Take a fresh look at your lifestyle.

8 ‌బిలియన్లున్న సంపద..8 ఏళ్లలో140 బిలియన్‌ ‌డాలర్లు ఎలా అయ్యింది…?

  • ప్రతీ వ్యాపారంలోనూ ఆయన విజయ రహస్యం ఏమిటి
  • అనుభవం లేకున్నా డిఫెన్స్ ‌కాంట్రాక్ట్‌లు ఎలా అప్పగించారు
  • నిబంధనలు మార్చి ముంబయి సహా ఆరు విమానాశ్రయాలు ఎలా కట్టబెటారు
  • భారత్‌ ‌జోడో యాత్రలో దేశ వ్యాప్తంగా ప్రజలు నన్ను ఈ ప్రశ్నలే అడిగారు
  • అదానీ వ్యవహారంపై లోక్‌సభలో ప్రధాని మోదీని నిలదీసిన కాంగ్రెస్‌ ఎం‌పి రాహుల్‌ ‌గాంధీ
  • మోదీకి అదానీతో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్‌
  • ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనల నుంచి వొచ్చిందే అగ్నివీర్‌ ‌పథకమని ఆరోపణ
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 07 : హిండెన్‌ ‌బర్గ్ ‌నివేదిక, స్టాక్‌ ‌మార్కెట్లలో ఒక్కసారిగా అదాని గ్రూపు కంపెనీ షేర్లు కుప్పకూలిన నేపథ్యంలో పారిశ్రామిక దిగ్గజం గౌతమ్‌ అదానీ వ్యవహారంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ గట్టిగా నిలదీశారు. మోదీకీ అదానీతో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని డిమాండ్‌ ‌చేశారు. ఇటీవల తాను నిర్వహించిన భారత్‌ ‌జోడో యాత్రలో కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు ఒకే ఒక వ్యాపారవేత్త పేరు వినిపించిందని, అది గౌతమ్‌ అదానీ పేరేనని చెప్పారు. మోదీ-అదానీ కలిసి ఉన్న ఓ ఫొటోను ఈ సందర్భంగా రాహుల్‌ ‌లోక్‌సభలో ప్రదర్శించారు. మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్‌ ‌మాట్లాడుతూ…తమిళనాడు, కేరళ నుంచి హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌వరకు తనకు ఒక్క అదానీ పేరే దేశవ్యాప్తంగా వినిపించిందన్నారు. ఎక్కడ చూసినా అదానీ, అదానీ, అదానీ అన్నారు. ‘‘అదానీ ఏ వ్యాపారంలోకి అయినా ప్రవేశిస్తారు. ఆయన ఎన్నడూ విఫలమవరు’’ అని ప్రజలు తనతో చెప్పారన్నారు.
ప్రతి వ్యాపారంలోనూ ఆయన ఏ విధంగా విజయం సాధిస్తున్నారు? ఆయన ఎన్నడూ ఎందుకు విఫలమవడం లేదు? ఏమిటి ఈ సంబంధం? అని వారు తనను అడిగారన్నారు. ఈ సందర్భంగా మోదీ, అదానీ ఓ విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపించే ఫొటోను ప్రదర్శించగా లోక్‌సభ సభాపతి ఓమ్‌ ‌బిర్లా జోక్యం చేసుకుని, ఇటువంటి పోస్టర్లు సభ గౌరవానికి తగినవి కాదన్నారు. దీనిపై రాహుల్‌ ‌స్పందిస్తూ, ఇది కేవలం ఓ ఫొటో అని, పోస్టర్‌ ‌కాదని జవాబిచ్చారు. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ ‌లిమిటెడ్‌ ‌విషయంలో రాజకీయాలు చేస్తున్నారని మోదీ ఆరోపించారని, అయితే అదానీకి కాంట్రాక్టులు ఇచ్చారనేది నిజమని చెప్పారు. రక్షణ రంగంలో అదానీకి అనుభవం లేకపోయినా నాలుగు డిఫెన్స్ ‌కాంట్రాక్టులను అప్పగించారన్నారు. అదానీ ఎన్నడూ డ్రోన్లను తయారు చేయలేదని, హెచ్‌ఏఎల్‌ ‌వాటిని తయారు చేసిందని చెప్పారు. అయినప్పటికీ మోదీ ఇజ్రాయెల్‌ ‌వెళ్లిన తర్వాత, అదానీకి కాంట్రాక్టు దక్కిందని అన్నారు. ఒకప్పుడు అదానీ విమానంలో మోదీ ప్రయాణించేవారని, ఇప్పుడు మోదీ విమానంలో అదానీ ప్రయాణిస్తున్నారని ఆరోపించారు.
