Take a fresh look at your lifestyle.

తెలంగాణలో ఒక మైలురాయి ‘బలగం’

: పీఆర్‌ఐస్‌ఐ ‌వెబినార్‌ ‌లో వక్తల ప్రశంస

అస్థిత్వ పోరాటం, బలిదానాల ద్వారా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ‘బలగం’ సినిమా  ఒక గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని  ప్రముఖ దర్శకుడు  బి. నరసింగరావు, మేధావులు, విశ్లేషకులు కొనియాడారు. సెక్స్, ‌హింస, నమ్మశక్యం కాని స్టంట్ల జోలికి పోకుండా తెలంగాణా సంస్కృతీ సంప్రదాయాలు, పల్లెల సౌందర్యాలకు, నిజ జీవితాలకు అద్దం పట్టే ఇతివృత్తంతో మంచి సినిమా ఎలా తీయవచ్చో ఈ సినిమాలు నిరూపించిందని కొనియాడారు. జాతీయ ప్రజా సంబంధాల దినోత్సవాల్లో భాగంగా పబ్లిక్‌ ‌రిలేషన్స్ ‌సొసైటీ ఆఫ్‌ ఇం‌డియా హైదరాబాద్‌ ‌చాప్టర్‌ ఆధ్వర్యంలో   విద్యావేత్త, డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ఓపెన్‌ ‌యూనివర్సిటీ డైరెక్టర్‌ (అకడమిక్‌) ‌ప్రొఫెసర్‌ ‌ఘంటా చక్రపాణి అధ్యక్షతన జరిగిన వెబ్‌నార్‌లో దేశ విదేశాలకు చెందిన పలువులు సినీ విశ్లేషకులు, విమర్శలు, మేధావులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని తమ అభిప్రాయలు వెలిబుచ్చారు.

‘దాసి’, ‘రంగులకల’ వంటి సంచలన చిత్రాలను రూపొందించి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు పొందిన  బి. నరసింగ రావు మాట్లాడుతూ ‘బలగం’ నిస్సందేహంగా తెలంగాణ లో ఒక మైలురాయిలా కలకాలం నిలిచిపోతుందని అన్నారు. ‘‘దర్శకుడు యెల్దండి వేణు తన మొదటి చిత్రంలోనే తెలంగాణ వాస్తవిక జీవితాన్ని చిత్రీకరించేలా గ్రామీణ నేపధ్యంలోని ప్రతి అంశాన్ని నిశితంగా పట్టుకున్నాడు. తెలంగాణ సమాజానికి ఇలాంటి సినిమాలు మరెన్నో కావాలి. అన్ని కూర్పులతో ‘బలగం’ స్థాయిలో మరొక సినిమా రావడం చాలా కష్టమైనదే,’’ అని అయన చెప్పారు. సినిమా ఘన విజయానికి కారణమైన ఇద్దరు వేణుల•ఆచార్య వేణు (సినిమాటోగ్రాఫర్‌) ‌మరియు వేణు యెల్దండి (దర్శకుడు)•అద్భుత పనితీరును అయన అభినందించారు. కథావస్తువు, మాండలికం, వేషధారణ, గ్రామీణ నేపథ్యం అన్నీ సరైన పాళ్ళలో ఇమిడి తెలంగాణతనాన్ని (నేటివిటీని) ఆవిష్కరించడం వల్లనే చిత్రం ఘన విజయం సాధించిందని నరసింగ రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జీవన శైలిని, వాస్తవిక జనజీవితాలను ప్రతిబింబించే ఇలాంటి అనేక చిత్రాలు రావాలని ఆకాంక్షించారు.

సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రొఫెసర్‌ ‌ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మను యథాతథంగా ప్రతిబింబించడంలో  బలగం విజయం సాధించిం దన్నారు.  సినిమా విజయంలో గీత రచయితలు, గాయకుల పాత్ర ఎంతో ఉందని అన్నారు. నరసింగ రావును ‘తెలుగు సినిమా పితామహుడి’గా అభివర్ణిస్తూ, బలగంపై వెబినార్‌ ‌లో ఆయన చేసిన విమర్శనాత్మక పరిశీలన మరియు విద్యాపరమైన వివరణ దర్శకులు, చిత్రనిర్మాతలకు దిక్సూచిగా నిలుస్తాయని చెప్పారు. జాతీయ ప్రజా సంబంధాల వేడుకల్లో భాగంగా, మానవ సంబంధాలు కేంద్రంగా ఉన్న బలగం చిత్రంపై చొరవ చూపి ఒక వెబ్‌నార్‌ను నిర్వహించడం పట్ల పీఆర్‌ఎస్‌ఐ ‌హైదరాబాద్‌ ‌చాప్టర్‌ ‌నాయకత్వాన్ని వక్తలు అభినందించారు.

