- తన నోరు మూయించేందుకు లంచం ఎర
- ఆరోపణలు చేసిన ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్
న్యూ దిల్లీ, జనవరి 18 : దిల్లీ అసెంబ్లీ మూడోరోజు బుధవారం కూడా ఆందోళన కొనసాగింది. . విదానసభలో మాట్లడేందుకు అవకాశం ఇవ్వగానే ఆప్ ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ నోట్ల కట్టలను ప్రదర్శించారు. దాంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. తన నోరు మూయి ంచేందుకు మాఫియా ఇలా ప్రయత్నిస్తున్న దంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ రితాలా ఎమ్మెల్యే మొహిందర్ గోయల్ తన బ్యాగులో నుంచి రూ.15 లక్షల నోట్ల కట్టలను తీసి ప్రదర్శించారు. అనంతరం ఆ నోట్ల కట్టలను తన టేబుల్‌పై ఉంచి ప్రసంగం కొనసాగించారు.
ఢిల్లీలోని దవాఖానల్లో ఉద్యోగాలను మాఫియా భర్తీ చేస్తున్నదని ఆరోపించారు. తాను మాట్లాడకుండా ఉండేందుకు వారు నాకు లంచం ఇచ్చారని చెప్తూ నోట్ల కట్టలను గాల్లో ఊపారు. కరెన్సీ కట్టలతో తనను కొనాలనే ప్రయత్నం జరిగిందన్నారు. లంచం ఇచ్చి నా గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందన్న విషయాన్ని లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు విన్నవించినట్లు తెలిపారు. లేఖ ద్వారా సీఎస్‌కు తెలియజేసినా చర్యలు లేవన్నారు. ఇప్పుడిలా చేయడం ద్వారా రిస్క్‌లో పడిపోయానని నాకు తెలుసునని, అయితే అవినీతిని తరిమివేయడానికే ఇలా చేశానని చెప్పుకొచ్చారు.
అంబేద్కర్ దవాఖానలో సిబ్బంది నియామకం అంశాన్ని విధానసభలో గోయల్ లేవనెత్తారు. నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాల్సిన వారికి ఇవ్వడం లేదని ఆరోపించారు. నర్సింగ్, ఇతర పోస్టులకు టెండర్లు వేశారని, నిబంధనలను పాతరేశారని చెప్పారు. 80 శాతం మంది పాత ఉద్యోగులకు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఉద్యోగాలు పొందిన వారి జీతాల నుంచి కాంట్రాక్టర్లు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. దవాఖానల్లో ఉద్యోగాల నియామకాల్లో మాఫియా రాజ్యమేలడం ఇదే తొలిసారని ఆయన దుయ్యబట్టారు. ఇకనైనా ఎల్జీ చర్యలు తీసుకోవాలని చెప్పడానికే ఇలా లంచం డబ్బు తీసుకొచ్చానని చెప్పారు.