Take a fresh look at your lifestyle.

నిరంతరం జ్వలించిన తరానికి ప్రతినిధి డా।। చిరంజీవి

“తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పోవడంతో ఆ ఉద్యమ చైతన్యం, విద్యార్ధుల, నిరుద్యోగుల, యువకుల ధర్మాగ్రహం, ఉద్యోగాలు దొరకక పోవడం, ఆంధ్రా, రాయలసీమ వలస ప్రవాహం వంటి కారణాలవల్ల నక్సలైట్ల ఉద్యమంలోకి ఒక తరానికి తరం వెల్లువలా ప్రవేశించింది. అలా జై తెలంగాణ ఉద్యమ చైతన్యం నుండి నక్సలైట్ల ఉద్యమంలోకి ప్రవేశించిన తొలితరం యువతరంలో డా?? కొల్లూరు చిరంజీవి ప్రముఖుల్లో ప్రసిద్ధులు. అలా మొదలైన డా।। చిరంజీవి ప్రయాణం వందలాది యువకుల జీవితాల్లో, పరిణామంలో భాగంగా సాగుతూ వచ్చిన చైతన్యం వామపక్ష నక్సలైట్‌ ‌చైతన్యంగా మారింది.”

డా।। కొల్లూరు చిరంజీవి ఒక వ్యక్తి కాదు. ఒక సామాజిక ఉద్యమశక్తికి ప్రతీక. ఏడు దశాబ్దాలుగా నిరంతరం జ్వలిస్తూ వస్తున్న ఒక తరానికి ప్రతినిధి డా।। కొల్లూరు చిరంజీవి. 1967 నుండి ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పెల్లుబికిన యువతరం సమరోత్సాహానికి, ప్రపంచ చరిత్ర పరిణామాలకు ఒక ప్రతినిధి. అందువల్ల డా।। కొల్లూరు చిరంజీవి గారిని ఆ చారిత్రక పరిణామాల్లోనే వారి వ్యక్తిత్వాన్ని, వికాసాన్ని పరిశీలించడం అవసరం. 1967 ప్రపంచ వ్యాప్తంగా ఒక సంక్షోభిత కాలం. యువతరం స్వంత గొంతుకతో సంఘర్షణాయుతంగా ఉద్యమాలకు పరుగులు తీసిన కాలం. ప్రపంచ వ్యాప్తంగా యువతరంలో పెల్లుబికిన అసంతృప్తి జ్వాలలు అనేక దేశాల్లో ప్రభుత్వాలను కూల్చివేశాయి. మార్చివేశాయి. భారతదేశంలోను సగానికి పైగా గల రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఓడిపోయి డిఎంకే, ఉత్తరప్రదేశ్‌, ‌బిహార్‌లలో లోహియా సోషలిస్టు పార్టీ , బెంగాల్‌లో సిపిఎం వంటి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఫ్రాన్స్‌లో డీగాల్‌ ‌ప్రభుత్వం పడిపోయింది. అలా యువతరంలో పెల్లుబికిన సమరోత్సాహం అనేక రూపాల్లో వ్యక్తమైంది. కాకినాడలో తమ అవకాశాల కోసం తెలంగాణ ప్రాంత అవకాశాలవైపు ఆశగా చూశారు. దానికి వ్యతిరేకంగా తెలంగాణాలో ‘ఆంధ్ర గోబ్యాక్‌’ ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమాలన్నీ అసమ అభివృద్ధి కారణంగా, వేగవంతమైన అభివృద్ధి జరగకపోవడం కారణంగా, అభివృద్ధిలో తమ భాగస్వామ్యం అందుకోవడం కోసం ముందుకు సాగాయి. అలాంటి విశ్వవ్యాప్త సమరోత్సాహ యువతరానికి ప్రతినిధి డా?? కొల్లూరు చిరంజీవి.

