Take a fresh look at your lifestyle.

విద్యారంగం పై పెరుగుతున్న కాషాయ దాడి

వారి వాదనలో నిజమెంత!?
వారు పేర్కొంటున్నట్టుగా కొరోనా సంక్షోభ పరిస్థితులు ఇప్పుడు ఇంకా కొనసాగుతుందని చెప్పలేము. ఉపశమనం లభించి ఈ విద్యా సంవత్సరం అన్ని స్థాయిల్లో పూర్తి సిలబస్ చెప్పటం, మూల్యాంకనం పూర్తి అయింది. ఇప్పుడు ఇంకా కొరోనా సాకు చెప్పటం అర్ధరహితం అనాలి. పాఠ్యపుస్తకాల సంసిద్ధత మిగతా సబ్జెక్ట్ ల వలే ఏ అంశానికి ఆ అంశం వేర్వేరుగా ఇవ్వటం సాంఘిక శాస్త్రాల్లో కుదరదు. భారతదేశంలోని సమాజాలు వాటి వైవిధ్యాలు, వాటి విస్తృతిలో ఒక క్రమానుగత శైలికి లోబడి రూపొందించబడ్డాయి.గతం,వర్తమానాల అధ్యయనం భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కునే అనేక అంశాలు సంక్షిప్తం చేయబడి ఉంటాయి. అయితే హఠాత్తుగా సిలబస్ లో మార్పులు చేయటం రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేసినంత సులువు కాదు. ఆయా సంబంధిత విషయాలను కూర్చిన విషయనిపుణులు,మేధోవర్గ ప్రతినిధులు,ఆచార్యుల సమ్మతి ,సంప్రదింపులు లేకుండా హఠాత్తుగా ఈ సిలబస్ తొలగింపులు, మార్పులు ఏ వర్గ ప్రయోజనాల కోసం చేయబడ్డాయనేది బహిర్గతం కావాలి. తొలగించిన అధ్యాయాలు ప్రస్తుత పాలకులు భావజాలానికి భిన్నంగా వుండటంతో ఈ తొలగింపుల వెనుక వున్న కారణాలు ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశాలు లోబడి చేసినవే అనేది స్పష్టం అవుతుంది.
మొఘల్ సామ్రాజ్యం ఎందుకు చదవాలి!?
   తైమూర్ వారసులుగా చెప్పుకున్న బాబర్ చక్రవర్తి కాలం నుండి ఔరంగజేబు కాలం వరకు దాదాపు 180 సంవత్సరాల సుదీర్ఘ కాలం లో భారతదేశం లోని మృతి,రాజకీయ, సామాజిక పరిస్థితులను పరిశీలిస్తే (ఔరంగజేబు మినహా మిగతా కాలమంతా) భారతదేశం సుఖశాంతులతో విరాజిల్లింది. షాజహాన్ పరిపాలనా కాలం స్వర్ణయుగంగా పేరుపొందింది. ప్రధానంగా పాలకులు ముస్లింలు, పాలితులు ముస్లిమేతరులు అయినప్పటికీ ప్రజల మత స్వేచ్ఛ,జీవన విధానాలకు ఎలాంటి విఘాతం కలుగలేదు. జన్మంతా భారతీయుల్ని అక్బర్,షాజహాన్ చక్రవర్తుల కాలంలో నలభై లక్షల కిలో మీటర్ల పరిధిలో విస్తరించిన సువిశాల సామ్రాజ్యానికి శత్రువుల బెడద లేదు. ఉదార స్వభావుడైన అక్బర్ జన్మతః భారతీయునిగా