాగస్వామ్యం కల్పించడం లేదు. ఈ బాధ రైతుల్లో గూడు కట్టుకుంది. గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ఘటనలకు రైతులను ప్రేరేపించిన కారణాల్లో ఇది ఒకటి.దానినే వారు ఆత్మగౌరవంగా సంభావిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలకు పద్మ అవార్డులు ఇచ్చి సత్కరిస్తున్న ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే రైతుల వైపు చూడటం మొదలు పెట్టింది. అయితే, రైతుల ఆందోళన వెనుక ఇతర రాజకీయ శక్తుల కుట్ర ఉందని ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రభుత్వంలోని సహాయ మంత్రుల వరకూ అంతా ఆరోపిస్తున్నారు.అది అబద్ధం కాకపోవచ్చు. కానీ, ప్రభుత్వానికి ఎంతో పెద్ద ఇంటిలిజెన్స్ యంత్రాంగం ఉంది. వేలాది మంది వేగులు ఉన్నారు.అయినా, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందంటే ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యంగానే భావించాల్సి ఉంటుంది.

ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవానికి విదేశీ ప్రముఖులు హాజరు కావడం ఆనవాయితీ, ఈ ఏడాది కోవిడ్ కారణంగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తూ లేఖ రాశారు.ఆయన హాజరై ఉండి ఉంటే రైతుల ప్రతినిధులు ఎర్రకోట ఎక్కి జెండా ఎగురవేసిన సంఘటనపై ఎలా స్పందించేవారో మరి. అయితే, ఇప్పటికే వార్తల ద్వారా, విజువల్స్ ద్వారా ప్రపంచం అంతా ఈ ఘటన వివరాలు అందరికీ తెలిశాయి. ప్రభుత్వం ఎంత సేపు రైతుల ఉద్యమాన్ని రాజకీయ కోణం నుంచి చూడటం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఇంతకీ మంగళవారం నాటి ఆందోళనలో హింసను ప్రేరేపించిందీ, ఎర్రకోట ఎక్కేందుకు జనాన్ని ఉసి గొల్పింది దీప్ సిద్ధు అని తేలింది. అతడు ప్రధానితో తీయించుకున్న పోటోలు వైరల్ అయ్యాయి. బీజేపీ నాయకులకు సన్నిహితుడు. అందువల్ల తమ పార్టీ నాయకులకు సన్నిహితులైన వారు ఉద్యమంలో ఉన్నప్పుడు వారిని పిలిపించి ఆందోళన హింసాత్మకంగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.ఇలాంటి సందర్భాల్లో నేరుగా గోడకు తల బాదుకున్నట్టు కాకుండా చాకచక్యంగా ఉద్యమ నాయకులతో లోపాయికారీ సంబంధాలు పెట్టుకోవడం ద్వారా పరిస్థితి చేజార కుండా చూసుకోవాలి.

ఆ ఇంగితం తెలిసి రావడం వల్లనో ఏమో బుధవారంనాడు రైతు సంఘాల్లో చీలికను సృష్టించడంలో ప్రభుత్వం కృతకృత్యమైనట్టు కనిపిస్తోంది. ఇది ప్రభుత్వం తాజా అస్త్రంగా కనిపిస్తోంది. రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘటన్, భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ లు ఈ ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాయి. కిసాన్ మజ్దూర్ సంఘటన్ నాయకుడు విఎం సింగ్ ఉద్యమం పెడతోవ పట్టినందున తాము తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఢిల్లీలో ప్రదర్శన వరకే అయితే బాగుండేదనీ, ఎర్రకోట ఎక్కి జెండా ఎగురవేయడం వల్ల ఏం సాధించారని ఆయన సాటి రైతు నాయకులను ప్రశ్నించారు.ఇది నిజమే .దీని వల్ల రైతు ఉద్యమానికి మచ్చ వచ్చింది. ఎర్రకోటనూ, జాతీయ జెండాను మన దేశ సర్వసత్తాక ప్రతిపత్తికి సంకేతంగా భావిస్తున్నాం. పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు ఏ విధంగా తీవ్రంగా పరిగణించడం జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి తీవ్రత ప్రభుత్వంలోనూ వ్యక్తం అవుతోంది. ఇళ్ళు కాలిన తర్వాత బావులు తవ్విన చందంగా ప్రభుత్వం ఇప్పుడు దర్యాప్తు జరిపిస్తోంది.

ఈ దాడి చేసిన వారికి సంబంధించిన క్లూలు బయట పడుతున్నప్పుడు కూడా ఇంకా దర్యాప్తు పేరిట కమిటీలు వేయడం కాలయాపన కోసమే. నిజానికి ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటైన విషయం. మన గూఢచార యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం. హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఏర్పాటు చేసిన ఉన్నతాధికార సమావేశాన్ని కొద్ది రోజుల ముందే ఏర్పాటు చేసి ఆందోళకారుల్లో తీవ్రంగా స్పందిస్తున్నదెవరో తెలుసుకుని ఉండాల్సింది. ప్రభుత్వం ఈ విషయంలో తన తప్పు కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందని అనుకోవాలి. లేదా,. ఉద్యమ నాయకులతో లోపాయికారీ అవగాహనతో వ్యవహరించిందని అనుకోవాలి. ఏమైనా గణతంత్ర దినోత్సవాన్ని మనం భావోద్వేగ పూరితంగా జరుపుకుంటాం.

దేశ సర్వసత్తాక ప్రతిపత్తి, సార్వభౌమాధికారానికి ప్రతీకగా జరుపుకుంటాం.అలాంటి జాతీయ పండుగను జరుపుకునే సందర్భంలో ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండటం అవసరం అయితే,ఇప్పుడు పోయిందేమీ లేదని వాదించేవారున్నారు. అలా తీసుకున్నా దేశ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేయడాన్ని హర్షించేవారు ఉన్నారా అన్న ప్రశ్న తలెత్తుతుంది. కనుక, ఎవరి హద్దుల్లో వారుండటం అవసరం. నిరసన తెలపడం అవసరమే. కానీ,అతిగా పోకూడదు. కిసాన్ మజ్దూర్ సంఘటన్ నాయకుడు విఎం సింగ్ అన్న మాట అదే. ప్రభుత్వంతో పోరాడి సాధించాలి తప్ప దేశ గౌరవానికి భంగకరంగా వ్యవహరించకూడదన్న ఆయన మాటల్లో ఎంతో నిజం ఉంది. ఉద్యమాన్ని పక్కదారి పట్టించిన సిద్ధూ అస్మదీయుడే కనుక దర్యాప్తును తొందరగా ముగించి ఆయన వెనుక ఎవరు ఉన్నారో నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంఅంటే అదే . రైతూల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూనే రైతులు పెడదారి పడితే వారిని దారిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంమీదే ఉంది.

Leave a Reply