ఓ టీచర్, తహసిల్దార్‌ల మృతి
హనుమకొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: వేర్వేరు ఘటనల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తహసీల్దార్ గుండెపోటుతో మృతి చెందారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు హనుమకొండ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, తహసీల్దార్ మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని నర్సక్కపల్లి గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న తౌటం సదానందం(53) బుధవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని తన నివాసంలో రాత్రి సదానందం వాంతులు చేసుకున్నాడు. దీంతో మెడిసిన్స్ కోసమని మెడికల్ షాపునకు వెళ్లగా.. అక్కడే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. అనంతరం సదానందం మృతదేహాన్ని.. ఆయన స్వగ్రామమైన కమలాపురానికి తరలించారు. సదానందం మృతదేహానికి తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
సదానందంకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం తహసీల్దార్ ఎండీ ఫరీదుద్దీన్ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఈ నెల 19న ఆర్డీవో కొమురయ్యతో కలిసి రైల్వే 3వ లైన్ నిర్మాణ పనుల కోసం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్న ఇఫ్తార్ విందులో పాల్గొని కేసముద్రంలోని ఇంటికి వెళ్తుండగా ఛాతిలో నొప్పి వస్తుందని సిబ్బందికి తెలుపగా ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మృతదేహాన్ని హనుమకొండలోని ఆయన స్వగృహానికి రాత్రి తరలించారు. తహసీల్దార్ హఠాన్మరణంతో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, కలెక్టర్ శశాంక సంతాపం తెలిపారు.