Take a fresh look at your lifestyle.

కుంటుబడుతున్న వ్యవసాయ రంగం

‘‘‌భారత దేశంలో ఇంకా వ్యవసాయంలో ప్రాచీన పద్దతులు మానలేదు. మన దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.చైనాలో సేద్యపు భూమి తక్కువ. దిగుబడులు మాత్రం అధికం.భారత దేశంలో వ్యవసాయం భూగర్భ జలాలు,వర్షం ప్రకృతి మీద ఆధారపడి ఉంది.విచ్చలవిడిగా రసాయనాల వాడకం వలన,అశాస్త్రీయమైన పద్దతుల వలన మన దేశంలో వ్యవసాయ భూములు నిస్సారమై,సేద్యానికి పనికి రాకుండా పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.’’

పొలానికి, హలానికి గల ప్రాధాన్యత క్రమేపీ తగ్గిపోతున్నది. దేశానికి అన్నం పెట్టే హాలికులు ఆక్రందనలు చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించినా ఫలితం లేక దిగాలు పడుతున్నారు.  ఇందుకు గల కారణాలను విశ్లేషించాలి. వివరించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఈనాటికీ వ్యవసా యానికున్న కీలక భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .ముఖ్యంగా వర్ధమాన దేశాల ప్రజలు నేటికీ వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రజలకు ఉపాధి కల్పించడంలోను, వ్యవసాయ సంబంధిత ఉద్యోగాల విషయంలోనూ, పరిశ్రమలకు కావలసిన ముడి వస్తువుల సరఫరాలోను ఈనాటికీ వ్యవసాయమే ప్రధానపాత్ర వహిస్తున్నది. ఆహారధాన్యాలు పండించి ఎంతో మంది ప్రజల ఆకలి  తీర్చడంలో వ్యవసాయ రంగం నిర్వర్తిస్తున్న కీలక భూమిక ప్రశంసనార్హం.అభివృద్ది చెందుతున్న ఇండియాతో సహా అగ్రదేశాలుగా పిలవబడుతున్న అమెరికా చైనా,రష్యా,ఫ్రాన్స్ ‌దేశాలతో పాటు బ్రెజిల్‌, ‌మెక్సికో, జపాన్‌, ‌జర్మనీ, టర్కీ వంటి దేశాలు ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా మారాయి. ఎప్పుడూ అగ్రదేశాల్లో విద్య, ఉద్యోగాల కోసం వెంపర్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలను కేవలం  ఉద్యోగాలకు స్వర్గధామం లా భావిస్తూ అపోహపడుతున్నాం. అగ్రరాజ్యాల ఆర్ధిక వ్యవస్థకు వ్యవసాయం ఒక ప్రధాన వనరు అన్న సంగతి అంగీకరించలేకపోతున్నాం. భారతదేశం కూడా ఎంతగా వివిధ రంగాల్లో ప్రగతి సాధిస్తున్నా ఈనాటికీ సుమారు జనాభాలో సగం శాతం మంది ప్రజలు  వ్యవసాయం పైనే ఆధార పడి జీవించడం గమనార్హం. భారతీయ కుటుంబాల ఆదాయంలో సగం పైగా వ్యవసాయ రంగం నుండే లభిస్తున్నది. పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వంటి ఉత్పత్తుల్లోను, పాలు, చేపలు, గ్రుడ్లు ఇలా అనేక ఉత్పత్తుల విషయంలోను భారతదేశం  యొక్క పాత్ర అధికం. చైనా లో సుమారు ఐదున్నర లక్షల చ.కి.మీ భూమి సేద్యానికి వినియోగించబడుతున్నది.
