Take a fresh look at your lifestyle.

భారత విద్యా విధానంలో నూతన శకం

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో భారత దేశం ఒకటి. యువశక్తి దేశానికి విలువైన ఆస్తి. సరికొత్త అంశాలను సృష్టించడంలో యువత పాత్ర కీలకం. భావిభారత నిర్మాతలైన యువకులకు సరైన విద్య ,నైపుణ్యాలు ఉంటేనే జాతి భవిష్యత్తును తీర్చిదిద్దగలరు. తాజాగా ప్రాథమిక విద్య మొదలుకొని విశ్వవిద్యాలయ విద్య వరకు అన్ని స్థాయిలలోనూ విస్తృతమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాపై కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడంతో పాటు అతి త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.

కేంద్రంలో ప్రభుత్వం మారినప్పుడు విద్యావిధానంలో  మార్పు రావడం స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అత్యంత సహజంగా కనిపిస్తున్నపరిణామం. వాజ్‌ ‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు మానవవనరుల శాఖ మంత్రిగా ఉన్న డాక్టర్‌ ‌మురళీ మనోహర్‌ ‌జోషి పాఠ్యాంశాలలో మార్పులు చేర్పులు చేయడానికి ప్రయత్నించినప్పుడు సంఘ్‌ ‌పరివార్‌ ‌భావజాలాన్ని విద్యారంగంలో ప్రవేశ పెడుతున్నారంటూ వామపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని సాగించాయి.తర్వాత యూపీఏ కాలంలో విద్యా వ్యవస్థ జోలికి వెళ్లలేదు. నరేంద్ర మోడీ అధికారంలోకి రాగానే దాదాపుగా 34 సంవత్సరాల తర్వాత విద్యారంగంలో సమూల మార్పులు సూచించేందుకు ఇస్రో మాజీ చైర్మన్‌ ‌కస్తూరి రంగన్‌ ‌నేతృత్వంలో ఒక కమిటీ  మరియు  విద్యాశాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో మరొక కమిటీని నియమించింది . స్వతంత్ర భారతదేశంలో 1968, 1986 తర్వాత ఇప్పుడు 2020 లో మూడవ జాతీయ విద్యా విధానాన్ని పై రెండు కమిటీల సిఫార్సులను క్రోడీకరించి రూపొందించినారు. దీని ద్వారా విద్యార్థులపై భారం తగ్గుతుందని, సృజనాత్మక శక్తిని పెంచేందుకు అవకాశం లభిస్తుందని ,మూస విద్యా విధానం పద్ధతులకు భిన్నంగా విద్యార్థుల అభిరుచికి అనుగుణమైన విద్యను అందించడం ద్వారా ప్రపంచ స్థాయి విద్యా  వ్యవస్థతో పోటీ పడవచ్చని పేర్కొంటున్నారు.

ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు దాటిన విద్యార్థులకు మాత్రమే ఒకటవ తరగతి లో ప్రవేశం కల్పిస్తున్నారు కొత్త విధానంలో మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు శిశు తరగతి లో ప్రవేశం కల్పిస్తారు.   ఐదవ తరగతి వరకు మాతృభాషలో చదువుకోడానికి అవకాశం మరియు అవసరాన్ని బట్టి ఎనిమిదో తరగతి వరకు కొనసాగించవచ్చు.పాఠశాల విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ఇప్పుడున్న 10ం2 వ్యవస్థను తీసి 5-3-3-4 వ్యవస్థను తీసుకొచ్చింది .ఇప్పటివరకు ఉన్న 10ం2 వ్యవస్థ సంప్రదాయ పద్ధతిలో అన్ని తరగతులకు ఒకే రకమైన విధానం ఉంది . కానీ కొత్త విద్యావిధానంలో మూడో సంవత్సరం నుండి 18 సంవత్సరాల వరకు వివిధ దశలలో వివిధ రకాల సబ్జెక్టులను చదవడం ద్వారా విద్యార్థులలో పరిశీలన సామర్థ్యాన్ని పెంపొందించి ఉన్నత స్థాయికి చేరే  సరికి వారి దృష్టి పరిశోధనల వైపు మళ్లీ వినూత్న ఆవిష్కరణలకు బీజం పడుతుందని భావిస్తున్నారు. 9 నుండి 12 వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ ‌విధానం వర్తిస్తుంది. డిగ్రీ స్థాయి విద్యను నాలుగు సంవత్సరాలకు పెంచి బహుళ నిష్క్రమణ విధానం ప్రవేశపెట్టారు. ఒక సంవత్సరం మాత్రమే చదివి నిష్క్రమించే వారికి సర్టిఫికెట్‌, ‌రెండేళ్ల తర్వాత వెళ్లేవారికి డిప్లమా, మూడేళ్ల చదువు పూర్తి చేసి  ఉద్యోగం వైపు వెళ్లేవారికి బ్యాచిలర్‌ ‌పట్టా ఇస్తారు. ఎంపిక చేసుకున్నా సబ్జెక్టులో పరిశోధన చేయదలచిన వారు నాలుగో సంవత్సరం కూడా కొనసాగించవచ్చు. 5 ఏళ్ల తర్వాత మాస్టర్‌ ‌డిగ్రీతో కలిపి ఇంటిగ్రేటెడ్‌ ‌బ్యాచిలర్‌ ‌డిగ్రీ అందజేస్తారు.ఇప్పటి విధానానికి భిన్నంగా అభిరుచిని బట్టి సబ్జెక్టులు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను విద్యార్థులకు ఇవ్వబోతున్నారు .అకౌంట్స్ ‌తో పాటు కెమిస్ట్రీ లేదా చరిత్ర తో పాటు గణితం… ఇలా వేర్వేరు కాంబినేషన్లతో డిగ్రీ చేయవచ్చు.

ఈ విద్యావిధానంలో మరొక ముఖ్యమైన మార్పు బహుళ విభాగాల పరిశోధన.  2030నాటికి ప్రతి జిల్లాకి ఒక బహుళ విభాగ యూనివర్సిటీ ఉండాలని మరియు 2040 నాటికి అన్ని ఉన్నత విద్యా కళాశాలలు బహుళ విభాగాల కళాశాలలుగా మార్చాలని ప్రతిపాదించారు. అలాగే విద్యకు జీడీపీలో ప్రస్తుతం కేటాయిస్తున్నా నిధులు 1.7శాతం నుండి 6 శాతానికి పెంచి తద్వారా స్థూల నమోదు నిష్పత్తిని ( గ్రాస్‌ ఎ‌న్రోల్మెంట్‌ ‌రేషియో) 2035 నాటికి 50 శాతానికి  పెంచాలన్నది ఎన్‌ఈపీ లక్ష్యం .  ప్రపంచంలోని టాప్‌100  ‌ర్యాంకు లోపు ఉన్న విశ్వవిద్యాలయాల క్యాంపస్‌ ‌లను భారత్లో పెట్టడానికి నూతన విద్యా విధానం అవకాశం కల్పిస్తుంది. ఆదర్శాలు ఎంత బలమైనవైన వాటికి ధీటైన ఆచరణ ఉండాలి. దశాబ్దాల క్రితం కొఠారి కమిషన్‌ ‌యొక్క  సూచనలైన ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిష్పత్తిని నేటికీ పాటించడం లేదు. ఉద్యోగం పొందడానికి అవసరమైన నైపుణ్యాలు లేకుండానే భారత్లోని విద్యార్థుల్లో 56 శాతం కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. శిక్షణ లోపం, కళాశాలలో ఉపాధికి సిద్ధం చేయకపోవడం, ఆచరణాత్మక అభ్యసనం లేకపోవడం  వంటి  లోపాల వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని తాజాగా విడుదలైన యూనిసెఫ్‌ ‌సర్వే పేర్కొంది. కేవలం పథకాలు, కార్యక్రమాలు, విధానాల పరంగానే ఉపాధి కల్పన సాధ్యం కాదని ,విద్యా వ్యవస్థ లో సమూల మార్పుల ద్వారానే అది సాధ్యమవుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉంది.గాంధీజీ చెప్పినట్లు వ్యక్తిత్వాన్ని పెంపొందించే విద్య మరియు విలువలను నేర్పించే విద్య ఎతరానికైనా అవసరము. ఇట్టి ప్రయత్నం నూతన విద్యా విధానం ద్వారా వస్తుందని ఆశిద్దాం.

Leave a Reply