‘ఆంధ్రా గో బ్యాక్‌’, ‘‌జై తెలంగాణ’, ‘ప్రత్యేక తెలంగాణ’ ఉద్యమాలు మూడు దశలుగా సాగాయి. 1968 నుండి ఉద్యమం మొదలైంది. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఒకే రాష్ట్రంగా ఆంధప్రదేశ్‌గా ఏర్పడినప్పుడు తెలంగాణ వనరులు, తెలంగాణ ఉద్యమాలు తెలంగాణ ప్రాంతం వారికే ఒప్పందాలు జరిగాయి. భారత రాజ్యాంగంలో రెండు ప్రత్యేక చారిత్రక దృష్టితో అనేక ఆర్టికల్స్ ‌చేర్చడం గమనించవచ్చు. జమ్ము కశ్మీర్‌కు, ఈశాన్య రాష్ట్రాలకు, గోవా, పుదుచ్చెరి, యానాం ప్రాంతాలకు ఈ ప్రత్యేక ఒడంబడికలు, ఆర్టికల్స్ ‌భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని కూడా భారత రాజ్యాంగం తనలో భాగంగా పొందుపరిచింది. దాన్నే 370 ఆర్టికల్‌ అని పిలుస్తారు.

భారతదేశ వ్యాప్తంగా ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలు జరిగితే, జమ్ము కశ్మీర్‌లో ఆరేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి. జమ్ముకశ్మీర్‌ ‌ముఖ్యమంత్రిని వజీర్‌ ఎ ఆజామ్‌ అని, ప్రధానమంత్రి అని పిలుస్తారు. అక్కడ ఇతర రాష్ట్రాలవారు, ఇతర దేశాలవారు ఎలాంటి ఆస్థులు కొనడానికి, ఉద్యోగాలు చేయడానికి వీలు లేదు. సరిగ్గా అలాంటిదే తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి 1956లో ఆంధప్రదేశ్‌గా ఏర్పర్చడానికి ముందు పెద్దమనుషుల ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నైజాం రాజ్యానికి చెందినవాడైనప్పటికీ డా।। బి.ఆర్‌. అం‌బేడ్కర్‌ను ఈ ఒప్పందం విషయంలో రాజ్యాంగంలో ఎలా చేర్చాలి అనే అంశంపై సలహాలు తీసుకోలేదు. ఆ ఒప్పందానికి రాజ్యాంగ ప్రతిపత్తి చేకూరలేదు. ఈ ఒప్పందాన్ని ముల్కీ రూల్స్ అని పిలుస్తారు. ముల్కి అంటే స్థానికులు అని అర్ధం. తెలంగాణ సేఫ్‌ ‌గాడ్స్ అని కూడా పిలుస్తారు.

ఈ ముల్కీ రూల్స్‌ను తెలంగాణ సేఫ్‌ ‌గాడ్స్‌ను రద్దు చేయాలని 1968లో కాకినాడలో ఉద్యమం ప్రారంభమైంది. దానికి వ్యతిరేకంగా, ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతం నుండి ఆంధ్రా గోబ్యాక్‌ ఉద్యమం నిప్పురవ్వలా అంటుకుంది. అది తెలంగాణ వ్యాప్తంగా రాజుకుంది. ‘ఆంధ్రా గోబ్యాక్‌’, ‘‌జై తెలంగాణ’, ‘ప్రత్యేక తెలంగాణ’ అనే మూడు దశల్లో ఉద్యమం సాగింది. 1968-1970 మధ్య ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచించాలని అకస్మాత్తుగా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారని అంటుంటారు. తెలంగాణ, విదర్భ అనే రెండు ప్రాంతాలను రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని ఫజుల్‌ అలీ కమిషన్‌ ‌సూచించింది. రాష్ట్రాల పునర్విభజనలో ఈ రెంటిని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే మహారాష్ట్ర నుంచి విదర్భ నాగపూర్‌ ‌కేంద్రంగా ప్రత్యేక రాష్ట్రం చేయాల్సి వస్తుందని మహారాష్ట్రకు చెందిన వై.బి. చవాన్‌ ‌వంటి నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నారని అంటారు.

