హైదరాబాద్కు బంగారు భవిష్యత్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు బంగారు భవిష్యత్ ఉందని, ప్రపంచ స్థాయి సంస్థలు తమ పెట్టుబడులను ఇక్కడే పెట్టడానికి ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణ పరిధిలో ఏపిఆర్ హోమ్స్ నూతన ప్రాజెక్టు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రస్తుత కొరోనా సమయంలో రియాల్ ఎస్టేట్ రంగం పడిపోతుందనుకున్న దశలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రావడం సంతోషకరంగా ఉందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఉన్నప్పటికీ తెలంగాణలో ఆ ప్రభావం లేదన్నారు. మధ్యతరగతి ప్రజానీకానికి నాణ్యతతో కూడిన ఇండ్లు నిర్మించి, ఇవ్వాలని ఆయన కోరారు. అనంతరం ఏపీ ఆర్ ప్రాజెక్ట్ నూతన బ్రోచర్ ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి.పాటిల్, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, ఏపిఆర్ హోమ్స్ ప్రతినిధులు కృష్ణారెడ్డి, సంజీవరెడ్డి, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.