Take a fresh look at your lifestyle.

‘‘మేం చూస్తాంలే…ఇది జరిగేదే మేం చూస్తాంలే ’’

“మతతత్వ పాకిస్తాన్‌లోనే,1980 దశకంలో చీరకట్టుని నిషేధించిన పరిస్థితిలో ఒక ధిక్కారంగా నల్లచీర కట్టుకుని వెళ్లి మరీ తనపాటతో నిరసన తెలిపిన గాయకురాలు ఇక్బాల్‌ ‌బానో గురించి తెలుసా? ప్రముఖ ఉర్దూకవి ఫైజ్‌అహ్మద్‌ ‌ఫైజ్‌ ‌రాసిన ‘హమ్‌ ‌దేఖేంగే’ కవితను జియా ఉల్‌ ‌హక్‌ ‌నియంతృత్వానికి వ్యతిరేకంగా యాభైవేలమంది సమక్షంలో ఖంగుమని పాడిన ఇక్బాల్‌ ‌బానో గొంతు ఇప్పుడు భారతదేశంలోని ప్రతి సమూహంలోనూ రాగాలాపన చేస్తోంది. విభిన్న భాషల, సంస్కృతుల సమాహారమైన మనదేశంలో, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు, పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రతి రాష్ట్రంలోనూ ఆయా స్థానిక భాషల్లో సజీవంగా గొంతెత్తుతున్న పాట ‘హమ్‌ ‌దేఖేంగే.’  తెలుగులోనూ ‘మేం చూస్తాంలే…ఇది జరిగేదే… మేం చూస్తాంలే….చరిత్ర రాసిన ఆ శాసనం…మాకు పూచీ ఇచ్చిన ఆ దినం..మేం చూస్తాంలే’ అంటూ అల్లుకుపోతున్న నినాదం.”

Why we see it ... we see this happen

పార్లమెంట్లో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకత తెలిపిన తెలంగాణా ప్రభుత్వం, రాష్ట్రంలో మాత్రం నిరసన తెలుపుతున్న ప్రజలమీద నిర్బంధాన్ని మోపుతోంది. చూడబోతే, మేము నిర్ణయం చెప్పాం కదా, ఇంక మీరెందుకు మాట్లాడటం, ప్రజలుగా మీకేం హక్కు లేదు అని చెబుతున్నట్లుగా వుంది వారి వ్యవహారం! డిసెంబర్‌ 19‌న హైదరాబాద్‌లో మొదలయ్యిన నిర్బంధం ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో ప్రజలకు అనుభవమవుతూనే వుంది. సిఏఏ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియచేస్తున్న మహిళా, యువ విద్యార్థి కార్యకర్తల మీద ఒక్క హైదరాబాద్‌లోనే ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదయ్యాయనేది లెక్క తీయాల్సిన అవసరం వుంది. నిరసన తెలియజేయటం అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అసలు నిరసనే తెలియజేయకూడదనటం అప్రజాస్వామిక ధోరణి. నిజానికి దీన్ని శాంతి భద్రతల సమస్యగా మారుస్తున్నది పోలీసులు, ప్రభుత్వాలే! రాత పూర్వకంగా అడిగినా గానీ నిరసన ప్రదర్శనలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో, ప్రజలు తమకు తోచిన పద్ధతుల్లో శాంతియుతంగానే నిరసన కార్యక్రమాలు చేబడుతున్నారు. అయినా కానీ వారిమీద కేసులు బనాయించడం, మహిళా కానిస్టేబుళ్ళు మహిళా ఉద్యమకారుల సున్నితమైన శరీర భాగాలను గాయపరచడం, ప్రదర్శనలకు అనుమతి కోరితే సాకులు చెప్పటం చూస్తుంటే కావాలనే ప్రజలని ఇబ్బంది పెట్టాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాధినేతలు చెప్పకుండానే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అనుకుంటే అది మన అజ్ఞానమే అనుకోవాలి. అనేక నిర్బంధాలూ, పోలీసుల లాఠీచార్జీలు అధిగమించి ప్రజాఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్ర సాధన సాధ్యమయింది, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు, ప్రజల అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే ఒక చట్టానికి నిరసన తెలియజేసే హక్కును కూడా నిర్బంధభరితం చేస్తున్నదీ ఉద్యమాల ద్వారా అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వమే కావటం దురదృష్టకరం.