ఆనాడు 1969-70లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉంటే తెలంగాణ దేశానికే ఒక నూతన అభివృద్ధి నమూనాగా ఎదిగి ఉండేది. నక్సలైట్‌ ఉద్యమం వచ్చి ఉండేది కాదు. 50 వేలమంది హతులై ఉండేవారు కాదు. లక్షలాదిమంది నిర్బంధాలకు, హత్యాచారాలకు గురై ఉండేవారు కాదు. నైజాం ర్యాంలో ఉన్నన్ని ప్రభుత్వ వనరులు, మౌలిక వసతులు, లోహాలు, ఖనిజాలు దేశంలో మరే రాష్ట్రంలో ఇంత సమృద్ధిగా లేవు. అందువల్ల తెలంగాణ 1969లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఉంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఊహించలేని విధంగా సాగి ఉండేది. అలా జరగలేదు. ఇతర ప్రాంతాల, మార్వాడి, గుజరాతీ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, ప్రభుత్వ సంస్థలు, ఇతర రాష్ట్రాలకు చెందినవారు తెలంగాణ ప్రాంతాన్ని తమకు అందివచ్చిన వనరు లుగా, అంతర్గత వలస వాదంతో విస్తరి ంచారు. 1964 నుండి తెలంగాణాలో నిరుద్యోగ సమస్య మొలకెత్తి విస్తరిస్తూ పోయింది. 1956లో ఆంధప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తెలంగాణాలో కూడా లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 వేలమందిని తొలగించారు. ఉన్నవారికి జీతాలు తగ్గించి, ఆంధ్రావారికి జీతాలు ఇవ్వగలిగేటట్టు చేశారు. తొలగించిన 50 వేలమంది స్థానంలో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలవారిని నియమించారు. అలా ఆంధాప్రాంత నిరుద్యోగ సమస్య పరిష్కారమై తెలంగాణ ప్రాంత నిరుద్యోగ సమస్య అసంతృప్తి రెట్టింపయింది. అది మూడు నాలుగేళ్ళలోనే ‘ఆంధ్రా గోబ్యాక్‌’ ఉద్యమంగా రూపం తీసుకుంది.

- Advertisement -

1968 ‘ఆంధ్రా గోబ్యాక్‌’, ‘‌జై తెలంగాణ’ ఉద్యమాల్లో వరంగల్‌ ‌నుండి ఎదిగిన యువకుల్లో డా।। కొల్లూరు చిరంజీవి ఒకరు. ఒకవైపు ఆచార్య కొండా లక్ష్మణ్‌ ‌బాపూజి, జె. ఈశ్వరీబాయి, ఎన్‌. ‌సదాలక్ష్మి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణాకు ఉద్యమించారు. మరోవైపు ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని తీర్పును అనుసరించి రాజీనామా చేసిన డా।। మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో దూకి వచ్చారు. ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధులు ‘ఆంధ్రా గోబ్యాక్‌’ ఉద్యమానికి కేంద్రమయ్యారు. ఇలా రాజకీయ శక్తులు, విద్యార్ధి యువతరం వర్గాలు ఉద్యమంలో నగరాల నుండి, పట్టణాల నుండి కిందిస్థాయి దాకా విస్తరించాయి. ఖమ్మం తర్వాత హైదరాబాద్‌, ‌వరంగల్‌, ‌కరీంనగర్‌, ‌నిజామాబాద్‌, ‌మెదక్‌, ‌మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, ‌నల్లగొండ జిల్లాలు ఉద్యమంలో ఒక ప్రవాహంగా ముందుకు సాగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక పోవడంతో ఆ ఉద్యమ చైతన్యం, విద్యార్ధుల, నిరుద్యోగుల, యువకుల ధర్మాగ్రహం, ఉద్యోగాలు దొరకక పోవడం, ఆంధ్రా, రాయలసీమ వలస ప్రవాహం వంటి కారణాలవల్ల నక్సలైట్ల ఉద్యమంలోకి ఒక తరానికి తరం వెల్లువలా ప్రవేశించింది. అలా జై తెలంగాణ ఉద్యమ చైతన్యం నుండి నక్సలైట్ల ఉద్యమంలోకి ప్రవేశించిన తొలితరం యువతరంలో డా।। కొల్లూరు చిరంజీవి ప్రముఖుల్లో ప్రసిద్ధులు.

