- దుకాణాల ముందు బియ్యం కోసం లబ్దిదారుల క్యూ
- సామాజిక దూరంపై లేని శ్రద్ధ
- కొరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారుల ఆందోళన
రాష్ట్రంలో కొరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన ఉచిత బియ్యం పంపిణీ అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి కుటుంబంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నది. ఎప్పటి మాదిరిగానే ఈ బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నది. అయితే, ప్రభుత్వం బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని ప్రకటించడం, అదీ కుటుంబంలో ఒక్కో సభ్యునికి 12 కిలోలు ఇస్తుండటంతో ప్రజలు గుంపులుగుంపులుగా రేషన్ షాపుల వద్దకు వస్తున్నారు. రేషన్ తమకు అందుతుందో లేదో అనే ఆందోళనతో తమకంటే తమకే ముందుగా ఇవ్వాలని దుకాణాదారుపై వొత్తిడి తెస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల రేషన్ షాపుల వద్ద తొక్కిసలాట సైతం జరుగుతోంది. ఉచితంగా బియ్యం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సమయంలోనే రేషన్ షాపుల వద్ద ఎలాంటి తొక్కిసలాట లేకుండా చూసే బాధ్యత స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులే వహించాలని స్పష్టం చేశారు. దీనికి తోడు బియ్యం తీసుకోవడానికి రేషన్ షాపుకు వచ్చే లబ్దిదారులు సామాజిక వ్యత్యాసం పాటించాలని కోరారు.రేషన్ షాపుకు వచ్చే ప్రతీ వ్యక్తీ మూడు మీటర్ల సామాజిక వ్యత్మాసం పాటించేలా ముగ్గుతో వృత్తాలు గీస్తున్నప్పటికీ కొందరు అతిక్రమించి ముందుకు వస్తున్నారు.
ఈ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా చోట్ల లబ్దిదారులు సామాజిక వ్యత్యాసం నిబంధనను పాటించకపోవడంతో కొరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని రేషన్ షాపులలో బియ్యం పంపిణీ చేసే సమయంలో నిర్వాహకులు చేతులకు గ్లౌజులు వేసుకోకుండా పంపిణీ చేస్తుండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. రోజుకు కేవలం వంద కూపన్లు మాత్రమే ఇస్తున్నామనీ, కూపన్లలో ఉన్న తేదీ ఆధారంగా మాత్రమే లబ్దిదారులు బియ్యం తీసుకోవడానికి రావాలని దుకాణాదారులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ అంతగా ఫలితం ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా, ఉచిత రేషన్ బియ్యం పంపిణీ ఈ నెల పూర్తిగా కొనసాగుతుందనీ, లబ్దిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ప్రతీ నెలా రేషన్ బియ్యాన్ని ఐదో తేదీ నుంచి పదిహేను వరకే పంపిణీ చేస్తారు. కానీ, ప్రస్తుత సమయంలో ఆ నిబంధన అమలులో ఉండదనీ, ఎప్పుడైనా తీసుకోవచ్చని పేర్కొంటున్నారు.
ప్రతీ లబ్దిదారునికీ బియ్యం అందజేస్తాం : మంత్రి సబిత
రేషన్ దుకాణాల వద్ద లబ్దిదారులు సామాజిక వ్యత్యాసం పాటించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతీ లబ్దిదారునికీ బియ్యం అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలో బియ్యం పంపిణీకి ఎలాంటి కొరతా లేదనీ, చివరి లబ్దిదారుని వరకూ అదించే వరకూ ఈ పంపిణీ కొనసాగుతుందని ఆందువల్ల ప్రజలు సామాజిక వ్యత్యాసం పాటించి కొరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.