Take a fresh look at your lifestyle.

బహుముఖ పాలేరు

రాష్ట్ర రాజధాని కేంద్రంగా జరుగాల్సిన రాజకీయాలు ఇప్పుడు ఖమ్మం ఉమ్మడి జిల్లావైపుగా సాగుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ఇంకా ఎంతలేదన్నా పదినెలల కాలం ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితిలో ఖమ్మం చుట్టూ రాజకీయ పరిభ్రమిస్తున్నాయి.  దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారిస్తుండడంతో ఆ జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఏర్పడిందో, పాలేరు నియోజకవర్గానికి కూడా అంతే ప్రాధాన్యత ఏర్పడింది. రాజకీయాల్లో ఉద్దండులుగా ఉన్న అనేక మంది ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గాన్ని ఎవరు హస్తగతం చేసుకుంటారన్న విషయం చాలా ఆసక్తికరంగా మారింది. ఈ స్థానాన్ని గెలుచుకోవడమన్నది ఆయా పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిందికూడా. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి బిఆర్‌ఎస్‌ ‌శాసనసభ్యుడు కందాల ఉపేందర్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వాస్తవంగా ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థిగా, నాటి టిఆర్‌ఎస్‌ ‌నేటి బిఆర్‌ఎస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్‌రావుపైన గెలిచిన వ్యక్తి. మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయన ఆ తర్వాత కాలంలో బిఆర్‌ఎస్‌ ‌తీర్థం తీసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చాలా ముందే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే  తిరిగి టికెట్‌  ఇస్తున్నట్లు ప్రకటించడంతో మరోసారి ఇదే నియోజకవర్గంనుంచి తనకే అవకాశం వొస్తుందన్న ధీమాతో కందాల ఉన్నారు. 2018 ఎన్నికల్లో గెలిచినప్పటినుండి ఆయన తన నియోజకవర్గంలో మంచి పట్టు సాధించారు.

అంతేకాదు అపర దానకర్ణుడిగా మంచి పేరు తెచ్చుకున్నవ్యక్తి. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, వారి అవసరాలు తీరుస్తున్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి గతంలో గెలిచి మంత్రిగా కొనసాగిన తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా  సౌమ్యుడిగా మంచిపేరుంది.  ఆయన కూడా వొచ్చే ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మరోసారి సిద్ధపడుతున్నాడు. తాను ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న క్రమంలో పాలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చినతీరుకు ప్రజలు తనను ఆదరిస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఆయనకుంది. ఆ క్రమంలోనే పార్టీ పరంగా పెద్ద పదవుల్లో లేకున్నా రానున్న ఎన్నికల్లో కెసిఆర్‌ ‌తనకే టికెట్‌ ఇస్తాడని గంపెడు ఆశపెట్టుకుని ఇంతకాలంగా కొనసాగుతున్నాడు.  కాని, గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటినుండి కెసిఆర్‌ ‌పెద్దగా పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనాడు.  ఆకారణంగానే పార్టీ కార్యక్రమాలకు దూరంపాటిస్తున్న విషయం బహిరంగ రహస్యమే.

ఇటీవల కాలంలో తన నిరసనను కార్యకర్తల ముందు వ్యక్తం చేయడంతో ఆయన పార్టీ మారుతాడన్న అభిప్రాయాలు వ్యక్త మయ్యాయి. తెలుగుదేశం హయాంలో ఆయనకు మంచి గుర్తుంపు ఉన్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ళ కాలంలో తెలుదేశం పార్టీ ఇక్కడ తుడిచిపెట్టుకు పోయింది. కాని, రానున్న ఎన్నికలకు తాము సిద్ధమేనన్నట్లుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన పార్టీ పునరుజ్జీవ  సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేయడం గమనార్హం. పార్టీని పటిష్టపర్చేందుకు చంద్రబాబు చురుగ్గా పావులు కదుపుతున్న నేపథ్యంలో తుమ్మల అటు వైపు మొగ్గే అవకాశాలున్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే టిఆర్‌ఎస్‌ ‌బిఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలను  దేశవ్యాప్తం చేసే దిశగా నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను ఖమ్మంలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషిచేస్తున్నాయి.

ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకే చెందిన సీనియర్‌నేత తుమ్మల నాగేశ్వర్‌రావును అనునయించడంలో ఆ పార్టీ ముఖ్యనేత, మంత్రి హరీష్‌రావు సఫలమైనట్లు తెలుస్తున్నది. అయితే ఈ సయోధ్య ఎంతవరకు కొనసాగుతుందో తెలియదుకాని, పాలేరు పోరు మాత్రం సమసిపోయేదిగా కనిపించడంలేదు. ఎందుకంటే  రానున్న ఎన్నికల్లో మిగతాపార్టీలన్నీ ప్రతిపక్షంగా వ్యవహరించినా వామపక్షాలు మాత్రం బిఆర్‌ఎస్‌ ‌తో కూటమి కట్టేందుకు సిద్ధంగా  ఉన్నట్లు వార్తలు వొస్తున్న క్రమంలో పాలేరు సీటును వారు డిమాండ్‌ ‌చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరూ ఊహిస్తున్నట్లు సిపిఎం, సిపిఐలు బిఆర్‌ఎస్‌తో పొత్తు కుదుర్చుకుంటే పాలేరు సీటును సిపిఎం డిమాండ్‌ ‌చేస్తుందను కుంటున్నారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం తెల్దార్లుపల్లి అదే నియోజక పరిధిలో ఉండడంతో ఆయన తప్పకుండా అక్కడినుండే పోటీకి సిద్ధపడే అవకాశాలున్నాయి.

దీంతో ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్‌రావుకు, సిట్టింగ్‌ ఎమ్మెల్యే  కందాలకు ఈ పొత్తు కొరుకుడు పడని అంశంగా మారనుంది. ముగ్గురు హేమాహేమీలే అయినా ఎవరికి అవకాశం లభిస్తుంది, కెసిఆర్‌ ఆలోచనలో ఎవరున్నారన్నది అంతుపట్టని అంశం. ఇదిలా ఉంటే తానీ నియోజకవర్గంనుండి పోటీ చేస్తున్నానంటూ వైఎస్‌ఆర్‌ ‌తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్‌ ‌షర్మిల ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపి సరిహద్దు ప్రాంతం కావడంతో ఖమ్మం తమకు అనుకూలంగా ఉంటుందని, ఈ నియోజకవర్గాన్ని షర్మిల ఎంచుకుని ఉంటుందన్న అభిప్రాయాలున్నాయి. అంతేగాక 2014లో ఖమ్మంలో వైఎస్‌ఆర్‌ ‌పార్టీ ఒక పార్లమెంటు స్థానాన్ని, మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకోగా, మిగతా నియోజకవర్గాలో గణనీయమైన వోట్లను  సాధించుకోవడంతో ఈ ప్రాంతం తనకు అనుకూలమని షర్మిల ఎంచుకున్నట్లు స్పష్టమవుతున్నది. అంతేగాక పోటీకి అప్పుడే రంగం సిద్ధం  చేసుకుంటోందికూడా. ఖమ్మం నగరాన్ని ఆనుకుని ఉన్న కరుణగిరి వద్ద క్యాంపు కార్యాలయంకోసం స్థలాన్నికూడా కొనుగోలుచేసి, పనులు చేపడుతున్న విషయంకూడా తెలిసిందే. ఇదిలా ఉంటే ఎట్టి పరిస్థితిలో కెసిఆర్‌ను గద్దేదించాలన్న ధ్యేయంగా ముందుకు పోతున్న బిజెపి, తన స్థానాన్ని తిరిగి సాధించుకోవాలని కాంగ్రెస్‌ ‌బలమైన అభ్యర్థిని ఇక్కడ నిలిపేందుకు వెతుకులాట ప్రారంభించాయి. దీంతో ఖమ్మంతోపాటు పాలేరు నియోజకవర్గంకూడా రానున్న ఎన్నికల్లో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకోబోతోంది.

Leave a Reply