(మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కవితా నివాళిగా)
అధినాయకులకే అద్వితీయుడు
విలువలు వదలని సచ్ఛీలుడు
మంత్రాంగంలో అపర చాణక్యుడు !రాజకీయ వైకుంఠపాళిలో…
విషసర్పాలకు చిక్కకుండా..
నిచ్చెన ఎక్కగల ధీశాలే కాదు
పదవులకే వన్నె తెచ్చిన నాయకుడు !
ట్రబుల్కే ట్రబుల్ షూటర్ నీవు
మూర్తీభవించిన ముఖర్జీ మూర్తిమత్వం..
స్వదేశీలకు గర్వకారణమే కాదు..
పరదేశీయులకు ఈర్ష్యాజనకం కూడా !
పని భారమెంతైనా వెరవక..
నవ్వుతూ మోయగల మేథోశక్తి
రాజకీయాల్లో అతి చతురుడు
భావోద్వేగాల్లో గంభీరుడు !
అపరచాణక్య వ్యూహకర్త..
రాజ్యాంగాన్ని ఔపోసన పట్టిన..
రాజకీయ దురంధర శిఖరం
ఐదున్నరడుగుల విజ్ఞాన బులెట్ !
మేధావులకే అపరమేధావి
సంక్షోభ పరిష్కార దిగ్గజ నేత
రాజకీయ యుద్ధాల్లో సహితం..
ఆరితేరిన పోరాట యోధుడు !
బడబాగ్నులెన్ని మదిన రగిలినా..
ప్రశాంత సముద్ర వదనుడు
యావద్దేశాన్ని శోక సంద్రంలో..
వదిలి వెళ్ళిన బహుముఖ ప్రజ్ఞాశాలి !
చరిత్రపై చెరగని సంతకం
కనుమరుగైన అనుభవశాలి
దివికేగిన మేరునగధీరుడు
ప్రణామాలు ప్రణబ్ దాదా !
కంప్యూటర్లే తల దించుకునే..
అసమాన జ్ఞాపకశక్తి నీ సొంతం
నిశ్చితి అనిశ్చితాల నడుమ..
నిబ్బరంగా పయనించిన బాటసారి !
పడిలేచే ఉత్తుంగ తరంగం
సంకీర్ణ సంస్కరణ పథాలకు..
ముందు వెనుకా నీ అడుగులే
భారత చరిత్రలో చైతన్య సాక్షి !
పాలిట్రిక్స్ రాని అజాత శత్రువు
పల్లె గుడ్డి దీప వెలుగులోంచి..
తళుకులీను రాష్ట్రపతి భవన..
మ్నెట్లెక్కిన దేశ ప్రథమ పౌరుడు !
ప్రజాస్వామ్య హితైషులందరికీ..
శరాఘాతం సమాన దార్శనికత
రాజ్యాంగ వనమాలి ప్రణామం
నీ మరణం ఓ అనంత అగాధం !
లక్షల తెలంగాణీయుల కన్నీళ్లకు..
ఒక్క సిరా చుక్కతో ఫుల్స్టాప్ పెట్టి..
తెలంగాణాను ఇచ్చిన భారతరత్న
మా గుండెల్లో నీవెపుడూ పదిలమే !

విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్ -99497 00037