Take a fresh look at your lifestyle.

సమర్థ కుటుంబం మంచి సమాజాన్ని నిర్మిస్తుంది

కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ కుటుంబ వ్యవస్థ ప్రాముఖ్యతను గుర్తించి 1993లో మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ప్రకటించింది. 1994 నుండి ప్రతి ఏడాది మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.1995లో బీజింగ్‌, ‌కోపెన్‌హాగన్‌ ‌సమావేశాలు కుంటుంబ ప్రాముఖ్యతను, సామాజిక అభివృద్ధిలో దాని పాత్ర గురించి నొక్కి వక్కాణించాయి. వ్యక్తుల శ్రేయస్సుకు కుటుంబం అండగా ఉంటుందన్న విషయాన్ని ప్రపంచ దేశాలు అంగీకరించాయి. ఈ సంవత్సరం ‘అభివృద్ధిలో ఉన్న కుటుంబాలు : కోపెన్‌హాగన్‌ ‌మరియు బీజింగ్‌  25’’ అనే నినాదంతో జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ప్రపంచాన్ని కొరోనా మహమ్మారి అతలాకుతలం  చేస్తున్న ఆపద సమయంలో కుటుంబ ఆసరా, ప్రాముఖ్యతను ప్రంచ దేశాలన్నీ గుర్తించాయి.

భారతీయ జీవన వ్యవస్థకు కుటుంబమే మూల బిందువు. ఉమ్మడి కుటుంబాలు కలిసిమెలిసి సహజీవనం చేస్తూ ఆనందంగా హాయిగా ఉండేవారు. రానురాను ఆర్థిక, సామాజిక, రాజకీయ, కుటుంబ, ఉద్యోగ తదితర కారణాల నేపథ్యంలో కుటుంబాలు విడిపోతున్నాయి. మన బాధలను తగ్గించడానికి, భయాలను అధిగమించడానికి కుటుంబం ఒక మూలస్థంభంలా సహకరిస్తుంది. కుటుంబం మన ఆనందాల, దుఃఖాల భాగం. నిర్మలమైన సమాజంలో కుటుంబ వ్యవస్థ అత్యంత ముఖ్యమైన అంశం. కుటుంబ  వ్యవస్థలో ఉన్న అడ్డంకులను పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ‌ప్రజా విధాన రూపకర్తలను కోరారు. ఒక సర్వే ప్రకారం 64 శాతం మంది స్త్రీలు  ఉమ్మడి కుటుంబంతో కాకుండా చిన్న కుటుంబంతో, 44 శాతం మంది మగవాళ్ళు పెద్ద కుటుంబంతో కాకుండా చిన్న కుటుంబంతో జీవించాలనే అభిప్రాయాన్ని వేలిబుచ్చుతున్నారు. భారత్‌లో మాత్రం పెద్ద కుటుంబాలు విడిపోయి చిన్న కుటుంబాల ప్రాధాన్యం పెరిగింది.
విదేశాల్లో కుటుంబ వ్యవస్థ ఎప్పుడో చిన్నాభిన్నమైంది. ఒకప్పుడు మన దేశంలో ఒక ఊళ్లో ఆ కుటుంబం పెద్దది అంటున్నారంటే తల్లి, తండ్రి, కొడుకులు, కోడళ్లు, మనమలు, మనవరాళ్లు, బాబాయ్‌లు, పెదనాన్నలు,పెద్దమ్మలు చిన్నమ్మలు మామయ్యలు, అత్తయ్యలు,… ఇందరు ఉన్నారని అర్థం.  దానినే ఉమ్మడి కుటుంబం అంటారు. ఇవాళ ఇలాంటి కుటుంబాలు లేవు. పిల్లలు బాగా చదువుకోవాలి, అమెరికాకు వెళ్లాలి, తొందరగా  సొంత ఇల్లు ఉండాలి, మార్కెట్‌లోకి వచ్చిన కొత్త బ్రాండ్‌ ‌కారు కొనుక్కోవాలి. అందరికంటే నేను గొప్పవాడిగా ఉండాలి … ఇలాంటి ఆలోచనా విధానం ఉప్పుడైతే మొదలైందో అప్పుడు కుటుంబం కన్నా డబ్బు సంపాదనకే ప్రాముఖ్యతనివ్వడం మొదలైంది. అందులో భాగంగా తాత్కాలిక  అనుబంధాలు ప్రధానమయి రక్త సంబంధాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. నేడు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పెరిగిపోతున్నాయంటే కారణం ఉమ్మడి కుటుంబాల వ్వవస్థ కనుమరుగవుతున్నదని అర్థం. నేటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే, ఇంట్లో పెద్దవాళ్లు లేకపోతే పిల్లలు అదుపు తప్పే అవకాశం ఎక్కువ. పిల్లలకు సంస్కృతి, సంప్రదాయం, ఏది మంచో, ఏది చెడో చెప్పేవారు లేరు. ఇది సమాజంలో మంచి పౌరులను తీర్చిదిద్దడానికి ఎంతో ఉపయోగపడుతుంది. బాల్యంలోనే మంచి విశ్వాసం ఏర్పడకపోతే యవ్వనంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వ్యతిరేక భావాలు ఏర్పడే ప్రమాదం ఉంది. నేటి కాలుష్య ప్రపంచంలో, అనారోగ్యం, ఒంటరితనం. ఘర్షణ, ఒత్తిడి, వ్యతిరేక ఆలోచనలను జీవన విధానంలో అన్నింటిని అధిగమించాలంటే ఉమ్మడి కుటుంబం అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అమ్మ, తాతల మార్గదర్శనం పిల్లలకు ఆవశ్యకం. వారే రాబోయే తరానికి, నేటి తరానికి సయోధ్య కర్తలు.

నేడు మన దేశంలో ఇంటి పెద్దలను వృద్ధాశ్రమాలలో లేదా అనాథాశ్రమాలలో వదిలేస్తున్నాం. వెన్నెల వచ్చే వేళ చిన్న పిల్లలను కూచోపెట్టుకుని అనగనగా ఒక రాజు ….కథలు చెప్పే వారే లేరు. ఆ కథల ద్వారా ప్రకృతిని, వింతలూ విశేషాలను, నీతిని, నిజాయితీని, నైతిక  విలువలను, క్రమశిక్షణను, సంప్రదాయ కళలను,  చెప్పే అనుభవ నిధులు అనాథలుగా మూలాన పడ్డాయి. నేటి యాంత్రిక జీవితంలో గూగుల్‌ ‌సెర్చ్‌నో లేదా యుట్యూబ్‌నో నమ్ముకుని కొంత అసంబద్ద జ్ఞానాన్ని పొందుతున్నారు. భారతీయ సమాజం సంతృప్త సమాజం. అంటే ఉన్న దాంట్లో సంతోషంగా ఉండే సమాజం .కాని కాల క్రమేణా తల్లిదండ్రుల ఆలోచనలో మార్పులు వచ్చాయి. స్వార్థము, అహం పెరుగుతున్నాయి. తద్వారా పిల్లల మనసులో స్వార్థ పూరిత  లక్ష్యాలు నాటుకోవడానికి ఒకరకంగా తల్లిదండ్రులే కారణమవుతున్నారు. పిల్లలు బాగా చదువుకోవాలి, అమెరికాకు లేదా విదేశాలకు వెళ్లాలి, తొందరగా  పెద్ద సొంత ఇల్లు కట్టాలి., బాగా డబ్బు సంపాదించాలి. మార్కెట్‌లోకి వచ్చిన కొత్త బ్రాండ్‌ ‌కారు కొనుక్కోవాలి. అందరికంటే నేనే గొప్పవాడిగా ఉండాలి,  అనే ఆలోచనలు ….ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పుడే కుటుంబ వ్యవస్థ దెబ్బతినడం మొదలయ్యింది. చిన్న కుటుంబాల వేగం పెరిగింది. ఉమ్మడి కుటుంబాలు క్షీణించాయి. ప్రధానమయిన రక్త సంబంధాలు తెగిపోతున్నాయి. ఫలితంగా నేను- నాది అనే అభిప్రాయం పెరిగి పెద్దదయింది. పెద్ద పెద్ద కుటుంబాలన్నీ విచ్ఛిన్నమయ్యాయి. ముఖ్యంగా పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కంటే అమ్మమ్మ తాతయ్య లేదా నానమ్మ తాతయ్యల పాత్ర ముఖ్యం.

సామాజిక మరియు వ్యక్తిగత భయాలను అధిగమించడానికి కుటుంబం ఒక మూలం, సమర్థవంతమైన కుటుంబం ఒక మంచి సమాజాన్ని నిర్మించగలదు. తల్లిదండ్రుల పాత్ర పైనే కుటుంబం ప్రభావితమై ఉంటుంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది. వారి ఆలోచనలు కుటుంబానికి దిశా నిర్దేశం చేస్తాయి. నేటి కాలంలో కుటుంబాల మధ్య, బంధువుల మధ్య అనుబంధాలు తెగిపోతున్నాయి. జీవన శైలిలో వచ్చిన మార్పులు కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. భారత దేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు మంచి ప్రాముఖ్యత ఉంది. ఉమ్మడి కుటుంబాల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని, ఉమ్మడి కుటుంబాల ద్వారా కొన్ని విలువలు నేర్చుకునే వీలుందని నేటి యువత గ్రహించాలి.  కష్టం వస్తే సలహా, నష్టం వస్తే ఓదార్పు, చిరాకుగా ఉంటే పరిహాసం, పరాకుగా ఉన్నప్పుడు ఒక అనుభవ పెద్ద జీవితానికి అవసరమని తలిదండ్రులు  పిల్లలకు చిన్నప్పటి నుండే ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను తెలియజేయాలి. పెళ్లి కావాల్సిన యువతీ యువకుల వేరు కాపురాల కల ఎలా ఉన్నా కష్టకాలంలో ఆదుకునే పెద్ద దిక్కు లేక, ఇంట్లో మాట్లాడే మనిషి లేక, పిల్లల చేయి పట్టుకుని నడిపించే పెద్ద దిక్కు లేక పడే అవస్థతో పోలిస్తే ఉమ్మడి కుటుంబాల్లో ఉండే సంకటాలు చిన్నవని భావించి పెద్దవారితో కలిసి జీవించి, జీవితాలను  సుఖవంతం చేసుకోవాలి.

image.png

నెరుపటి ఆనంద్‌,
ఉపాధాయులు, టేకుర్తి
9989048428

Leave a Reply