స్థానిక సంస్కృతి రీతులతో వల్లమాలిన అనుబంధం, అభిమానం కలిగి ఉన్నాడు. అక్బర్ పాలనలో మొఘల్ ప్రభుత్వం జిజియా పన్ను (ముస్లిమేతర మతస్థులపై విధించే పన్ను) ను అంతం చేసింది. ముస్లింల సాంప్రదాయక చాంద్రమాన కాలగణ నను విడిచి వ్యవసాయ పనులలో సౌలభ్యము కొరకు సూర్యమాన కాలగణనను అవలభించారు. మత విషయాలలో అక్బర్ యొక్క అసాధరణ ఆలోచనాసరళికి రూపకల్పనే ఈయన స్థాపించిన దీన్-ఎ-ఇలాహీ (దేవుని మతం). దీన్-ఎ-ఇలాహీ హిందూ, సూఫీ,ఇస్లాం,నాటిఅనేక మతాల సంగ్రహం. అక్బర్ తను జీవించి ఉన్నంతవరకు దీన్-ఎ-ఇలాహీని అధికారిక మతంగా ప్రకటించాడు. అయితే ఈయన చర్యలను సాంప్రదాయకమైన ఇస్లాం ముల్లాలు తీవ్రంగా నిరసించారు.  అక్బరు యొక్క పర మత సహనము, ప్రజలు పూజించే విధానల పట్ల సహనాన్ని పాటించటం,మహమ్మదీయేతరులపై  జిజియాపన్ను రద్దు, ఇతర మత విశ్వాసాలపట్ల ఆసక్తి ఆతని పరమత గౌరవానికి ప్రతీకలు.ఇవే అతని ఎదుటి వర్గమైన ఛాందస మహమ్మదీయులు మహమ్మదీయ మతాన్ని తృణీకరించడంతోసమానముగా భావించారు.అందుకే మొఘల్ చక్రవర్తి, అక్బర్ ఆనాటి పరిస్థితులలో సహనశీలిగా చిరస్మరణీయుడు. .
పరమతం సహనంలో మొఘల్స్ ఘనత
      భోపాల్ లోని ప్రభుత్వ గ్రంథాలయములో దొరికిన పత్రాల ప్రకారం మొఘల్ రాజ్యం స్థాపకుడైన బాబరు చక్రవర్తి హుమాయూన్ కు రాసాడనే ఈ క్రింది వీలునామా నాటి వారి మత సామరస్యానికి, ప్రజారంజక పాలన కు నిలువుటద్దం గా నిలుస్తుంది
‘నా ప్రియ కుమారునికి, ఈ క్రింది విషయాలు గుర్తుంచుకోదగినవి:
        “నీ మనస్సు లో మతవిద్వేషాలను ఉంచుకోవద్దు. న్యాయం చెప్పేటప్పుడు, ప్రజల సున్నితమైన మత విశ్వాసాలను, హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. గోవధను తప్పిస్తే స్థానికుల మనసులలో స్థానం సంపాదించవచ్చు. ఇవి నిన్ను ప్రజలకు దగ్గరగా తీసుకు వెళ్తాయి.ప్రజల ప్రార్ధనాలయాలను ఏ మతానికి చెందినవైనా ధ్వంసం చేయవద్దు. దేశ శాంతి కోసం పూర్తి సమాన న్యాయం అమలు చేయగలవు. ఇస్లాంను ప్రచారంచేయటానికి , ఇతర మతాలను అన్యాయంతో, కౄరంగా అణచివేయటం అనే కత్తుల కన్నా, ప్రేమా,ఆప్యాయత అనే కత్తుల ఉపయోగము ఎంతో గొప్పది. షియాలకు సున్నీలకు మధ్య విభేదాలను తొలగించు. ఋతువుల గుణగణాలను చూచినట్లే, నీ ప్రజల గుణగణాలను చూడు.’
