ముంబై, జనవరి 23 : మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. శివసేన నుంచి విడిపోయిన రెండు నెలలకు ముంబై రాజకీయాల్లో సంచలనం నమోదైంది. రానున్న సివిక్ పోల్స్‌ను దృష్టిలోపెట్టుకుని కూటమిగా దగ్గరయ్యేందుకు ఉద్దవ్ వర్గం- ప్రకాశ్ అంబేడ్కర్ నిర్ణయించాయి.ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కొత్త పొత్తులు కలిశాయి. ఉద్దవ్ ఠాక్రే, ప్రకాశ్ అంబేద్కర్ చేతులు కలిపారు. త్వరలో జరుగనున్న ముంబై సివిక్ పోల్స్‌లో అధికారం చేజిక్కించు కునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. బాలాసాహెబ్ ఠాక్రే జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్దవ్ ఠాక్రే-ప్రకాశ్ అంబేద్కర్ కూటమి ఏర్పాటు ప్రకటన చేశారు. రెండు పార్టీలతో ఏర్పాటవుతున్న ఈ కూటమి.. రానున్న రోజుల్లో బలమైన ప్రజాపక్షంగా తయారవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
సోమవారం ముంబైలోని ఉద్దవ్ నివాసంలో జరిగిన ఒక సమావేశంలో ఉద్దవ్ ఠాక్రే, ప్రకాశ్ అంబేద్కర్ కూటమిని ప్రకటించారు. వీరిద్దరూ గత రెండు నెలలుగా కూటమి తయారు కోసం చర్చలు జరుపుతున్నారు. ఇరుపార్టీలకు చెందిన సీనియర్లు ఈ కూటమి ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు.’మహారాష్ట్రలోని చాలా మంది ప్రజలు మేం కలిసి రావాలని కోరుకున్నందుకు నేను సంతృప్తిగా, సంతోషంగా ఉన్నాను. ప్రకాష్ అంబేద్కర్‌తో కలిసి కూటమిని ఏర్పాటు చేసేందుకు ఇక్కడ కలుసుకోవడం శుభసూచకం’ అని ఉద్దవ్ ఠాక్రే అన్నారు. మా తాత, ప్రకాశ్ తాత ఇద్దరూ సహచరులుగా ఉండి అప్పట్లో సామాజిక సమస్యలపై పోరాడారని ఉద్దవ్ చెప్పారు. ఠాక్రే, అంబేద్కర్‌లకు చరిత్ర ఉన్నదని, ఇప్పుడు వారి భవిష్యత్ తరాలుగా మేం కూడా దేశంలోని ప్రస్తుత సమస్యలపై పోరాడేందుకు సిద్ధమయ్యాం అని పేర్కొన్నారు. ఈ కూటమి దేశంలో కొత్త రాజకీయాలకు నాందీ అని ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. ప్రస్తుతానికి తామిద్దరమే కూటమిలో ఉన్నామని, కాంగ్రెస్ ఇంకా పొత్తును అంగీకరించలేదని తెలిపారు. శరద్ పవార్ కూడా తమ కూటమిలో చేరుతారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.