ఇంటలిజెంట్ క్యారెక్టర్ రికగ్నిషన్‌తో తప్పుల సవరణ
ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనకు ఇంటలిజెంట్ క్యారెక్టర్ రికగ్నిషన్ విధానాన్ని ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ బోర్డు అమలు చేయనుంది. గత ఏడాది ప్రశ్నా పత్రాల మూల్యాంకనలో తప్పులు దొర్లిన కారణంగా విద్యార్థులు నష్టపోవాల్సి వచ్చింది. దీంతో తక్కువ మార్కులు వచ్చాయన్న ఆవేదనతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనకు ఆప్టికల్ మార్క్ రీడింగ్ (ఓఎంఆర్) విధానాన్ని అధికారులు అనుసరిస్తున్నారు. దీంతో పాటుగా ఇంటలిజెంట్ క్యారెక్టర్ రికగ్నైషన్ విధానంను కూడా ఉపయోగించనున్నారు. గత ఏడాది ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనకు సైతం ఇదే విధానాన్ని అనుసరించారు. అయితే, ఈ విధానంలో ఉన్న లోపాల కారణంగా విద్యార్థులకు రావాల్సిన మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక కళాశాలల్లో అధికారులు ఈ పొరపాట్లు జరిగినట్లు గుర్తించారు. మెమోలో జీరో మార్కులు వచ్చిన విద్యార్థులు రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా వారికి 99 మార్కులు వచ్చాయి. మరి కొందరు విద్యార్థులు ఉత్తీర్ణులైనప్పటికీ ఫెయిల్‌గా చూపించారు.
ఇలాంటి తప్పులు చాలా మంది విద్యార్థుల విషయంలో జరిగాయి. ఇంటర్ బోర్డు ప్రశ్నాపత్రాల మూల్యాంకనలో చేసిన తప్పుల కారణంగా చివరకు రాష్ట్రప్రభుత్వం సైతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి అధికారులు ఇంటర్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనకు ఇంటలిజెంట్ క్యారెక్టర్ రికగ్నైషన్ విధానాన్ని వినియోగించనున్నారు. ఈ విధానంలో విద్యార్థుల మార్కుల అంకెలు, అక్షరాలతో పాటు బార్‌కోడ్‌ను సైతం ఇది క్యాప్చర్ చేస్తుంది. మూడింట్లో ఏమైనా తేడాలుంటే ఐసీఆర్ గుర్తిస్తుంది.దీంతో సంబంధిత అధికారులు దానిని వెంటనే సరిదిద్దే అవకాశం ఉంటుంది. ఓఎంఆర్ విధానం కేవలం అంకెలనే క్యాప్చర్ చేసేలా ఉండేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది పరీక్షలలో రెండు విధానాలను కొనసాగిస్తామనీ, పోయినసారి జరిగిన తప్పులు జరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు. మరోవైపు, ఇంటర్ బోర్డు పరీక్షల మూల్యాంకన బాధ్యతను గత ఏడాది విద్యాశాఖ అధికారులు ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఇంటర్ బోర్డు, ఆ పై స్థాయి విద్యార్థుల ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఆ సంస్థకు ఎలాంటి అనుభవం లేదనీ, అందువల్లనే ఇంటర్ విద్యార్థులకు మార్కుల విషయంలో పొరపాట్లు తలెత్తాయని గుర్తించిన ప్రభుత్వం ఈ సారి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేయాలని బోర్డు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.