 
        షాజహాన్ కాలం వరకూ సుఖశాంతులతో వున్న భారతదేశం చివరి పాలకుడైన ఔరంగజేబు కాలంలో అస్థిరత,యుద్ధాలు, అశాంతి, ముస్లీం మత పాలనతో కొనసాగింది. అనేక హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడు.మొఘల్ చక్రవర్తులలో చివరివాడు అని ఔరంగజేబు తన తాతలు, తండ్రి పాలనకు భిన్నంగా 49 సంవత్సరాల పాటు భారతీయ చక్రవర్తిగా కాకుండా ఒక ముస్లీం చక్రవర్తిగా పేరుతెచ్చుకున్నారు.ఔరంగజేబు తన భూభాగాన్ని కాశ్మీర్ (ఉత్తరంలో) నుండి జింజి (దక్షిణాన), మరియు హిందూకుష్ (పశ్చిమ) నుండి చిట్టగాంగ్ (తూర్పున) వరకు విస్తరించాడు.ఆర్ధికంగా బలమైన దేశంగా సుస్థిర పరచినప్పటికినీ వివాదాస్పదుడిగా పేరుపొందాడు బాబర్ నిర్మింపచేసిన చార్ బాగ్ ,ప్రస్తుతం ఆగ్రాలో ఉన్న రామ్ బాగ్ మొట్టమొదటి చార్ బాగ్ అని కొందరి అభిప్రాయం. వీరి హయాంలో నిర్మించబడిన అనేక ఉద్యానవనాలు భారత్, పాకిస్థాన్,బంగ్లాదేశ్ లలో ఎన్నో మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. యూరప్ కు చెందిన పర్యాటకులు భారత్ గురించి రాసిన “ది ఎకౌంట్స్ ఆఫ్ ఇండియా” వంటి పుస్తకాల్లోనూ ఈ తోటల గురించి ఉంది. కాన్స్ టెన్స్ విల్లియర్స్-స్టార్ట్ రాసిన గార్డెన్స్ ఆఫ్ ది గ్రేట్ మొఘల్స్(1913) మొఘల్ గార్డెన్స్ పై ప్రస్తుత పరిశోధనా విషయాలు డంబర్టన్ ఓక్స్, స్మిత్ సనియన్ ఇన్స్టిట్యూషన్ ల ఆధ్వర్యంలో బయటకు వచ్చాయి. షాలిమర్ గార్డెన్స్(లాహోర్), ఢాకాలోని లాల్ బాగ్ కోట, శ్రీనగర్ లోని షాలిమర్ గార్డెన్స్ వంటి పలుతోటలు మొఘల్ గార్డెన్స్ కావడం  విశేషం.రాష్టపతి భవన్ లో గల మొఘల్ గార్డెన్ అమృత్ ఉద్యాన్ గా, డిల్లీ లోని ప్రధాన ఔరంగజేబు రోడ్ అబ్దుల్ కలాం పేరుగా మార్చబడింది చివరికి “మొఘల్ పరాట” కూడా పేరు మారింది. ముంతాజ్ మరణానికి బాధతో ఆగ్రాలో షాజహాన్ నిర్మింపచేసిన తాజ్ మహల్ పేరు మార్చుకుంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం లేదు.
1526లో  ఒకటవ పానిపట్టు యుద్ధంలో ఇబ్రాహీమ్ లోడీను ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించినతైమూరు వంశానికి చెందిన బాబరు నుండి ఔరంగజేబు వరకు గల 180 సంవత్సరాల భారతదేశ చరిత్ర ను నేటి తరం అధ్యయనం చేయకుండా చరిత్రను మటుమాయం చేయటం రేపటి తరానికి నష్టం చేయటం కాదా! గోద్రా అల్లర్లు, నాటి హింసాకాండ పై వాస్తవాలకు సమాధి చేసే ప్రయత్నాలు విఫలమైన నేపధ్యంలో ఆ అంశాలు ,గాంధీ హత్య కు సంబంధించిన పాఠ్యాంశాలు,ప్రజాపోరాటాలు, ఉద్యమాలు వంటి పలు అంశాలు తొలగింపు ప్రయత్నాలు ఏ భావజాలానికి చేరువగా వున్నాయో అర్ధం చేసుకోవటం కష్టమైన పని కాదు. భావి భారతాన్ని భావవాదం వైపు నడిపించే వారీగా తయారు చేయడం,
వారిలో శాస్త్రీయ భావజలాన్ని కొనసాగించకుంటే..ప్రపంచయవనిక పై భారత్ భవిష్యత్ ఏమిటో పంపేది ఆందోళనకరమైన అంశంగా భావించాలి.భారతదేశ చరిత్రలో వాస్తవాలకు మసిబూసి, సంఘ్ పరివారం మూలాలున్న  ఎన్.సి.ఇ.ఆర్.టి. పెద్దలు విద్యార్థుల మెదళ్ళలో నింపబోయే విష కాషాయీకరణలకు  వ్యతిరేకంగా ఉద్యమించటం ప్రజలందరి బాధ్యత. ఎందుకంటే ప్రజలే చరిత్ర నిర్మాతలు కాబట్టి.
-అజయ్
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్

Leave a Reply