Take a fresh look at your lifestyle.

భారతదేశం కోసం ఓ బడ్జెట్‌ …

ఈ ఏడాది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ప్రభుత్వం వరుసగా 11వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈసారి అసాధారణ పరిస్థితుల నడుమ తాజా బడ్జెట్‌ ‌రాబోతోంది. ఈ మేరకు తీవ్రస్థాయిలో విభజితమైన ప్రపంచం మునుపెన్నడూ లేని రీతిలో ఆర్థిక సవాళ్లతోనే కాకుండా అదనంగా వాతావరణ మార్పు సమస్యతో సతమతమవుతోంది. ఇక వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు  నేపథ్యంలో ఇది చివరి సాధారణ బడ్జెట్‌ ‌కూడా కావడం గమనార్హం.

కోవిడ్‌-19 ‌మహమ్మారి 2020లో విజృంభించినప్పటి నుంచి ప్రపంచం ఎన్నడూలేనంత తీవ్రంగా పదేపదే కుదుపులకు గురైంది. ఇక రష్యా-ఉక్రెయిన్‌ ‌వివాదం, అమెరికాలో ఫెడరల్‌ ‌రిజర్వ్ ‌వడ్డీరేట్ల పెంపుతోపాటు కోవిడ్‌-19 ‌మహమ్మారి ఇటీవల ఉప్పెనలా చైనాను కమ్ముకుంది. మహమ్మారి, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, హరించుకుపోతున్న ప్రపంచ ద్రవ్యత్వం, వస్తుధరల దెబ్బ వగైరాల ప్రభావం కలగలసి ప్రపంచాన్ని ప్రమాదకర మాంద్యం అంచులకు నెట్టింది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాసహా అగ్రదేశాలకూ ఈ ముప్పు తప్పలేదు. అయినప్పటికీ మన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక శుభవార్త సంతోషం కలిగిస్తుంది. అదేమిటంటే- అనేక సవాళ్లు ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలోనూ 2022-23లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఆకట్టుకునే రీతిలో 6.5 నుంచి 7 శాతం వృద్ధిని నమోదు చేయనుండటమే. ఇక 2014లో ‘ఎన్‌డిఎ’ అధికారం చేపట్టిన నాటినుంచి అనుసరిస్తున్న విధాన నిర్దేశక సూత్రావళి చాలావరకూ సానుకూల ఫలితాలిచ్చిందని ఆర్థిక మంత్రి విశ్వసించడానికీ తగిన కారణం ఉంది.

కొత్త విధాన నిర్దేశక సూత్రావళి
తొమ్మిదేళ్ల కిందట ‘ఎన్‌డిఎ’ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు శ్రమించింది. ఈ మేరకు చేపట్టిన విధాన మార్పులు ఇటీవల గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ‌బ్యాంకులు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి వ్యవస్థల నుంచి ప్రశంసంలు అందుకోవడమేగాక నిర్ధారించబడ్డాయి. ఈ దిశగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలుకు శ్రీకారం చుట్టడంతో తొలి అడుగు పడింది. ఈ ఏకైక అతిపెద్ద పరోక్ష పన్ను సంస్కరణ తొలిసారిగా దేశాన్ని ఆర్థిక ఏకీకరణవైపు నడిపించింది. ‘ఒకే దేశం-ఒకే పన్ను’ అనే ‘జీఎస్టీ’ సూత్రం ఘర్షణను నాటకీయంగా తగ్గించి, ఆర్థిక వ్యవస్థను మరింత సమర్థం చేసింది. నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు సగటున రూ.1 లక్ష కోట్లకుపైగా ఉండటంలో ఇప్పుడు ఆశ్చర్యమేమీ లేదు. ఈ నేపథ్యంలో నిరుడు నవంబర్‌లో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్లు జమ కావడం ఇందుకు ఒక ఉదాహరణ.

