Take a fresh look at your lifestyle.

ఎనలేని సేవలందించిన మహామనిషి

అబ్దుల్‌ ‌కలామ్‌కు అందరి సలామ్‌
‌లేదా కలామ్‌ ‌సారూ … మీకు సలామ్‌
‌లేదా భారత రత్నం మన కలామ్‌
‌లేదా భరత జాతి మరువని మిస్సెల్‌ ‌తాత
లేదా విజ్ఞాన గని …. విలక్షణ శైలి
లేదా ఆ మిస్సైళ్లు అజరామరం
లేదా కలికితురాయి.. అబ్దుల్‌ ‌కలామ్‌

‘‘ అన్ని పక్షులు వర్షాకాలంలో ఆశ్రయం కొరకు వెతకుతాయి. కానీ గ్రద్ధ మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుంచి తప్పించుకుంటుంది సమస్యలనేవి సాధారణం కాబట్టి మన వైఖరిలో వ్యత్యాసాన్ని చూపాలి ’’

అబ్దుల్‌ ‌కలామ్‌… అం‌దరికీ సుపరిచితమైన వ్యక్తిత్వం. మన భారత రత్నం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో, పరిశోధనల్లో కలికితురాయి. దేశ అత్యున్నత పదవిలో రాష్ట్రపతిగా ఎనలేని సేవలందించిన మహామనిషి. మనలను అందరినీ వదలి కడతేరిన కలామ్‌ ‌సార్‌ను స్మరించుకోవటం మన విధి. 2015వ సంవత్సరం జులై 27న అస్తమించారాయన. సరిగ్గా అయిదేళ్ళ కిందట దివికేగిన ఆయన జ్ఞాపకాలు ఎన్నటికీ చెరిగిపోవు. చరిత్రలో విజ్ఞాన గనిగా నిలిచిన కలామ్‌కు భారత జాతి నివాళులర్పిస్తోంది. దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తుల్లో అబ్దుల్‌ ‌కలాం ఒకరు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. సామాన్య కుటుంబంలో జన్మించి రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన అత్యున్నత పదవిలోనూ నిరాడంబర జీవితాన్ని గడిపారు. 11వ రాష్ట్రపతి అయిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ ‌కలామ్‌ ‌పూర్తి పేరు డాక్టర్‌ అవుల్‌ ‌పకీర్‌ ‌జైనులబ్దీన్‌ అబ్దుల్‌ ‌కలామ్‌. ‌తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం – రామనాధపురం జిల్లా ధనుష్కోటిలో అక్టోబరు 15, 1931న ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించారు. తండ్రి జైనులబ్దీన్‌ ‌పడవ నడిపే యజమాని కాగా తల్లి ఆశ అమ్మ గృహిణి. కుటుంబ అవసరాల కోసం… పేద కుటుంబం కావటంతో చిన్నప్పుడే చిన్న చిన్న పనులు చేయటం ప్రారంభించారు.‘‘ కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి, నిన్ను నీవు నిరూపించకోవడానికి వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి.. నిన్ను సాధించడం కష్టమని ’’

విలక్షణ శైలి… వినూత్న పధ గమనం:
కలామ్‌… ‌శాకాహారి.. మద్యపాన వ్యతిరేకి. బ్రహ్మచారి. వ్యక్తిగత క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ప్రజలు తమ భార్యా పిల్లలకు, తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టడం కోసమే అవినీతి పరులౌతారంటూ ఆయన చెప్పేవారు. ఇస్లాం ప్రకారమైతే ప్రతి ముస్లిమూ పెళ్లి చేసుకోవాలి. అయితే ముస్లిం అయిన కలామ్‌ ‌పెళ్లి చేసుకోకపోవడం నిజంగా ప్రశంసనీయమే. ఖుర్‌ఆన్‌తో పాటు భగవద్గీతను కూడా చదువుతారు. మత ఘర్షణలను నిరసిస్తూ శాంతి కాముకుడుగా పేరొందారు. గొప్ప మానవతావాదిగా నిలిచారు. స్నానం చేసి రాకపోతే తమ మాస్టారు ట్యూషన్‌ ‌చెప్పరనే కారణంగా వేకువనే స్నానం చేసి ట్యూషన్‌కు వెళ్లటం ఆయన శ్రద్ధాసక్తులకు గీటురాయి. ట్యూషన్‌ ‌నుంచి వచ్చేసరికి తండ్రి… కలామ్‌ను నమాజ్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యేవారు. నమాజ్‌ ‌పూర్తయ్యాక మద్రాస్‌ ‌రైల్వేస్టేషన్‌ ‌కెళ్లి దినపత్రికల పార్శిళ్ళను తీసుకొని పంపిణీ చేసేవారు.
సగటు విద్యార్థిగానే చదివిన స్కూల్లో గుర్తింపు పొందారు. రామనాధపురం పాఠశాలలో ప్రాథమిక విద్య అనంతరం 1954లో తమ తిరుచిరాపల్లిలో జోసెఫ్స్ ‌కళాశాలలో భౌతికశాస్త్ర పట్టాను అందుకున్నారు. 1955లో మద్రాసులో ఏరోనాటిక్స్ ఇం‌జనీరింగ్‌ ‌విద్యను అభ్యసించారు. అప్పుడే ఖర్చుల కోసం కలాం అక్క బంగారు గాజులు అమ్మి డబ్బులివ్వడం పేర్కొనదగినది. అలాంటి స్థితి నుంచి స్వయం కృషితో తరువాతి కాలంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు. 1960లో ఇంజనీరింగ్‌ ‌డిగ్రీ పొందాక రక్షణ సంస్థ డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరారు. భారత సైన్యం కోసం ఒక చిన్న హెలికాప్టర్‌ ‌తయారు చేయటం ద్వారా తన వృత్తికి శ్రీకారం చుట్టారు. 1962లో అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు మారారు. 1969లో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహప్రయోగ వాహనం (ఎస్‌ఎల్‌వి-3) ప్రయోగ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇదే స్పూర్తితో 1980లో రోహిణి ఉపగ్రహ ప్రయోగంలో కృతకృత్యులయ్యారు. 1992 జులైలో భారత రక్షణ మంత్రికి సాంకేతిక సలహాదారుగా నియమితులు గావడం గొప్ప విశేషమే. ‘‘ బృంద నాయకత్వం వహించే వారిలో తరచూ రెండు రకాల ధోరణులు కానవస్తాయి. కొందరికి పని ముఖ్యం. కొందరికి పని కన్నా తమ సహచరులు ముఖ్యం. చాలామంది ఈ రెండు దృక్ఫధాల మధ్యలో ఎక్కడో చోట ఉంటారు ’’

