Take a fresh look at your lifestyle.

లిటిల్ బాయ్ మరియు ఫ్యాట్ మ్యాన్ కి 75 ఏండ్లు

అది 1945 అగస్ట్ 6 ఆకాశంలో ఏదో వస్తువు ఒక పుట్టగొడుగు ఆకారంలో కనిపించింది, క్షణాలలో ఉపద్రవం ముంచుకొచ్చింది, భూమి కంపించడం, ఎక్కడ చూసిన హాహాకారాలు , శవాల గుట్టలు , ప్రాణాలతో ఉన్న వారిలో కొంతమంది ముఖం నుంచి చర్మం ఊడిపోగా, ఇంకొంతమంది చేతులు విరిగిపోయి శరీరానికి వేలాడుతున్నాయి. కొంతమంది చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. అవయవాలు పనిచేయడం ఆగిపోయాయి , అందరి నోటి నుంచి ఒకే మాట వస్తోంది. దాహం’,నీళ్లు.. నీళ్లు కావాలి. శత్రువులు సైతం కన్నీరు పెట్టారంటే ఆ ప్రళయాన్ని ఊహించుకోవచ్చు. ఆ ప్రళయానికే, నేటికీ 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1945 సంవత్సరం వస్తూ వస్తూనే జపాన్‌లో సామాన్యుల జీవితాలను నరకప్రాయం చేసింది. రోడ్లపై ఎక్కడా సొంత కార్లు పరుగులు తీస్తూ కనిపించేవి కావు. హిరోషిమా రహదారుల్లో ఎక్కడచూసినా సైకిళ్లలో, కాలినడకన వెళ్లే జనం, సైనికుల వాహనాలే కనిపించేవి. యుద్ధం చివరి ఏడాదిలో మిత్రరాజ్యాలు జపానును ఆక్రమించుకునేందుకు సిద్ధపడ్డాయి. దీనికి ముందు అమెరికా సాంప్రదాయక బాంబుదాడులు చేసి 67 జపాన్ నగరాలను ధ్వంసం చేసింది. 1945 మే 8 న, హిట్లరు ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకు, జర్మనీ లొంగుబాటు ఒప్పందంపై సంతకం చెయ్యడంతో ఐరోపాలో యుద్ధం ముగిసింది. ఓటమి తప్పనిస్థితిలో ఉన్న జపాను బేషరతు లొంగుబాటుకు ఒప్పుకోకపోవడంతో పసిఫిక్ యుద్ధం కొనసాగింది. జపాను బేషరతుగా లొంగిపోవాలని 1945 జూలై 26 న అమెరికా మిత్ర రాజ్యాలు తమ పోట్స్‌డామ్ డిక్లరేషనులో ప్రకటించాయి. లేదంటే పెను వినాశనమేనని కూడా డిక్లరేషనులో హెచ్చరించింది. అయితే జపాను దాన్ని పెడచెవిన పెట్టడంతో, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మద్దతు తీసుకొని , రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో,జపాన్ నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై రెండు అణుబాంబు దాడులు చేయడం జరిగింది.

Little Boy' almost certain, not the case with 'Fat Man

1945 ఆగస్టు నాటికి మన్‌హట్టన్ ప్రాజెక్టు రెండు రకాల అణుబాంబులు తయారు చేసింది. మారియానా ద్వీపాల్లోని టినియన్ నుండి ఈ బాంబులను మోసుకెళ్ళేందుకు అమెరికా వైమానిక దళం బోయింగ్ B-29 సూపర్‌ఫోర్ట్రెస్‌ను సమకూర్చుకుంది. నాలుగు జపాను నగరాల మీద అణుబాంబులు వెయ్యాలని జూలై 25 న ఆదేశాలు జారీ అయ్యాయి. 1945 అగస్ట్, 6 ఉదయం 7 గంటలకు దక్షిణం వైపు నుంచి వస్తున్న అమెరికా విమానాలను రాడార్లు పసిగట్టాయి. చెవులు చిల్లులు పడేలా హెచ్చరిక సైరన్ మోగింది. జపాన్ అంతటా రేడియో కార్యక్రమాలను నిలిపివేశారు.హీరోషిమాపై పడిన లిటిల్ బాయ్(బాంబు పేరు) సరిగ్గా 8 గంటల 15 నిమిషాలకు ‘ఎనోలా గే’ నుంచి బయటకు వచ్చిన లిటిల్ బాయ్ హిరోషిమా మీద పడడం మొదలైంది. ‘ఎనోలా గే’ నుంచి లిటిల్ బాయ్ కిందకు రావడానికి 43 సెకన్లు పట్టింది. గాలులు వేగంగా వీస్తుండడంతో అది తన లక్ష్యం ఏఓఐ బ్రిడ్జికి 250 మీటర్ల దూరంలో ఉన్న షీమా సర్జికల్ క్లినిక్ పైన పడింది. అది పేలినపుడు ఆ శక్తి 12,500 టన్నుల టీఎంటీతో సమానంగా ఉంది. ఆ ఉష్ణోగ్రత హఠాత్తుగా 10 లక్షల సెంటీగ్రేడ్‌కు చేరింది. ‘ద గ్రేట్ ఆర్టిస్ట్’‌లో ఉన్న పైలెట్ మేజర్ చార్లెస్ స్వీనీ పైనుంచి చూసినపుడు విశాలంగా ఉన్న ఒక అగ్నిగోళం ఏర్పడడం కనిపించింది.