అలా మొదలైన డా।। చిరంజీవి ప్రయాణం వందలాది యువకుల జీవితాల్లో, పరిణామంలో భాగంగా సాగుతూ వచ్చిన చైతన్యం వామపక్ష నక్సలైట్‌ ‌చైతన్యంగా మారింది. కొండపల్లి సీతారామయ్య, కె.జి. సత్యమూర్తిగార్ల నాయకత్వంలో ఉత్తర తెలంగాణాలో నక్సలైట్ల ఉద్యమం ఊపిరి పోసుకుంది. ఇది కూడా వలసవాదుల, ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల వలస విస్తరణకు తోడ్పడింది. ఈ విషయంపై 1996 మలి తెలంగాణ ఉద్యమంతోనే కొత్తచూపు ప్రసరించింది. నక్సలైట్ల ఉద్యమం వల్ల ఎన్నికల బహిష్కరణ, అశాస్త్రీయ విద్యావిధానం అంటూ ఉద్యమంలోకి ఆకర్షించడంవల్ల ‘జై తెలంగాణ ఉద్యమం’ తర్వాత మరింత వేగంగా ఆంధ్ర ప్రాంత వలసాధిపత్యం, ఉద్యోగాల ఆక్రమణలు, వనరుల కైవసం కొనసాగుతూ వచ్చాయి. అలా సంక్షోభం మరింత తీవ్రం కావడంతో నక్సలైట్ల ఉద్యమం వేగంగా విస్తరించింది. దానికి తోడు శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌ద్వారా బీడు భూములకు, పంట భూములకు నీరు అందిరావడంతో గ్రామీణ రైతాంగంలో భూదాహం పెరిగింది. అలా వారి ఊరేగింపు ఉద్యమం జగిత్యాల జైత్రయాత్రగా ప్రసిద్ధి చెందింది.