ఆఖరికి, జనవరి 30 మహాత్మాగాంధి వర్ధంతి సందర్భంగా, ట్యాంక్‌ ‌బండ్‌ ‌పొడుగూతా నిశ్సబ్దంగా చేయాలని తలపెట్టిన మానవహారంకు కూడా అనుమతి నిరాకరించిన విధానం హాస్యాస్పదంగా వుంది. ఒకటి, అది నిర్దేశించిన ప్రాంతం కాదనటం, అక్కడికి వచ్చే సందర్శకులకి, సామాన్య ప్రజలకి ఇబ్బంది అవుతుందని చెప్పటం.. రెండు, సాయంత్రం పూట ఎక్కువమంది ప్రజలు అక్కడికి వస్తే రోడ్‌ ‌మీద ట్రాఫిక్‌ ‌సమస్యలు తలెత్తుతాయనటం.. మూడు, ఇక్కడ మానవహారంగా ప్రజలు నిలబడితే, గాంధీ వర్ధంతి సందర్భంగా ఇతర ప్రాంతాల్లో ప్రార్థనలు చేయటానికి సమావేశమయ్యేవారికి ఇబ్బంది కలుగుతుందనటం..నాలుగు, ప్రజలకు శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని అనటం. పోలీసులు చెప్పిన అభ్యంతరాలు ఇవి! వినడానికి ఎంత హాస్యాస్పదంగా వున్నాయో! వాస్తవానికి ట్యాంక్‌ ‌బండ్‌కు అటూ ఇటూ కూడా రోడ్‌ ‌మీదకు రాకుండా వుండే విధంగా ఇనుపరైలింగ్‌ ‌వుంటుంది. దాని వెనుకాల ఒక గంటా గంటన్నరపాటు వివిధ సమూహాల ప్రజలు ఒకలైనులో వకరిపక్క వకరు నిశ్సబ్దంగా నిలబడతారు. ఇప్పటి వరకూ అక్కడ అనేక అంశాల మీద మానవహారాలు జరిగాయి. అలాంటి సందర్భాలలో ఎక్కడా, ఏరోజూ చిన్నపాటి సమస్య తలెత్తినట్లు పోలీసులతో సహా ఎవరూ చెప్పలేదు. అంతెందుకు, ఈ అంశం మీదే పార్లమెంటులో చట్టం కాకముందు జరిగిన నిశ్శబ్ద నిరసన కార్యక్రమానికి ఈ పోలీసులే అనుమతి కూడా ఇచ్చారు. మరి, అప్పుడు లేని శాంతిభద్రతల సమస్య హటాత్తుగా ఇప్పుడెలా వచ్చింది? ఇంకోవిధమైన ధోరణి ఏమిటంటే, చివరి నిముషం దాకా అనుమతి ఇస్తామని చెప్పటం, నిర్వాహకులను తిప్పించుకోవటం, ఆఖరి క్షణంలో అనుమతి లేదని చెప్పటం చూస్తుంటే ఇబ్బంది పెట్టడానికే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.

అనుమతి తీసుకోకుంటే ఆ కారణం మీద నిరసనను భగ్నం చేయటం! మోఘల్పురాలో ఒక యాభైమంది స్త్రీలు రాత్రిపూట ఒక ఇంటి ఆవరణలో కూర్చుంటే బలవంతాన లేపేశారు! పోనీ, పోలీసుల అనుమతి తీసుకునే నిరసన కార్యక్రమం చేయాలనుకుని, మీరాలం ఈద్గాలో జనవరి 27, 28 తేదీల్లో స్త్రీల సభకు రెండురోజులపాటు అనుమతి అడిగితే ఇస్తామని చివరి నిముషం వరకూ చెప్పి ఆఖరికి కుదరదని చెప్పారు. అక్కడ కూడా ఇదే పాట! ట్రాఫిక్‌ ‌సమస్య, శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని! రోడ్డుకు చాలా లోపల వుండే ఈద్గాలో స్త్రీలు కూర్చుని ఈచట్టం గురించి అవగాహన కలిగేలా చర్చించుకుంటే, తమ నిరసన తెలియజేస్తే ఎవరికైనా ఎందుకు సమస్య అవుతుంది? హాలుమీటింగ్‌లో మాట్లాడాల్సిన కన్హయ్యకుమార్‌ ‌సభని అనుమతి లేదని నిరాకరించడం, భీమ్‌ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర ఆజాద్‌ ‌రావణ్‌ ‌సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి చివరినిముషంలో అనుమతి రద్దు చేశామని చెప్పి, అక్కడికి చేరుకున్న ఆయనను నిర్బంధించి, ఆయన ఆరోగ్యపరిస్థితి కూడా పట్టించుకోకుండా గంటలతరబడి హైదరాబాద్‌ ‌మూలమూలలకు పోలీసు వాహనంలో తిప్పడం, ఆజాద్‌ ‌ప్రసంగం వినటానికి వస్తున్న ప్రజలను కూడా నిర్బంధించి పోలీసు స్టేషన్లకు తరలించడం చూస్తుంటే, ప్రజల నిరసనను అడ్డుకోవటానికే తెలంగాణా ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు తోస్తోంది. ఒక పక్క మేము ఈ అంశాలను తెలంగాణలో అమలు కానీయం అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌గారు, ఆయన తనయుడు కాబినెట్‌ ‌మంత్రి కేటిఅర్‌ ‌గారు ప్రకటిస్తారు! మరోపక్క జరుగుతున్న పోలీసు నిర్బంధం గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు!? ఎందుకీ ద్వంద్వ ప్రవృత్తి?