ప్రపంచంలో అమెరికా అత్యంత ఆధునిక వ్యవసాయ పద్ధతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నది. అధునాతన యంత్ర పరికరాల సహాయంతో  అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, యాంత్రీకరణ ద్వారా అక్కడ వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.గత కొద్ది దశాబ్దాలుగా అమెరికాలో వ్యవసాయం ప్రతీ ఏటా 5 శాతం పురోగతి సాధిస్తున్నది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారి శాతం  కూడా ప్రతీ సంవత్సరం  పెరగడం గమనార్హం. బ్రెజిల్‌ ‌లో 40 శాతం పైగా భూమి వ్యవసాయం ఆక్రమించింది. బ్రెజిల్‌ ‌లో మొక్కజొన్న, ప్రత్తి, సోయాబీన్‌ ,‌పొగాకు వంటివి ప్రధాన పంటలు. 2018 లో 28 శాతంగా ఉన్న బ్రెజిల్‌ ‌సేద్యం  ప్రస్తుతం 40 శాతానికి పెరిగింది.రష్యా భూభాగంలో 13 శాతం సేద్యం ఆక్రమించింది. రష్యా జి.డి.పి లో 6 శాతం వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలదే. 23 మిలియన్ల హెక్టార్ల భూమిని రష్యా సేద్యానికి  వినియోగిస్తున్నది. ఫ్రాన్స్ ‌లో 7 శాతం మంది ప్రజలు వ్యవసాయం,వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు. మెక్సికో 15 శాతం సేద్యంతో  కీలక పాత్ర వహిస్తున్నది.జపాన్‌ ‌లో 10 శాతం మంది ప్రజలు వ్యవసాయం పై జీవిస్తున్నారు.జర్మనీ భూభాగంలో 80 శాతం అరణ్యాలు,వ్యవసాయం ఆక్రమించడం జరిగింది.టర్కీలో 19 శాతం మందికి ఉపాధి వ్యవసాయం కల్పిస్తున్నది. క్రీస్తు పూర్వమే వ్యవసాయం  ప్రారంభమైనది. వ్యవసాయం సుమారు పన్నెండు వేల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రకలిగి ఉంది.దక్షిణ అమెరికాలో 9000 బి.సి లోనే వ్యవసాయం ప్రారంభమయింది.   వ్యవసాయం మానవ నాగరికతకు బీజం వేసింది.ఆటవికమైన అలవాట్లకు స్వస్తి చెప్పడంతో వేటతో ప్రారంభమైన జనజీవనం వ్యవసాయానికి నాంది పలికింది.క్రీస్తు పూర్వమే ఈజిప్టు,మెసపుటేమియాల్లో  వ్యవసాయం ప్రారంభమైనట్టు చరిత్ర చెబుతున్నది.
భారతదేశం ప్రాచీన కాలం నుండి వ్యవసాయానికి పెట్టింది పేరు. ప్రపంచంలో సుమారు 40 శాతం మంది వ్యవసాయం ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇక భారత దేశం విషయానికొస్తే భారత దేశంలో అమెరికా తర్వాత అత్యధిక సేద్యపు భూమి గల దేశం భారతదేశానిదే.స్వాతంత్య్రం వచ్చేటప్పటికి, వ్యవసాయ ఉత్పత్తులు భారత్‌ ‌లో అతి తక్కువ. స్వాతంత్య్రం తరువాత వ్యవసాయరంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించినా రైతు పరిస్థితి నిరాశాజనకంగా ఉన్న మాట వాస్తవం.భారత దేశంలో ఇంకా వ్యవసాయంలో ప్రాచీన పద్దతులు మానలేదు. మన దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు.చైనాలో సేద్యపు భూమి తక్కువ. దిగుబడులు మాత్రం అధికం.భారత దేశంలో వ్యవసాయం భూగర్భ జలాలు,వర్షం ప్రకృతి మీద ఆధారపడి ఉంది.విచ్చలవిడిగా రసాయనాల వాడకం వలన,అశాస్త్రీయమైన పద్దతుల వలన మన దేశంలో వ్యవసాయ భూములు నిస్సారమై,సేద్యానికి పనికి రాకుండా పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.అడవులను నరికివేయడం,పదే పదే ఒకే పంటను పండించడం పంట భూముల నిస్సారతకు ఒక మూల కారణం.అధిక మోతాదులో రసాయనాలు వినియోగించడం వలన  వ్యవసాయ సారాన్ని పెంచి,అత్యధిక దిగుబడులకు కారణమౌతున్న పలు జీవరాశులు చనిపోవడం జరుగుతున్నది.