కొల్లూరు చిరంజీవి నక్సలైట్‌ ‌నాయకుడిగా ఎమర్జెన్సీలో ‘నాగపూర్‌’‌లో అరెస్టయ్యారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన సామాజిక కార్యక్రమాలు ఎవరికీ తెలియవు. డాక్టర్‌గా సహచరి డాక్టర్‌ ‌చంద్రతో పాటు వైద్యవృత్తిలో కొనసాగారు. 1989లో బహుజన సమాజ్‌ ‌పార్టీ నిర్మాత మాన్యశ్రీ కాన్షీరామ్‌ ఆం‌ధప్రదేశ్‌లో బిఎస్పీ నిర్మాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా మళ్లీ డా?? చిరంజీవి తెరపైకి వచ్చారు. బొజ్జా తారకం, జస్టిస్‌ ‌బి.ఎస్‌.ఎ. ‌స్వామి, డా?? సుందరయ్యగారలతో పాటు రాష్ట్ర నాయకత్వంగా ఎదిగారు. అలసిపోయి, విసిగిపోయి, ఆ పంథానుంచి విభేదించి నక్సలైట్ల ఉద్యమం నుండి బయటకు రావాలనుకున్నప్పుడు, ఎన్‌కౌంటర్ల పేరిట హత్యలకు గురయ్యేవారిని ఎందరో యువకులను నిశ్శబ్దంగా ప్రాణాలు కాపాడిన వ్యక్తి డా?? చిరంజీవి. 1990 నుండి రాష్ట్ర వ్యాప్తంగా బహుజన ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్లారు. వేలాదిమంది పాతతరాన్ని, యువతరాన్ని బహుజన సమాజ్‌ ఉద్యమంలోకి ఆకర్షించారు. భాగ్యరెడ్డి వర్మ వంటి వైతాళికులను, మహనీయులను మరుగున పడిన చరిత్రనుండి ముందుకు తెచ్చి అనేక కరపత్రాలు, వ్యాసాలు రాశారు. సభలు, సమావేశాలు నిర్వహించారు. 1994 ఎన్నికల్లో బిఎస్పీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. తెలంగాణా అంతటా తిరిగి తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. అలా 1989 నుంచి రాజుకుంటున్న అసంతృప్తి నుంచి తెలంగాణ అధ్యయన వేదికలు ఏర్పడ్డాయి. 1996 నుండి పూర్తిస్థాయి మలి తెలంగాణ ఉద్యమం రాజుకుంది. మండలస్థాయికి విస్తరించింది. అలా 1989 నుంచి డా।। కొల్లూరు చిరంజీవి బహుజన చైతన్యం కోసం బహుజన రాజ్యాధికారం కోసం తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జీవితాంతం కృషి చేశారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల రాజ్యాధికారం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం ప్రజలను కదిలించారు. కెప్టెన్‌ ‌పాండురంగారెడ్డి, కె.ఎన్‌. ‌రామదాస్‌, ‌పి.జె. సూరి, కొండా లక్ష్మణ్‌ ‌బాపూజీ, బి.ఎస్‌. ‌రాములు, గద్దర్‌, ‌మారోజు వీరన్న, మల్లేపల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, గూడ అంజయ్య, జయరాజ్‌, ‌గోరటి వెంకన్న, పాశం యాదగిరి, వంటి వారందరితో కలిసి నూతన చరిత్ర కోణాలను వెలికితీస్తూ ముందుకు సాగారు. కెప్టెన్‌ ‌పాండురంగారెడ్డి, డా।। చిరంజీవి, కుర్రా జితేంద్రబాబు, సంగిశెట్టి శ్రీనివాస్‌ ‌వంటి పాత, కొత్త మేలు కలయికతో తెలంగాణ భూమిపుత్రుల దృష్టితో తెలంగాణ చరిత్రను పునర్నిర్మిస్తూ రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమ సంఘాల ఐక్యవేదికలు ఏర్పాటయ్యాయి. 1969 ఉద్యమకారుల వేదిక ఏర్పడింది. దానికి అధ్యక్షులుగా విద్యావేత్త అరీఫుద్దీన్‌, ‌ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి అందరిని కూడగట్టారు. 2001లో టి.ఆర్‌.ఎస్‌. ఏర్పడి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు ఎప్పటికప్పుడు బహుజన కోణంలో చర్చలను, లక్ష్యాలను, ఉద్యమ రూపాలను ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఢిల్లీ దాక వెళ్ళి అనేక పార్టీల రాజకీయ నాయకులను కలిశాము. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అనేకమంది బహుజనులవలె తీవ్రమైన అసంతృప్తితో ఉండిపోయారు. తాము అనుకున్న తెలంగాణ ఇది కాదని, నక్సలైట్ల ఉద్యమంతో పారిపోయి ఓడిపోయిన భూస్వామ్య శక్తుల చేతుల్లోకి తెలంగాణ ప్రభుత్వ అధికారం రావడం వారికి ఇష్టం లేకపోయింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అధికారంలోకి రావాలని, వారి అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు. తన చివరి శ్వాస దాకా అదే దృష్టితో ప్రతి ఒక్కరితో సంభాషించేవారు. కదిలించేవారు. వారి ఆశ, ఆశయం ఎప్పటికి నెరవేరుతుందో…! అలా 1967 నూతన యవ్వనంలో ప్రారంభమైన చైతన్యజ్వాల జీవితమంతా డా।। చిరంజీవిలో రగులుతూనే వచ్చింది. ఒక గొప్ప తరానికి, గొప్ప చైతన్యానికి, తాత్విక చింతనకు డా।। చిరంజీవి ఒక ప్రతినిధిగా, చరిత్రగా నిలిచిపోయారు. మిత్రులు సహచరులు డా।। కొల్లూరు చిరంజీవిగారికి శ్రద్ధాంజలి.

BS ramulu
బి.ఎస్‌.‌రాములు,
సామాజిక తత్వవేత్త
ఫోన్‌: 8331966987

Leave a Reply