కాకతీయ కలగూరగంప – 30
(ముసలి ముచ్చట్ల చద్ది మూట)
అసలేకలహభోజనుడాయె,
యీప్రమాణాలకయ్యంవదులుతాడా?
కమలాక్షుని అనుమతితో నింగినుండి
భువికి పయనం కరకర ఆకలితో
అయితే ఏగుడిలో యేప్రసాదమో
తెలియనిసందిగ్ధం!
పులిహోర యేగుళ్ళోనో,
చక్కెర పొంగలి ఆలయమేదో,
గారెలు బూరెల గుడియేదో,
అంతా ఆ కలహ ప్రమాణ తీవ్రత ఆధారం,
ఆ ప్రసాద నమూనా, నాణ్యత!
గిరీశంను అడిగా మనుకోండి
అంటాడు తప్పకుండా
‘‘మన రాజకీయ నాయకులు ఘనులోయ్,
లేకుంటే ‘ఉలుకూపలుకు లేకుండా
రాతి విగ్రహంలా చోద్యం చూస్తూ
మందహాసం చేస్తూ నిలబడితే
ఊర్కుంటామా, నోరువిప్పండి
తీర్పుచెప్పండి’ అని ఇష్టదైవాలనే
శాసిస్తున్నారు కదా!’’
ఆకాశ విహార నారదుడు ఏగుడికి ముందుపోవాలా అని
సారించాడు దృష్టి భూగోళంవైపు
జూం చేసాడు భారతం వైపు
మరికొంచం జూం తెలంగాణా, ఆంధ్ర వైపు
‘ఏమిటా కమ్ముకొస్తున్న పొగ?’
అనుకున్నాడు దట్టంగా తన వైపే దూసుకొస్తున్న
ఆ అస్పష్ట మబ్బు తునకల సముదాయాన్ని చూసి,
‘కొంపదీసి కొరొనా దండయాత్ర కాదుగదా స్వర్గంపైకి?’
‘ఐనా మాస్కు లేకుండా ఎందుకు నాకీ తొందర పయనం?’
కంగారులో బయటకే అన్నాడు మనస్సులో మాట.
‘’ఓ కంగారు కలహభోజనా,
ఆ వచ్చేది కొరొనా కాదు, కొరొనా పీడిత ప్రజలూ కాదు
నీ ఆకలి తీరడానికి ఏఏ గుళ్ళకు వేశావో నీ టూర్ ప్రోగ్రాం
ఆ యా గుళ్ళ దేవాదిదేవుళ్ళు!
ఇక నీ భోజనం గతి అంతే
మనము తిరిగి వెనక్కుపోవాలి మరంతే
అంది మహా తియ్యగా ‘మహతి’ వీణ..
నారద ముని మాట్లాడేలోగా
ఆ దేవ సమూహం దగ్గరైంది.
కొందరు ఇటూ, కొందరు అటూ,
ఆతృత నిండిన పరుగులతో …
ఒకరిద్దరిని ఆపాడు ఆ మహర్షి
‘ఏమిటీ పరుగులు, ఏమిటి మీ ముఖంలో
ఆ కలవరం?’’
అడిగాడు త్వరత్వరగా
‘స్వామీ, ఇంకో గంటలో మాకుంది గండం
దాన్నితప్పించుకోవడానికి ఈ పరుగు!
ఎక్కడ దాక్కోవాలో తెలియక చస్తున్నాం’
మహర్షి నోరు విప్పేలోగా అక్కడ వుంటేగా?
మళ్ళీ గమ్యం తెలియని పరుగులు..
.
మరో ఇద్దరిని ఆపి బలవంతంగా
తెలుసుకున్నాడు వారి ఉరుకు పరుగుల కారణం!
ఆయనెవరో ఒక చిరు ప్రజాప్రతినిధి అట
అపుడెప్పుడో మద్యం మత్తులో కారు నడిపి
ఒక ప్రజానాయకుడి విగ్రహాన్ని గుద్ది కూల్చేసేడట
ఈ అభియోగం చేసింది ఆయన ప్రత్యర్థి పార్టీ చిరునాయకుడు
‘అదంతా అబద్ధం నాపై అసూయతో
చేస్తున్న అసత్యారోపణ
కావాలంటే మన వూరి ఆ దేవదేవుని
గుడిలో చేస్తాను ప్రమాణం
దమ్ముంటే రమ్మనండి’
ఇది ఆరోపణపై సవాలు
‘దమ్మూ ధైర్యం నా సొత్తు, నిన్ను చేస్తాను చూడు చిత్తు
నీవన్న రోజుకి ఆ టైముకు నేను కూడా హాజర్’’
ఇది ఆరోపణాస్త్ర జవాబు
ఇంకేం, హమేషా ప్రజల గుండె చప్పుళ్ళైన
టీవీ వార్తా ప్రసరణలు
చేసాయి ఈ ప్రమాణాల చందాన్ని
తమ తమ వీలైనట్లు రసకందాయం
మరో గంటలో ఆ గుడికి ఆగమనం
ఆ నాయక ప్రతినాయక ద్వయం
వారి వెంట వందిమాగధ బృందం
ఇలా ఈ ఆరోపణల కేసులెన్నో
చేరాయి వివిధ గుడులెన్నో
ఏ గుడి ఐనా రాతివిగ్రహం దేవుడే కాని
భక్తుల కోరికలను తీర్చే సుతిమెత్తని
దయార్ద్ర హృదయ భగవంతుడాయె
ఇద్దరు భక్తుల జగడపు తీర్పు
చెప్పే న్యాయశాస్త్ర అర్టికిల్
అప్ప్లై చేయమంటే ఎలా?
అందుకే అర్జెంటుగా విగ్రహంలోంచి దేవుళ్ళు మాయం
ఆ పరమశివుడో, ఆ పరంధాముడో వారి గమ్యం
ఈ గడ్డు సమస్యకు వారు మాత్రమే తమ రక్షా కవచమని
ఈ చిక్కు తీర్పుకు వారే చూపిస్తారొక పరిష్కారమని
తన ఆకలి తీరదన్నఆక్రోషంతో
‘నేను మీతో వస్తాను పదండి’ అన్నాడువారితో,
వెనుదిరిగాడు ఆ కలహభోజనుడు
ఉస్సురుమంటూ,
‘ఈ క్రొత్త ప్రమాణాల రాజకీయం బాగుందం’టూ
– శ్రీమతి పాములపర్తి చంద్రకీర్తి
పాములపర్తి నిరంజన్ రావు