శ్రీకాకుళం, ఫిబ్రవరి 14 : విధి రాసిన రాతలో ఓ నవజంట దుర్మరణం చెందింది. పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలనుకున్న ఈ జంటను మృత్యువు కబళించింది. సింహాచలంలో సంబరంగా పెళ్లి చేసుకున్నారు. వరుడి ఇంట్లో రిసెప్షన్ జరుపుకున్నారు. పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నారు. రెండు రోజుల తర్వాత వధువు ఇంటికి వెళ్లారు. కాసేపు ఉండి బైక్ పై బయల్దేరారు. అంతలోనే ఘోరం జరిగిపోయింది. రోడ్డు ప్రమాదంలో వధూవరులిద్దరూ మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఈ ఘటన జరిగింది. దీంతో పెళ్లి ఇల్లు కాస్తా రోదనలతో నిండిపోయింది.
మున్సిపాల్టీ 23వ వార్డు బెల్లుపడ కాలనీకి చెందిన గవలపు నాగరత్నం, రామారావు కుమారుడు వేణు అలియాస్ సింహాచలం (26)కు ఒడిసా రాష్ట్రం బరంపురానికి చెందిన సుభద్ర అలియాస్ ప్రవల్లిక (23)తో ఈనెల 10న సింహాచలం వరహా లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో వివాహమైంది. పెళ్లికి బంధువులందరూ హాజరయ్యారు. ఈనెల 12న ఆదివారం మధ్యాహ్నం వరుడు ఇంటివద్ద రిసెప్షన్ జరిగింది. బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సోమవారం సాయంత్రం బరంపురానికి ద్విచక్రవాహనంపై వెళ్లారు. కాసేపు ఉండి తిరిగి బయల్దేరారు. బలేగడ జాతీయ రహదారి పెట్రోల్ బంక్ సపంలో వీరి బైక్ ప్రమాదానికి గురైంది. వీరి బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో వధువు ఘటనా స్థలంలోనే మృతి చెందగా తీవ్ర గాయాలతో పడి ఉన్న వరుడిని స్థానికులు బరంపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు.