- రాజ్‌ఘాట్ వద్ద నివాళులు
- బాపూఘాట్ వద్ద గవర్నర్, మంత్రుల నివాళి
న్యూదిల్లీ, జనవరి 30 : అమరవీరుల దినోత్సవం సందర్భంగా మహాత్మాగాంధీకి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. జాతి సేవలో భాగంగా తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీరులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ రోజు గాంధీజీ వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దేశం కోసం అమరులైన వారందరికీ కూడా తాను నివాళులర్పిస్తున్నానని చెప్పారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం పని చేయాలనే తమ సంకల్పాన్ని బలోపేతం చేస్తూనే ఉంటాయని ట్వీట్ లో పేర్కొన్నారు. స్వదేశీ, స్వావలంబన మార్గాన్ని అనుసరించి దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి మనల్ని ప్రేరేపించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు మిలియన్ల నమస్కారాలు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. స్వాతంత్య్ర స్వర్ణయుగంలో స్వచ్ఛత, స్వదేశీ, స్వభాష ఆలోచనలను అవలంబించడమే గాంధీజీకి నిజమైన నివాళి అని కొనియాడారు.
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా జాతి ఆయనకు ఘనంగా నివాళి అర్పించింది. జాతిపిత వర్ధంతి వేడుకలు దేశవ్యాప్తంగా భక్తి శ్రద్దలతో జరిగాయి. ఆయన సమాధి రాజ్‌ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తెలంగాణలోనూ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపుఘాట్ వద్ద గాంధీ విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాలులర్పించారు. నగరంలోని బాపు ఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మహాత్ముడి విగ్రహాం వద్ద గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో హోంమంత్రి మహ్మూద్ అలీ, కాంగ్రెస్ అగ్రనేత విహెచ్ తదితరులు ఉన్నారు. శాసనభ ఆవరణలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్ నివాళి అర్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు కూడా నివాళి అర్పించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వీరంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జాతిపిత మహత్మాగాంధీ దేశానికి స్వాతంత్య్ర తెచ్చి పెట్టడమే కాకుండా.. ప్రపంచానికే శాంతిదూతగా నిలిచారని తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.