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎలా ఆపలేరో, అలాగే నిర్బంధాలతో ప్రజలగొంతుని నొక్కేయాలనుకుంటే సాధ్యపడదని చరిత్ర పదే పదే చెబుతున్న అంశం. మతతత్వ పాకిస్తాన్‌లోనే, 1980 దశకంలో చీరకట్టుని నిషేధించిన పరిస్థితిలో ఒక ధిక్కారంగా నల్లచీర కట్టుకుని వెళ్లి మరీ తనపాటతో నిరసన తెలిపిన గాయకురాలు ఇక్బాల్‌ ‌బానో గురించి తెలుసా? ప్రముఖ ఉర్దూకవి ఫైజ్‌అహ్మద్‌ ‌ఫైజ్‌ ‌రాసిన ‘హమ్‌ ‌దేఖేంగే’ గజల్ని జియా ఉల్‌ ‌హక్‌ ‌నియంతృత్వానికి వ్యతిరేకంగా యాభైవేలమంది సమక్షంలో ఖంగుమని పాడిన ఇక్బాల్‌ ‌బానో గొంతు ఇప్పుడు భారతదేశంలోని ప్రతి సమూహంలోనూ రాగాలాపన చేస్తోంది. విభిన్న భాషల, సంస్కృతుల సమాహారమైన మనదేశంలో, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలకు, పోలీసు నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రతి రాష్ట్రంలోనూ ఆయా స్థానిక భాషల్లో సజీవంగా గొంతెత్తుతున్న పాట ‘హమ్‌ ‌దేఖేంగే.’ తెలుగులోనూ ‘మేం చూస్తాంలే…ఇది జరిగేదే… మేం చూస్తాంలే….చరిత్ర రాసిన ఆ శాసనం…మాకు పూచీ ఇచ్చిన ఆ దినం..మేం చూస్తాంలే’ అంటూ అల్లుకుపోతున్న నినాదం. కేరళలో ఆరువందల ఇరవై కిలోమీటర్ల పొడుగునా మానవహారమై నిలిచిన ప్రజాసమూహం. దేశ రాజధానిలో షాహీన్‌ ‌బాగ్‌గా, ఇంకా అనేక మొహల్లాల్లో ‘స్వర్గమనేదే వుంటే నేలపైకి దింపుతాం’ నినాదంతో వెల్లువెత్తుతున్న మహిళా చైతన్యం. విశ్వవిద్యాలయాల్లో మనువాదం నుంచీ, తరతమ బేధాలనుంచీ, పితృస్వామ్యం నుంచీ…‘ఆజాదీ’ అంటూ కదం తొక్కుతున్న యువజన సమూహం. విద్యార్థుల గొంతుకి బలమైన రక్షణగా నిలబడిన అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పోరాట రూపం. నిరకుశత్వంపై ప్రజా స్పందన ‘హమ్‌ ‌దేఖేంగే’ పాట రూపంలో వెల్లువై కదులుతోంది.