ఒకే ఒక్క క్షణంలో నగరంలోని కాంక్రీట్ భవనాలు తప్ప భూమిపై వస్తువులన్నీ మాయమైపోయాయి. విస్ఫోటనం తీవ్రతతో గ్రౌండ్ జీరో నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని భవనాల కిటికీ అద్దాలూ ముక్కలైపోయాయి. హిరోషిమా నగరంలో రెండు వంతుల భవనాలు ఒక్క క్షణంలోనే ధ్వంసమయ్యాయి. కొన్ని కిలోమీటర్ల వరకూ మంటలు తుఫానులా వ్యాపించాయి. ఒక్క క్షణంలోనే నగరంలోని రెండున్నర లక్షల జనాభాలో 30 శాతం మంది అంటే 80 వేల మందిని మృత్యువు బలి తీసుకుంది. ఇప్పటికైనా ,లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు జపానుకు చెప్పాడు. లేదంటే “చరిత్రలో ఎన్నడూ చూడని వినాశనం ఆకాశం నుండి వర్షిస్తుందని” హెచ్చరించాడు. అయినా కూడా జపాన్ పట్టువిడవకపోవడంతో, మూడు రోజుల తర్వాత అంటే,1945 ఆగస్టు 9 న మధ్యాహ్నం జపాన్‌లోని మరో నగరం అయిన నాగసాకి పై బీ-29 బాంబర్లు ,రెండో ఆటం బాంబు ఐన ఫ్యాట్ మ్యాన్ ని జార విడిచాయి. అది కిందకు చేరడానికి 43 సెకన్లు పట్టింది. బాంబు విస్ఫోటనంతో కిలోమీటర్ పరిధిలో ప్రతి వస్తువూ ధ్వంసమైపోయింది.

అప్పుడు వెలువడిన, ఉష్ణ కిరణాలు మనుషుల శరీరంలోని ప్రతి నీటిబొట్టునూ ఆవిరి చేశాయి. క్షణంలోనే చాలా మంది చనిపోయారు, జంతువులు మాడిపోయాయి. పేలుడు తీవ్రతకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల అద్దాలు కూడా ముక్కలైపోయాయి. విస్ఫోటనంతో ఎగసిన వెలుగు కొన్ని సెకన్లే ఉన్నా, దానివల్ల ఏర్పడిన వేడి చర్మం పై థర్డ్ డిగ్రీ బర్న్స్ వచ్చేలా కాల్చేసింది. బాంబు పడిన ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో షిరోయామా ప్రైమరీ స్కూల్లో కాంక్రీట్ స్తంభాలు తప్ప వేరే ఏం మిగల్లేదు రెండు నుండి నాలుగు నెలల్లో హిరోషిమాలో 90,000 నుండి146,000 మంది వరకు, నాగసాకిలో 39,000 నుండి 80,000 మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో దాదాపు సగం మంది మొదటిరోజునే మరణించారు. ఆ తరువాతి నెలల్లో కాలిన గాయాల వలన, రేడియేషన్ సిక్‌నెస్ వలన,ఇతర గాయాల వలన,పౌష్టికాహార లోపంతో కూడి అనేక మంది మరణించారు. మరణించినవారిలో ఎక్కువమంది సాధారణ పౌరులే. మానవ చరిత్రలో అణ్వాయుధ దాడులు జరిగినది ఈ రెండు సంఘటనల్లో మాత్రమే. నాగసాకిలో బాంబు వేసిన ఆరు రోజుల తరువాత జపాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబరు 2 న లొంగుబాటు పత్రంపై జపాను ప్రభుత్వం సంతకం చేసింది. దాంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. రెండు లక్షలకు పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అణుదాడుల నైతికత నేటికీ చర్చనీయాంశమే.

dr md quazaidin
డా।। ఎండి ఖ్వాజామొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫై•నాన్స్

Leave a Reply