రచయిత, ఎడిటర్‌ ‌డాక్టర్‌ ‌కె.శ్రీనివాస్‌ ‌మాట్లాడుతూ, బలగం భావోద్వేగ పరంగా ప్రజల హృదయాలను తాకిందని, మానవ సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఈ తరుణంలో ఈ చిత్రం కుటుంబ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చక్కగా చిత్రీకరించిందని చెప్పారు. మృగ్యమైపోతున్న ఆరోగ్యకరమైన మానవ సంబంధాల ఆవశ్యకత గురించి వీక్షకులు ఆలోచించేలా చేసిన సినిమా బలగమని అన్నారు. ‘‘విభిన్న వాస్తవిక అంశాలను వేణు ప్రామాణీకరించి, ఇతివృత్తాన్ని అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో చక్కగా చిత్రీకరించారు,’’ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయం మరియు నీటి నిర్వహణపై అంతర్జాతీయ నిపుణుడు డాక్టర్‌ ‌భిక్షం గుజ్జ స్విట్జర్లాండ్‌ ‌నుంచి వెబ్‌నార్‌లో పాల్గొని  మాట్లాడుతూ, బలగంలో పాత్రలు మనవే కదా అని ప్రతి ఒక్కరూ అనుకునేట్లు చేయడంలో రచయిత, దర్శకుడు వేణు ఘన విజయం సాధించాడని అన్నారు. ‘‘మనందరికీ తెలిసిన సర్వసాధారణ విషయాలనే దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించాడు. సినిమా నిర్మాణం ఒక పెద్ద మేథోపరమైన కసరత్తన్న భావనను పటాపంచలు చేశాడు. క్లైమాక్స్ ‌జానపద గీతం అందరినీ కదిలించింది,’’ అని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ చిత్రరంగంలో వచ్చిన గుణాత్మక పరివర్తనకు బలగం నిలువెత్తు నిదర్శనమని మహిళా ఉద్యమకారిణి కవిత పులి విశ్లేషించారు. ‘‘రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషను, కట్టుబాట్లను తక్కువ చేసి చూపేవారు. ఇవి హేళనకు  గురయ్యాయి. కానీ, బలగం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ భాష మరియు సంస్కృతికి విపరీతమైన ఖ్యాతిని దక్కేట్లు చేసింది.  సమాజంలో మహిళల పాత్రను ప్రతిబింబిస్తూనే తెలంగాణ బహుజనుల జీవిత సారాంశాన్ని ఇది సంగ్రహించింది,’’ అని అన్నారామె.

వియన్నా (ఆస్ట్రియా) లోని యునైటెడ్‌ ‌నేషన్స్ ఇం‌డస్ట్రియల్‌ ‌డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (‌ఖచీ×ణ•) కమ్యూనికేషన్‌ ‌నిపుణుడు ఎం.జయరాజ్‌ ‌మాట్లాడుతూ- కొంత మెలోడ్రామా ఉన్నప్పటికీ బలగం నిజమైన తెలంగాణ హృదయాన్ని ఒడిసి పట్టిందని అన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్థిరపడిన అనేక మూస ధోరణులను బలగం విజయవంతంగా బద్దలుచేసిందని వెబ్‌నార్‌ ‌నిర్వాహకుడు, పీఆర్‌ఎస్‌ఐ ‌హైదరాబాద్‌ ‌చాప్టర్‌ ‌చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌రాము సూరవజ్జుల అన్నారు. ‘‘వివిధ కారణాల వల్ల మానవ సంబంధాలు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. చిన్న మాట పట్టింపులు వల్ల వ్యక్తుల మధ్య అహం, అపార్థం పెరిగి కుటుంబాల్లో సామరస్యం దెబ్బ తింటోంది. ఈ నేపథ్యంలో బలగంపై బలమైన చర్చ అవసరమని భావించాం,’’ అని అయన విశదీకరించారు. పిఆర్‌ఎస్‌ఐ ‌జాతీయ సెక్రటరీ జనరల్‌ ‌శ్రీ. వై.బాబ్జీ, హైదరాబాద్‌ ‌చాప్టర్‌ ‌సెక్రటరీ .కె.యాదగిరి,  రచయిత్రి కె. విమలతోపాటు పలువురు సినీ ప్రముఖులు, సినీ విమర్శకులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, పీఆర్‌ఎస్‌ఐ ‌సభ్యులు రెండున్నర గంటల సుదీర్ఘ వెబ్‌నార్‌లో పాల్గొన్నారు. పీఆర్‌ఎస్‌ఐ ‌హైదరాబాద్‌ ‌చాప్టర్‌ ‌మాజీ చైర్మన్‌, ‌తెలంగాణ సారస్వత పరిషత్‌ ‌కార్యదర్శి డాక్టర్‌ ‌జుర్రు చెన్నయ్య వందన సమర్పణ చేశారు.

Leave a Reply