మన భూములను సారవంతం చేయడానికి ఇప్పుడు ప్రయత్నం మొదలు పెడితే ఫలితం  కనీసం 25 సంవత్సరాల తర్వాత కనబడుతుంది.భూగర్భ జలాలు తరిగి పోతున్నాయి.ఎడారిగా మారుతున్న పరిస్థితులు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. నీటి వృథా పెరిగి పోతున్నది. బిందుసేద్యం ఇంకా గరిష్ఠ స్థాయికి చేరుకోలేదు. డ్రిప్‌ ఇరిగేషన్‌ 5 ‌శాతం లోపే ఉంది.వైవిధ్య భరితమైన పంటలు పండించడంలో మనం ఇంకా వెనుకబడి ఉన్నాం. అమెరికాలో కేవలం 2% మంది మాత్రమే వ్యవసాయం పై ఆధార పడి జీవిస్తున్నారు. కాని వ్యవసాయ దిగుబడులు మాత్రం గణనీయమైన స్థాయిలో ఉన్నాయి.భారత దేశం యొక్క జి.డి.పి లో సేవారంగం,పారిశ్రామిక రంగాలదే సింహభాగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సుమారు 20 శాతం వ్యవసాయ,వ్యవసాయ ఆధారిత రంగాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.వ్యవసాయ,వ్యవసాయాధారిత రంగాల యొక్క వృద్ధి ఈ మధ్య సంవత్సరాల్లో 3.9 శాతం పెరిగినట్లు ఒక అంచనా.భారత దేశంలో 42 శాతం మందికి ఉపాధి వ్యవసాయం కల్పిస్తున్నట్లు తాజా గణాంకాలు తెలియ చేస్తున్నాయి. వ్యవసాయం యొక్క ఆదాయం తగ్గినా, వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ప్రజలు భారతదేశంలో అధికంగా ఉన్నారు.
ఈ ప్రపంచంలో నిజమైన సంపద కరెన్సీ రూపంలో లేదు. కాగితాలపై లిఖించబడ్డ గణాంకాల్లో అసలే లేదు. నిజమైన  సంపద,అభివృద్ధి ప్రజలకు తిండి పెట్టే  కర్షకలోకం పై ఆధారపడి ఉంది. ధన,కనక,వస్తు వాహనాలన్నీ కేవలం మన భ్రమల్లో నుంచి పుట్టుకొచ్చిన కల్పిత సంపద. ఇచ్చు పుచ్చుకునే వ్యవహారానికి సంబంధించిన ఆర్ధిక పరమైన సౌలభ్యం కోసమే కరెన్సీ ఏర్పడింది. పూర్వ కాలంలో ‘‘వస్తుమార్పిడి ఆర్ధిక వ్యవస్థ’’ (బార్టర్‌ ‌సిస్టమ్‌) అమల్లో ఉండేది.  ఇది క్లిష్టతరంగా మారడంతో కాలక్రమంలో వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కరెన్సీ  పుట్టుకొచ్చింది. కేవలం మన మధ్య చెలామణీ కాబడే  ఇచ్చుపుచ్చుకునే వ్యవహారానికి సంబంధించిన కరెన్సీ కట్టలను నమ్ముకుని, దానినే నిజమైన సంపదగా భావించి, శ్రమను మరచి పోవడం, శ్రమకు విలువనివ్వక పోవడం బాధాకరం. ఈ ప్రపంచంలో క్షుద్భాధ కు ఏకైక విరుగుడు ఆహరం.ఆహారం లేకపోతే ఎంత ధనమున్నా నిష్ఫ్రయోజనం. కోటీశ్వరుడైనా పట్టెడన్నమే  తిని బ్రతకాలి.  బంగారం,కరెన్సీని తిని బ్రతకలేడన్నది సత్యం.మానవ మనుగడ కేవలం ఆహారంపై ఆధారపడి ఉంది.ఇటీవల  కొన్ని దేశాల్లో వివిధ కారణాల వలన ఏర్పడిన  సంక్షోభాలకు ప్రజలు తిండి లేకుండా అల్లాడిపోతుంటే భారత్‌ ‌వంటి దేశాలు మానవతా దృక్పథంతో అందిస్తున్న ఆహారమే వారి ప్రాణాలను నిలబెడుతున్నది. యుద్ధ సంక్షోభాల వలన,ప్రకృతి విపత్తుల వలన ప్రజలు ఆహారం,నీరు లేక అల్లాడిపోతున్న పరిస్థితుల్లో  వారి వద్ద ఉన్న సంపద వారి ప్రాణాలను నిలబెట్టలేదు. ప్రజల కడుపు నింపేది కరెన్సీ కాదు,కేవలం ఆహారం మాత్రమే.
