“హైదారాబాద్ బాగ్యలక్ష్మి గుడి దగ్గరికి రమ్మని ఛాలెంజ్ చేసినట్లే బండి సంజయ్ భద్రకాళిగుడి వేదికగా టిఆర్ఎస్ నాయకులకు మరో ఛాలెంజ్ విసిరాడు. వరంగల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందంటూ, ఈ ప్రభుత్వం అనేనక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నదని, దాన్ని భద్రకాళిదేవస్థానం వేదికగా తాను నిరూపించగలనని, దమ్ముంటే టిఆర్‌ఎస్‌నేతలు తనఛాలెంజిని ఎదుర్కోవాలంటూ, అందుకు 48 గంటల వ్యవధినిస్తున్నట్లు ప్రకటించాడు.”
రాష్ట్ర అధికార టిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకుల మద్య ఇటీవల మాటల యుద్ధం కొనసాగుతున్నది. నువ్వు ఒకటంటే, నేను రెండంటా అన్నట్లు ఈ రెండు పార్టీల మద్య సాగుతున్న మాటలు ఫుట్‌బాల్ ఆటను తలపిస్తున్నాయి. స్టూవార్టుపురం దొంగలు, గాడ్సే వారసులని ఒకరంటే, మరో పార్టీ లంకాదహనం చేసినట్లు అవినీతి సామ్రాజ్యాన్ని అంతం చేసి, శ్రీ కృష్ణజన్మస్థానానికి పంపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ ఇటీవల కాలంలో ఒకరినొకరు నిందించుకోవడం ఎక్కువైపోయింది. గోలకొండ ఖిలా మీద కాషాయ జంఢా ఎగురేసే లక్ష్యంగా బిజెపి దూసుకువొస్తోంది. ఈ సందర్భంగా అధికారపార్టీ తప్పులను ఎత్తిచూపే ఏఒక్క చిన్న అవకాశాన్ని కూడా ఆ పార్టీ వదులుకోవడంలేదు. ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత బిజెపిలో ఈ దూకుడు తత్వం మరింత పెరిగింది. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే నిధులు, పథకాలపైన రాష్ట్ర పార్టీ దృష్టి పెట్టింది.
కేంద్రం నుంచి రాష్ట్రాలకు వస్తున్న నిధులపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాల్సిందిగా బిజెపి రాష్ట్ర నాయకత్వం అధికార టిఆర్ఎస్ను డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుండి సంక్రమించే నిధులను రాష్ట్ర ప్రభుత్వం తాను విడుదలచేస్తున్న నిధులుగా చెప్పుకుంటోందన్నది రాష్ట్ర బిజెపి నాయకుల ఆరోపణ. కేంద్రం నిధులకు సమాన నిధులను జతచేసి పథకాలు అమలుచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాను కేటాయించకుండానే పథకాలు చేపట్టడాన్ని బిజెపి స్థానిక నాయకత్వం ఆక్షేపిస్తోంది. అలాగే ఆ పథకాల ప్రచార కార్యక్రమంలోగాని, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ప్రోటోకాల్‌ను పాటించకపోవడాన్ని ఎత్తి చూపుతూ ఆ పార్టీ నాయకత్వం గొడవకు దిగుతోంది. కేంద్రం పథకాలను అమలుచేస్తున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆక్షేపిస్తున్నారు. దానివల్ల అవి నరేంద్రమోదీ పథకాలన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్నది ఆ పార్టీ ఆలోచన. కాని, ఆ పథకాలకు సమాన నిధులను చేకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సిఎం కెసిఆర్ ఫోటోను వేసుకోవడమే న్యాయమైనదిగా భావిస్తోంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మండలంలో ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వాక్సినేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇదే జరిగింది. ఆ ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధాని నరేంద్రమోదీ ఫోటో లేకపోవడంపై స్థానిక బిజెపి నేతలు, కార్యకర్తలు గొడవ చేపట్టారు. ఈ విషయంలో టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తల మద్య జరిగిన వివాదం, చివరకు బిజెపి కార్యకర్తల కోపాగ్నికి అక్కడ నరేంద్రమోదీ ఫోటోలేని ఫ్లెక్సీ చీలికలు పేలికలైంది. అప్పటికి అందుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేయటం వేరేవిషయం.
