- ఓటీటీ వేదికలకు నూతన మార్గదర్శకాల విడుదల
- సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు
- ప్రింట్ మీడియా తరహాలో డిజిటల్ న్యూస్ మీడియా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకువస్తామన్న కేంద్రం
- వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రులు
సోషల్ మీ డియాపై కఠిన నిబంధనలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని అలా కాకుండా వాటికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే తక్షణమే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తోంది. ఇకపోతే దేశంలో ప్రింట్ మీడియా తరహాలో డిజిటల్ న్యూస్ మీడియానూ నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకువస్తామని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. సోషల్ మీడియా, ఓటీటీ వేదికలకు నూతన మార్గదర్శకాలను ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది. న్యూస్ వెబ్సైట్లను నియంత్రణ సంస్థ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.
ప్రింట్ మీడియా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరిస్తున్న తరహాలోనే న్యూస్ వెబ్సైట్లు కూడా ఓ నియంత్రణ సంస్థ మార్గదర్శకాలను అనుసరించేలా ఉండాలని ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. డిజిటల్ మీడియా నియంత్రణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనేది ఇంకా నిర్ణయించ లేదని, దేశంలో ఎన్ని న్యూస్ వెబ్సైట్లు ఉన్నాయనేదానిపై నిర్ధిష్ట సమాచారం లేదని సమాచార ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. డిజిటల్ న్యూస్ మీడియా తమ వివరాలను వెల్లడించాలని, వాటికి రిజిస్టేష్రన్‌ను తప్పనిసరి చేయలేదని తాము కేవలం సమాచారం కోరుతున్నామని అన్నారు. ఇక ఓటీటీ మాద్యమాలపై మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ మాట్లాడుతూ ఓటీటీ మాద్యమాల్లో మూడు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఓటీటీ, డిజిటల్ న్యూస్ మాధ్యమాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి వెల్లడించాలి. రిజిస్టేష్రన్ తప్పనిసరి అని మేము చెప్పడం లేదు, కేవలం వాటి నుంచి సమాచారం మాత్రమే కోరుతున్నామని అన్నారు. దీనికి కొనసాగింపుగా ఓటీటీ మాద్యమాలు, డిజిటల్ పోర్టల్లలో ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఉండాలి.
ఓటీటీ మాద్యమాల్లో సుప్రీంకోర్టు లేదా హైకోర్టుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి లేదా ఈ విభాగంలో ప్రముఖ వ్యక్తి నేతృత్వంలోని స్వీయ నియంత్రణ సంస్థ ఉండాలన్నారు. అంతే కాకుండా కంటెంట్‌కు సంబంధించి 13, 16, ఏ కేటగిరీలతో స్వీయ వర్గీకరణలు ఉండాలి. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో లాకింగ్ ఉండాలి. వారికి తెలియకుండా పిల్లలు ఆ లాక్‌ను తెరిచే వీలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని జావదేకర్ అన్నారు. ఒక సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాల్సిందే. ఏదైనా దర్యాప్తు లేదా సైబర్ సంబంధిత ఘటనలపై అడిగిన 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాలి. లైంగిక చర్యలకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు అందిన రోజునే తప్పనిసరిగా స్పందించాలి. జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు కంపెనీ తప్పనిసరిగా అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే ఫిర్యాదుల పరిష్కారానికి మరొక అధికారిని తప్పనిసరిగా నియమించాలి. అయితే ఈ అధికారులు తప్పని సరిగా భారతీయులై ఉండాలని కొత్త నిబంధనల్లో కేంద్రం పేర్కొన్నట్లు సమాచారం. కాగా, ఈ నిబంధనల్లో చిన్నచిన్న మార్పులతో పాటు మరిన్ని నిబంధనలు చేర్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఇకపోతే సమాచార నియంత్రణ విషయమై ట్విట్టర్‌తో కేంద్రానికి నెలకొన్న వివాదం పెరిగి పెరిగి పెద్దదై.. ఆ ప్రభావం మొత్తం సోషల్ మీడియాపై పడింది. నిజానికి, సమాచార నియంత్రణకు 2018 నుంచే ప్రభుత్వం నిబంధనల రూపకల్పనల చేస్తోంది. తాజాగా రైతుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని తొలగించాలంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ట్విట్టర్ పట్టించుకోకపోవడం తాజా దూకుడుకు ఆజ్యం పోసింది. సోషల్ మిడియాతో పాటు ఓటీటీ రంగంపై కూడా నూతన నిబంధనలను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక సామాజిక మాధ్యమాలను ఉద్దేశించి ప్రస్తుతం రూపొందించిన నిబంధనలు మూడు నెలల్లో అమలులోకి వస్తాయి. ఆలోపు ఆయా సోషల్ మీడియా సంస్థలు తమ విధాన నిర్ణయాల్ని మెరుగు పర్చుకోవాలన్నారు.
మిగిలిన నిబంధనలు నిర్ణయాత్మక తేదీ నుంచి అమలులోకి వస్తాయని అన్నారు. భారతదేశంలోకి ప్రతి సామాజిక మాధ్యమానికి మేము స్వాగతం పలుకుతాం. కానీ వారు ఇక్కడి వచ్చి రెండు నాల్కల ధోరణితో వ్యవహ రిస్తున్నారు. అమెరికాలో క్యాపిటల్‌పై దాడి జరిగినప్పుడు విధ్వంసకులపై చాలా కఠినంగా వ్యవహరించారు. కానీ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన దాడి విషయంలో ఉదాసీనత చూపించారు. ఇలాంటి రెండు నాల్కల ధోరణిని మేం ఎంత మాత్రం సహించమని కేంద్రమంత్రి అన్నారు. అయితే ఆయన పేరు ప్రస్తావించక పోయినప్పటికీ ప్రధానంగా ట్విట్టర్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే విషయం స్పష్టమవుతూనే ఉంది.