ప్రైవేట్‌ ‌రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం, పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ‌పన్నును ప్రస్తుత 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతోపాటు 2019 తర్వాత విలీనమైన కంపెనీలకు 15 శాతంగా నిర్ణయించింది. ఈ పథకం 2023 వరకు పొడిగించబడింది. అదేవిధంగా 2016లో ఆర్థిక అశక్తత-దివాలా  స్మృతి (ఐబీసీ)ని  ఆమోదించి, వాణిజ్య బ్యాంకుల వారసత్వ మొండి బకాయిల తగ్గింపులో తోడ్పడింది. ఇక 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం ఆర్థిక రుణదాతలు 2021 సెప్టెంబర్‌ 30‌నాటికి బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.7.94 లక్షల కోట్ల రుణంలో రూ.2.55 లక్షల కోట్లను రాబట్టారు. ఆర్థిక రంగానికి ఈ మరమ్మతులలో బ్యాంకుల ఆస్తి-అప్పుల ఖాతాల మూలధనీకరణ కూడా ఉంది. దీంతో వాణిజ్య బ్యాంకుల రుణ ప్రదాన సామర్థ్యం కూడా పునరుద్ధరించబడింది.

ప్రైవేటీకరణ విధానాన్ని అధికారికం చేసిన తర్వాత కూడా ఒక ప్రధాన సైద్ధాంతిక క్రమం పునరుద్ధరణను ‘ఎన్‌డిఎ’ చేపట్టింది. ఎయిర్‌ ఇం‌డియాను టాటా సంస్థకు విక్రయించడం ఇందుకు తాజా ఉదాహరణ. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం భారీ హరిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణ దిశగా ప్రభుత్వరంగ యాజమాన్యంలోని నిరర్థక ఆస్తుల ద్రవ్యీకరణ పక్రియను చేపట్టింది. ప్రైవేట్‌ ‌పెట్టుబడిని ఆకర్షించడం ఇందులోని అంతర్లీన వ్యూహం. ఆర్థిక వివేచన, ఆర్థిక వనరుల సౌలభ్యం సాధించడం, పన్ను వసూళ్లలో ముందంజ వంటి చర్యలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతోపాటు కోవిడ్‌-19 ఉపశమన ప్యాకేజీలకు నిధులు సమకూర్చుకునే దిశగా ఆర్థికశాఖ మంత్రికి శక్తినిచ్చాయి. మరీ ముఖ్యంగా- మహమ్మారి విసిరిన ఆర్థిక వినాశం సవాలును ఎదుర్కొనే దిశగా ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఈ నిర్మాణాత్మక సంస్కరణలు వెసులుబాటు కల్పించాయని రుజువైంది.

ప్రభుత్వ డిజిటల్‌ ‌సరంజామా
గడచిన దశాబ్ద కాలంలో ‘‘ఆధార్‌, ఏకీకృత చెల్లింపుల వేదిక (యూపీఐ), కో-విన్‌, ‌డిజిటల్‌ ‌వాణిజ్యం కోసం సార్వత్రిక నెట్‌వర్క్ (ఓఎన్‌డీసీ), ఖాతా సమాచార ప్రదాతలు (అగ్రిగేటర్లు), ఆరోగ్య సరంజామా (హెల్త్ ‌స్టాక్‌) ‌సార్వత్రిక జమకు వీలిచ్చే నెట్‌వర్క్’’ (ఓసీఈఎన్‌) ‌వంటి ప్రభుత్వ డిజిటల్‌ ‌సరంజామా (డీపీజీ)  వేగంగా అమలులోకి రావడం వల్ల కూడా భారత ఆర్థిక వ్యవస్థకు అనూహ్య ప్రోత్సాహం లభించింది. ఈ ‘డీపీజీ’లతో సార్వత్రిక డిజిటల్‌ ‌పర్యావరణ వ్యవస్థ సృష్టించబడింది. ప్రైవేటు రంగం చెల్లింపులు, ఆరోగ్య సంరక్షణ వగైరాలలో సృజనాత్మక ఆవిష్కరణలు తెచ్చేందుకు ఇది బాటలు పరచింది. అంతేకాకుండా ప్రవేశ వ్యయం కూడా గణనీయంగా తగ్గింది. ఆ విధంగా ఆర్థిక వ్యవస్థ సాధికారత సాధించడాన్ని వేగిరపరచిన ఈ డీపీజీలు గుర్తింపు లభ్యతను ప్రజాస్వామ్యీకరించాయి. అంతేగాక కోవిడ్‌ ‌టీకాలు, చెల్లింపులు, రుణాలు, తాజాగా ఎలక్ట్రానిక్‌ ‌వాణిజ్యం ముందడుగుకూ ఇతోధికంగా ఉపయోగపడ్డాయి. ఈ ప్రభుత్వ ‘డీపీజీ’లు వేసిన బాటను కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష లబ్ధి బదిలీని వేగవంతం చేయడానికి సమర్థంగా వాడుకుంది. ఈ మొత్తం రూ.25 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఫలితంగా దళారీ వ్యవస్థ అంతమై, దుర్వినియోగం తగ్గి, ఖజానాకు రూ.2 లక్షల కోట్లకుపైగా ఆదా అయింది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు ఆవల ఉండిపోయిన లబ్ధిదారులు కీలక భాగస్వాములుగా మారారు.