ప్రజలకు ప్రధానమైన ప్రాథమిక అవసరం ఆహారం. ఆహారం లేనిదే జీవితం నడవదు. అలాంటి ఆహారం కోసం నేలను వినియోగించాలి. సేద్యానికి అనుకూలంగా మలచు కోవాలి. హలం పట్టి పొలం దున్ని విత్తనాలను చల్లి పైరును పెంచి, క్రిమికీటకాదుల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి  పంటలను కాపాడుకుని,ప్రజలందరికీ తిండి పెట్టడం కర్షకుని చేతికి లభించిన అమూల్యమైన అవకాశం. అలాంటి అవకాశాన్ని ఒక వరంగా మార్చడంలో ప్రభుత్వాలు విశేష కృషి చేయాలి.వ్యవసాయం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అదొక పెద్ద ప్రక్రియ. ప్రపంచ నాగరికతకు పర్యాయపదం వ్యవసాయం అని చెప్పక తప్పదు.వ్యవసాయం తోనే నాగరికత ఉద్భవించింది.  అంతకు ముందు క్రూరమృగాలను వేటాడి,పచ్చి మాంసం భుజించి మనిషికి,మృగానికీ తేడా లేని విధంగా  జీవించి ఆది మానవుడిగా,అనాగరికుడిడిగా చరిత్రకెక్కిన మనిషి కాల క్రమంలో పరివర్తన చెంది,పూర్వ లక్షణాలను త్యజించి,పంటలను పండించి,ఆహారాన్ని భుజించడం నేర్చుకున్నాడు.  తర్వాత కాలంలో మరింత అభివృద్ది దిశలో మెరుగైన జీవన విధానం అలవరచుకున్నాడు. వ్యవసాయమే నాగరికతకు బీజం వేసింది. వ్యవసాయ ఉత్పత్తులతోనే ప్రపంచం నడుస్తున్నది.వివిధ రంగాల మనుగడకు వ్యవసాయమే ఆలంబనగా మారింది.
ఒకప్పుడు భారతీయ సమాజంలో కులవృత్తులు ఉపాధికి ఊతమిచ్చేవి. నిరక్షరాస్యత తాండవించిన నాటి కాలంలో విద్య కేవలం కొద్ది మందికే పరిమితమై ఉండేది. దాదాపు అన్ని కులాల్లోను ఇదే పరిస్థితి ఉండేది. వ్యవసాయ రంగం  భారతీయ సమాజంలో అందరికీ చేయూత నిచ్చేది.  వ్యవసాయమంటే ఒక గౌరవప్రదమైన వృత్తిగా, వ్యవసాయమంటే అందరికీ అన్నం పెట్టే ప్రధానమైన రంగంగా భావించేవారు. వర్తమానంలో కూడా మన దేశం వ్యవసాయాధారిత దేశమే.  ప్రజలకు తిండి పెట్టే వ్యవసాయ రంగం అధోగతి పాలైతే భవిష్య పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయి. ఆహార భద్రత పెద్ద సమస్యగా తయారౌతుంది. వ్యవసాయం ప్రమాదంలో పడితే, పెరుగుతున్న నాగరికత,పెరిగిన శాస్త్ర,సాంకేతిక ప్రగతి, ఉద్యోగాలేవీ ప్రజలకు తిండి పెట్టలేవు. భారతదేశం తో పాటు యావత్‌ ‌ప్రపంచం కూడా వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలి. భవిష్య అవసరాలు గుర్తించాలి. కర్షకుల కష్టాలకు ఫలితం దక్కాలి. వర్తమాన వ్యవసాయ పరిస్థితుల నేపథ్యంలో  భారతదేశంలో కూడా అగ్రదేశాల మాదిరిగా వ్యవసాయరంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, యాంత్రీకరణను విస్తృత పరచాలి. ప్రస్తుతమున్న కొద్దిపాటి యంత్రాల వినియోగం కూడా రైతులకు పెనుభారం గా మారింది. రైతాంగం నష్టపోకుండా,భూమిపై వారికున్న హక్కులకు భంగం వాటిల్లకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.ఇతర రంగాల మాదిరిగా వ్యవసాయ రంగం కూడా గౌరవప్రదమైన జీవన విధానంగా యువత భావించాలి. రైతులకు  కూడా ఉద్యోగుల తరహాలో ప్రభుత్వాలు అన్ని ప్రోత్సాహకాలివ్వాలి. వార్ధక్యంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.అన్నం పెట్టే రైతులు ఆర్ధిక బాధలతో ఆత్మహత్యలు చేసుకునే పరిణామాలను తొలగించాలి. అన్నదాత ఆక్రందనలకు తగిన పరిష్కార మార్గం కనుగొనాలి. ఇప్పటికే వ్యవసాయ రంగం అనేక ఇబ్బందులు పడుతున్నది. ఇకనైనా నత్తనడక నడుస్తున్న వ్యవసాయాన్ని గాడిలో పెట్టాలి.
image.png
సుంకవల్లి సత్తిరాజు,
 9704903463.

Leave a Reply