పోఖ్రాన్‌… ‌కలికితురాయి
కలాం కృషి ఫలితంగానే 1998లో పోఖ్రాన్‌ అణు పరీక్షలు విజయవంతంగా జరిగాయి. ఈ అణుపరీక్షలు భారతదేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన చేర్చాయి. ఈ ప్రక్రియలో కలాం రాజకీయ, సాంకేతిక పాత్రను నిర్వహించడం గొప్ప ముందడుగే. అణుపరీక్షల సమయంలో అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా ఆయన ప్రజల్లో ప్రాముఖ్యం పొందారు. 1998లో కార్డియాలజిస్ట్ ‌డాక్టర్‌ ‌సోమరాజుతో కలిసి కలాం తక్కువ ధర ఉండే స్టెంట్‌ను అభివృద్ధి చేయడం మరో ప్రశంసనీయ పరిణామంగా చెప్పుకోవచ్చు. 2012లో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ కోసం టాబ్లెట్‌ ‌పీసీని రూపొందించడంలో ఆయన కృషి గణనీయమైనదే. తన సుదీర్ఘకాలం శ్రమించి, కృషి చేసి, అభివృద్ధి చేసిన అణ్వాయుధ కార్యక్రమం.. ప్రపంచ ప్రబల శక్తిగా భారతదేశాన్ని సుస్థిరం చేసే సాధనాల్లో ఒకటిగా ఉండాలని అభిలషించే వారాయన. యువతను వెన్ను తట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో పాఠకుల్ని ఉత్తేజితుల్ని చేసే తన ఆత్మకథ వింగ్స్ ఆఫ్‌ ‌ఫైర్‌ ‌లాంటి బోలెడన్ని పుస్తకాలను రాశారు.

పురస్కారాల పుట్ట – ప్రతిభకు నిదర్శనం
భారతదేశపు మూడు అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్‌ (1981‌లో) పద్మ విభూషణ్‌ (1990‌లో), భారతరత్న (1997లో) అవార్డులు కలాం సొంతమయ్యాయి. వీటికి తోడు 40 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు లభించాయి. జులై 18, 2002న బ్రహ్మాండమైన ఆధిక్యతతో 90%కు పైగా ఓట్లతో 11వ భారత రాష్ట్రపతిగా విజయకేతనం ఎగురవేశారు. కలాం సూక్తులను ఈ సందర్భంగా కొన్నింటిని నెమరువేసుకుందాం… మన జననం ఓ సాధారణమైనదే కావచ్చు. కానీ మన మరణం మాత్రం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. మనఃస్ఫూర్తిగా పనిచేయని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండడానికి సిద్ధపడాలి. మనం కేవలం విజయాలతో పైకి రాలేము. అపజయాలతో కూడా ఎదగడం నేర్చుకోవాలి. నీకో లక్ష్య ముండటమే కాదు. దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహనైపుణ్యం ఉండాలి. ఒక నాయకుడు తన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోగలిగినప్పుడే తన బృందాన్ని స్వేచ్ఛగా నడిపించగలడు. సైన్స్ ‌తలుపులెప్పుడూ తెరిచే ఉంటాయి. సాంకేతికాభివృద్ధిలో పొరపాట్లనేవి తప్పనిసరి. అవి రోజూ జరుగుతూనే ఉంటాయి విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది. కానీ అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం. మంచి ఉద్దేశాలు కలవారు ప్రమాణాలు చేస్తారు. మంచి వ్యక్తిత్వం కలవారు మాత్రమే నిలబెట్టుకుంటారు.భారతమాత ముద్దుబిడ్డ, మహనీయుడు అబ్దుల్‌ ‌కలాం తన 84వ ఏట జులై 27, 2015న హఠాన్మరణానికి గురయ్యారు. షిల్లాంగ్‌లో విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఆయన… హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయి అస్తమించడం ఓ విషాదం. ప్రపంచ చరిత్రలో ఆయన అజరామరం. భారతీయుల గుండెల్లో ఆయన మిస్సైల్‌ ‌తాతే. ఆయన తీపి గురుతులకు సేవలకు సలామ్‌!!
(ఈనెల 27న మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ ‌కలాం వర్ధంతి సందర్భంగా)
– చెన్నుపాటి రామారావు
9959021483

Leave a Reply