అవును, ఇప్పుడు నడుస్తున్న కాలమంతా యువతరానిదే. ‘ఆధునికతరానికి సామాజిక బాధ్యత లేకుండా పోయింది, వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమనుకుంటున్నారు’ అనే అపప్రధను మూటగట్టుకున్న ఈతరం ఇప్పుడు ఒక్క చూపుడు వేలితో దేశ భవిష్యత్తు సర్వమత సమానత్వంతో ఎలా ఉండాలో నిర్దేశిస్తున్నారు. ‘భారత ప్రజలమైన మేము’ అనే ప్రమాణంలో అన్ని మత సమూహాలూ ఉంటాయనీ, దానిని ప్రశ్నించటానికి ఎవరికీ అధికారం లేదని, ఈ దేశం లౌకిక ప్రజాస్వామిక దేశంగానే ఉంటుందనీ, ఒక్క మతానికే చెందిన రాజ్యంగా మార్చడానికి వొప్పుకోమని స్పష్టంగా చెబుతున్నారు. దేశ రాజధానిలో నిర్భయ మీద సామూహిక అత్యాచారం జరిగితే నిముషాల మీద రోడ్ల మీదకు వచ్చి, పోలీసు నిర్బంధాలను ఎదుర్కొంటూ ప్రభుత్వాలను నిలదీసింది ఈ నూతన ఆధునిక మహిళా తరమే! విశ్వవిద్యాలయాల్లో నెలకొనివున్న కులవివక్షలను ప్రశ్నించే క్రమంలో వ్యవస్థీకృత (ఆత్మ)హత్యకు గురైన రోహిత్‌ ‌వేములకు సంఘీభావంగా దేశవ్యాపితంగా కదిలిందీ, ప్రశ్నించిందీ ఈ యువతరమే! తెలంగాణా రాష్ట్ర సాధనకోసం తమ జీవితాలను బలిపెట్టినదీ, ఉద్యమాన్ని ఉధృతం చేసిందీ ఈ యువతరమే! ఇప్పుడు డాక్టర్‌ ‌బాబా సాహెబ్‌ అం‌బేద్కర్‌ అం‌దించిన లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం దేశ వ్యాపితంగా రోడ్ల మీద నిలబడి అధికార వ్యవస్థలను ప్రశ్నిస్తున్నదీ, ఉద్యమిస్తున్నదీ, నిర్బంధాలను ఎదుర్కొంటున్నదీ ఈ యువతరమే! మహిళా లోకమే!

జాతీయగీతమంటే, జాతీయభావమంటే సినిమా హాళ్ళలో నిర్బంధంగా ‘జనగణమన’ పాడాల్సిరావటం కాదని, రాజ్యాంగం కల్పించిన లౌకిక, ప్రజాస్వామ్య, స్వేచ్ఛ, సమానత్వాల విలువల పరిరక్షణ అని తేల్చి చెప్పిన తరం ఈ యువతరం! దేశవ్యాపితంగా రోడ్ల మీదకు వచ్చి ఒక స్పష్టమైన అవగాహనతో ప్రభుత్వాల నియంతృత్వాన్ని ప్రశ్నిస్తున్న ఈ తరం ప్రభుత్వాల నుంచీ ఎదుర్కొంటున్న సమస్యలు చిన్నవేమీ కాదు. కన్హయ్య కుమార్‌ ‌దగ్గర నుంచీ ఈనాటి షార్జిల్‌ ఇమామ్‌ ‌వరకూ ‘దేశద్రోహం’ కేసులను ఎదుర్కొంటున్నారు. తను పుట్టిన గడ్డ కశ్మీర్‌ ‌గురించి మాట్లాడుతున్నందుకు షెహ్ల రషీద్‌ ‌మీద పోలీసు కేసులతో పాటు సామాజిక మాధ్యమాల్లో ఆమెపై జరుగుతున్న ట్రోలింగ్‌ ‌మామూలు విషయంగా తీసిపారేసేది కాదు. తోటి విద్యార్థిని కాపాడుకోవటం కోసం పోలీసు బలగాలకు ఎదురొడ్డిన జామియా విద్యార్థినులు లదీదా ఫర్జానా, అయేషా రేనానా, మతోన్మాద గుండాల దాడిలో నెత్తురు ముద్దైన జవహర్లాల్‌ ‌యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషే ఘోష్‌…ఇం‌కా పోలీసుల లాఠీచార్జీలకు, ‘గోలీమారో సాలోంకో’ అని హూంకరిస్తున్న మతోన్మాద ప్రజాప్రతినిధులకు ఎదురొడ్డి నిలుస్తున్న లక్షలాది మంది విద్యార్థులు ఈదేశ గమనాన్ని దివిటీలై నిర్దేసిస్తున్నారు. తెలంగాణా దీనికి మినహాయింపు కాదు, కాకూడదని తేల్చి చెబుతూ నిర్బంధాల నెదిరిస్తూ, దళిత ముస్లిం మహిళా, ట్రాన్స్ ‌జెండర్‌, ‌విద్యార్థి సమూహాల సమాహారంగా ముందుకు సాగుతున్నాయి.

Tags: A collection, Dalit Muslim women, transgender ,student groups

Leave a Reply