ఇలా ప్రతీ చిన్న విషయాన్ని బిజెపి ఇప్పుడు బూతద్దంలో పెట్టి చూడడంతో రోజుకో కొత్త వివాదం తెరపైకి వస్తోంది. ముందుగానే చెప్పుకున్నట్లు గోలకొండపై కాషాయ జంఢా ఎగురవేయాలన్న లక్ష్యంగా పురోగమిస్తున్న బిజెపికి ఇప్పుడు వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు కలిసి వస్తున్నాయి. ఇటివల ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అరుణ్ చుగ్‌తో కలిసి వరంగల్ వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వదిలిన మాటల తూటాలు ఇరు పార్టీ నాయకుల మద్య ఫుట్ బాల్లా మారాయి. బండి సంజయ్ హిందుత్వంపై టిఆర్ఎస్ ఎంఎల్ఏలు మాట్లాడిన తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహమైన వ్యాఖ్యలు చేయడంచూస్తుంటే కార్పోరేషన్ ఎన్నికలనాటికి ఈ రెండుపార్టీలు ఇంకా ఎంతటి ఘాటైన పదప్రయోగాలు చేస్తారోనన్న ఆందోళన కలుగక మానదు.
హైదారాబాద్ బాగ్యలక్ష్మి గుడి దగ్గరికి రమ్మని ఛాలెంజ్ చేసినట్లే బండి సంజయ్ భద్రకాళిగుడి వేదికగా టిఆర్ఎస్ నాయకులకు మరో ఛాలెంజ్ విసిరాడు. వరంగల్నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను టిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందంటూ, ఈ ప్రభుత్వం అనేనక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నదని, దాన్ని భద్రకాళిదేవస్థానం వేదికగా తాను నిరూపించగలనని, దమ్ముంటే టిఆర్‌ఎస్‌నేతలు తనఛాలెంజిని ఎదుర్కోవాలంటూ, అందుకు 48 గంటల వ్యవధినిస్తున్నట్లు ప్రకటించాడు. భాగ్యలక్ష్మీ టెంపుల్ ఛాలెంజీలాగానే టిఆర్ఎస్ నాయకత్వం భద్రకాళీ దేవస్థానం ఛాలెంజీని పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడం అటుంచి, వరంగల్ స్మార్ట్ సిటీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితైతే ఏర్పడింది. వరంగల్ స్మార్ట్ సిటీకోసం కేంద్ర ప్రభుత్వం ప్రతీఏటా వందకోట్లు విడుదలచేస్తుండగా, అందుకు సమాన నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించాల్సిఉంది. ఆ విధంగా అయిదేళ్ళలో వెయ్యికోట్లతో వరంగల్ నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపుదిద్దాలన్నది కేంద్ర పథకం.అయితే ఇప్పటికి కేంద్రం రెండు విడుతల్లో 196 కోట్లను విడుదలచేసింది.
ఆ నిధుల్లోని కొంత బాగాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేయడంవల్ల అభివృద్ది పనులు నిలిచిపోతున్నాయన్నది బిజెపినాయకుల అరోపణ. దానిపై వివరణ ఇవ్వడానికే భద్రకాళి ఛాలెంజ్. అలాగే తన హిందుత్వాన్ని ఎత్తి చూపిన టిఆర్ఎస్ నేతలకు బండి సంజయ్ మారో ఛాలెంజ్ విసిరాడు. తాను హిందువో కాదో డిఎన్ఏ పరీక్షలు చేయాలన్న టిఆర్ఎస్ నేతలను నాగార్జునసాగర్ గడ్డమీద తేల్చుకుందాంరండంటూ మరోసారి సవాల్ చేశారు. ఆ సందర్భంగానే ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి అరుణ్ చుగ్ లంకను దహనం చేసినట్లుగా కెసిఆర్ అవినీతిని అంతమొందించి, ఆయన్ను శ్రీ కృష్ణ జన్మస్థానానికి పంపేరోజులు దగ్గరలోనే ఉన్నాయంటుంటే, బిజెపి అంటేనే బక్వాస్ జాదా పార్టీ అని ఆ పార్టీ ఎంఎల్ఏలు విమర్శిస్తున్నారు. అయితే కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తీరులో మాత్రం మార్పు కనిపిస్తోంది. బాగ్‌లింగంపల్లి వద్ద తాజాగా డబుల్ బెడ్ రూం ఇళ్ళను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించిన సందర్భంలో రాజకీయపార్టీల మద్య ఎలాంటి విబేదాలున్నా అవన్నీ ఎన్నికలవరకే ఉండాలని, ఎన్నికల తర్వాత మనను ఎన్నుకున్న ప్రజల సంక్షేమంకోసం పార్టీలన్నీ కలిసి పనిచేయాల్సిన అవసరముందని, అందుకు కేంద్ర నాయకత్వం సహకరించాలనడం ఇందులో కొసమెరుపు.
