- ఢిల్లీలో అత్యధికంగా 263 నమోదు
- కేసుల పెరుగుదలతో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు
న్యూ దిల్లీ, డిసెంబర్ 30 : దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కొరోనా పాజిటీవ్ కేసులు కూడా పెరుగుతుండడం ఆందోళన కల్గిస్తుంది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్నాయి. గురువారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 127 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 320మంది కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా ఢిల్లీలో 263 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా..మహారాష్ట్రలో 252 కేరళలో 69, తెలంగాణలో 62, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 46, తమిళనాడులో 34, కర్నాటకలో 34, ఆంధప్రదేశ్‌లో 16 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,154 కొరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. కొరోనాతో మరో 268మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. బుధవారంతో పోలిస్తే నాలుగు వేల కేసులు అధికంగా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కొరోనా కేసుల సంఖ్య 3.47కోట్లు దాటింది.
ఇక కొరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,80,860మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొరోనా నుంచి 7,486 మంది కోలుకోగా..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 82,402 కొరోనా యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 143.15 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది. కొరోనా దాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలు అతాలకుతలమవుతున్నాయి. ఇప్పడిప్పుడే డెల్టా వేరియంట్ భారత్‌లో తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో మరోసారి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో రోజురోజు మరోసారి కోవిడ్ విజృంభణ పెరుగుతుంది. గత వారం వరకు 7వేల లోపు నమోదైన కొరోనా కేసులు ఇప్పటి రెట్టింపుగా నమోదవు తున్నాయి. దేశంలో ప్రస్తుతం 82,402 కొరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ కూడా భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తుంది. తాజా జినోమ్ సీక్వెన్సింగ్ నివేదిక ప్రకారం ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 46 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌కి చెందినవేనని సత్యేంద్రర్ జైన్ తెలిపారు.