ఈ విషయం అంతకు ముందు గుజరాత్‌కు సంబంధించినదని, ఆ తర్వాత భారత దేశానికి సంబంధించినది అయిందని, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందని అన్నారు. 2014లో 8 బిలియన్‌ ‌డాలర్లున్న అదానీ నికర విలువ 2022 కల్లా 140 బిలియన్లు ఎలా అయ్యిందని కూడా ప్రజలు తనను అడిగారని రాహుల్‌ అన్నారు. కశ్మీర్‌ ‌యాపిల్స్ ‌నుంచి పోర్టులు, ఎయిర్‌ ‌పోర్టులు, రోడ్ల వరకు అన్ని ప్రాజెక్టులను చేపట్టే సత్తా కేవలం అదానీకి  మాత్రమే ఉందని రాహుల్‌ ‌సటైర్‌ ‌వేశారు. ప్రధాని, అదానీ మధ్య బంధం ఈ నాటిది కాదన్న రాహుల్‌… ‌మోడీ గుజరాత్‌ ‌సీఎంగా ఉన్న నాటి వారు ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని అన్నారు. 2014లో మోడీ దిల్లీ పీఠం ఎక్కడం వెనుక అదానీ ఉన్నారని ఆరోపించారు. ఇక అదానీ గ్రూప్‌ ఎయిర్‌పోర్ట్ ‌వ్యాపారం గురించి మాట్లాడుతూ…విమానాశ్రయాల్లో ముందస్తు అనుభవం లేని వారు విమానాశ్రయాల అభివృద్ధిలో పాల్గొనకూడదని ఒక నియమం ఉందని, ఈ నిబంధనను మార్చి భారత ప్రభుత్వం అదానీకి ఆరు విమానాశ్రయాలు ఇచ్చిందని అన్నారు.
దేశంలోనే అత్యంత లాభదాయకమైన విమానాశ్రయమైన ముంబయి విమానాశ్రయం జివికె నుంచి సిబిఐ, ఇడి వంటి ఏజెన్సీలను ఉపయోగించి హైజాక్‌ ‌చేసి ప్రభుత్వం అదానీకి ఇచ్చిందని రాహుల్‌ అన్నారు. గడచిన ఇరవయ్యేళ్ళలో బీజేపీకి అదానీ ఎంత సొమ్ము ఇచ్చారని, ఎలక్టొరల్‌ ‌బాండ్ల ద్వారా ఎంత ముట్టజెప్పారని ప్రశ్నించారు. 2022లో శ్రీలంక పార్లమెంటరీ కమిటీతో ఆ దేశ విద్యుత్తు బోర్డు చైర్మన్‌ ‌మాట్లాడుతూ, విండ్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్టును అదానీకి ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్స చెప్పినట్లు తెలిపారన్నారు. ఇది భారత దేశ విదేశాంగ విధానం కాదని, ఇది కేవలం అదానీ వ్యాపారం కోసం విధానమని మండిపడ్డారు. ప్రధాని మోదీ ఆస్ట్రేలియా వెళ్తారని, మాయ చేసినట్లు ఎస్‌బిఐ అదానీకి 1 బిలియన్‌ ‌డాలర్లు రుణం ఇస్తుందని అన్నారు. ఆ తర్వాత మోదీ బంగ్లాదేశ్‌ ‌వెళ్తారని, అదానీతో బంగ్లాదేశ్‌ ‌పవర్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌బోర్డ్ 25 ఏళ్ళ కాంట్రాక్టు కుదుర్చుకుంటుందని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనల నుంచి వొచ్చిందే అగ్నివీర్‌ ‌పథకం
రక్షణ దళాల్లో అగ్నివీరుల నియామక పథకంపై రాహుల్‌ ‌గాంధీ మాట్లాడుతూ…ఈ పథకం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆలోచనల నుంచి వొచ్చిందని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు తనతో చెప్పారన్నారు. ఆయుధాలను ఉపయోగించడంలో వేలాది మందికి శిక్షణ ఇస్తున్నామని, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న సమయంలో వారు సాధారణ పౌరులుగా సమాజంలోకి వొస్తున్నారని వారు చెప్పారన్నారు. ఈ ఆలోచన వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ఉన్నారని కూడా వారు చెప్పారన్నారు. అగ్నివీర్‌ ‌యోజన గురించి రాష్ట్రపతి ప్రసంగంలో కేవలం ఒకసారి మాత్రమే ఎలా ప్రస్తావించారని నిలదీశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి రాష్ట్రపతి ప్రసంగంలో లేవన్నారు. భారత్‌ ‌జోడో యాత్రలో ప్రజలు తనకు చెప్పిన సమస్యలేవీ రాష్ట్రపతి ప్రసంగంలో కనిపించలేదన్నారు.

Leave a Reply