మహమ్మారి కష్టాలు
కోవిడ్‌-19 ‌మహమ్మారి విజృంభణ, తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దిగ్బంధంతో మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జన జీవితాలు అతలాకుతలమై జీవనోపాధికి తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయి. అయితే, ఇతర దేశాల తరహాలో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు భారత్‌ ఆర్థిక ఉద్దీపనకు బదులుగా ఓ క్రమాంకన వ్యూహాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా తొలుత ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యమిచ్చి, క్రమంగా జీవనోపాధి కల్పనపై దృష్టి సారించింది. ఈ మేరకు 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ పథకాన్ని అమలు చేసింది. తద్వారా దుర్బల వర్గాల భౌతిక మనుగడకు ఊతమిస్తూ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని తాజాగా 2023 డిసెంబర్‌ ‌వరకూ పొడిగించింది.

ఈ అసాధారణ సామాజిక భద్రతా వలయం అందరికీ విద్యుత్తు, తాగునీరు, పారిశుధ్యం, గృహవసతి కల్పనకు పెద్దపీట వేసింది. తద్వారా వ్యవస్థలో అట్టడుగున ఉన్న పేదల కష్టనష్టాలు తగ్గించడంలో విజయవంతమైంది. నిర్మాణాత్మక సంస్కరణలు ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేశాయి. కనీవినీ ఎరుగని మొండి బకాయిలతో బ్యాంకింగ్‌ ‌రంగానికి వాటిల్లిన నష్టాన్ని భర్తీచేసే కృషిలో భారత ఆర్థిక వ్యవస్థ నిమగ్నమైనందున సంస్కరణల సంపూర్ణ ప్రభావం ఇంకా ప్రస్ఫుటం కాలేదు. మరోవైపు మహమ్మారితో మొదలైన వరుస ఎదురుదెబ్బలు కోలుకునే పక్రియను మందగింపజేశాయి. ఏది ఏమైనప్పటికీ జీవితకాలంలో ఒకసారి ముంచుకొచ్చే ఇలాంటి దుష్ప్రభావం నెమ్మదిగా క్షీణిస్తూండటంతో పుంజుకోవడానికి సిద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది బడ్జెట్‌కు ఆరోగ్యకరమైన నేపథ్యాన్ని ఏర్పరుస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. తదుపరి కర్తవ్యం ఇక ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌గారిదే!

– అనిల్‌ ‌పద్మనాభన్‌
‌క్యాపిటల్‌ ‌కాలుక్యులస్‌ (మీ•‌జూఱ••శ్రీ మీ•శ్రీమీబశ్రీబ) ట్వీట్లు చేసే స్వేచ్ఛా పాత్రికేయులు
.

Leave a Reply