Take a fresh look at your lifestyle.

గ్యాంగ్‌స్టర్‌ ‌నయీం కేసులో కొత్త కోణం

పోలీసు, రెవెన్యూ అధికారుల పాత్రపై ఆధారాలు
లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేయనున్న ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్

‌గ్యాంగ్‌స్టర్‌ ‌నయీం కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసి లొంగిపోయిన అనంతరం సెటిల్‌మెంట్లు, భూకబ్జాలతో అనేక అరాచకాలకు పాల్పడిన నయీం మూడేళ్ల క్రితం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. అయితే, నయీంను ఉపయోగించుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించిన ప్రభుత్వం నయీంతో అంటకాగిన 25 మంది పోలీసు అధికారులపై ఆ శాఖ చర్యలు తీసుకుంది. తాజాగా, నయీం కేసులో పోలీసులు, రెవెన్యూ అధికారుల పాత్రపై లోక్‌పాల్‌లో ఫిర్యాదు చేసేందుకు ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌సిద్ధమైంది.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం సేకరించిన ఫోరం ప్రతినిధులు నయీంతో పోలీసు,రెవెన్యూ శాఖ అధికారులు దిగిన ఫోటోలు, వీడియో సాక్ష్యాలను లోక్‌పాల్‌కు అందించనుంది. తాము సేకరించిన అధికారిక సమాచారాన్ని లోక్‌పాల్‌ ‌ముందు ఉంచి నయీంతో కలసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరేందుకు సిద్ధమైంది. నయీంతో కలసి పోలీసు, రెవెన్యూ శాఖలలో కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ దాదాపు రూ. 500 కోట్లు సంపాదించారనీ, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై మరోమారు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని లోక్‌పాల్‌కు ఫోరం ఫర్‌ ‌గుడ్‌ ‌గవర్నెన్స్ ‌సభ్యులు త్వరలోనే ఫిర్యాదు చేయనున్నారు.

Leave a Reply