- ఆక్సిజన్ అందకనే అంటున్న బాధిత కుటుంబాలు
- ఆక్సిజన్ సరఫరాలో లోపాలని ప్రభుత్వ వివరణ
- తక్షణం నివేది క ఇవ్వాలని హైకోర్టు బెంచి ఆదేశం
కొరోనా సెకండ్ వేవ్ ఎంతటి దారుణాలకు దారితీస్తుందో చెప్పేందుకు గోవా మెడికల్ హాస్పిటల్ ఒక ఉదాహరణగా నిలచింది. రాష్ట్రంలోనే అతిపెద్ద కొవిడ్ కేంద్రమైన ఇది యమకూపాన్ని తలపిస్తోంది. గత నాలుగు రోజుల్లో ఇక్కడ ఏకంగా 74 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఆక్సిజన్ అందకనే వీరంతా మృత్యువాత పడ్డారు. ’క్రిటికల్ డార్క్ అవర్స్’ అయిన శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ఉదయం ఆరు గంటల మధ్య 13 మంది కొవిడ్ రోగుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గురువారం కూడా దాదాపు అదే సమయంలో 15 మంది మృత్యువాత పడ్డారు.
అంతకుముందు రోజు అంటే బుధవారం 20 మంది, దానికి ముందు రోజు మంగళవారం 26 మంది చికిత్స కోసం హాస్పిటల్ లో చేరి అటునుంచి అటే వెళ్లిపోయారు. ఆక్సిజన్ ట్రాలీలను తీసుకెళ్లే ట్రాక్టర్‌కు సంబంధించి లాజిస్టిక్ సమస్యలు, మానిఫోల్డ్తో సిలిండర్లను అనుసంధానించడంలో సమస్యల కారణంగా మరణాలు సంభవిస్తున్నట్టు బాంబే హైకోర్టులోని గోవా బెంచ్‌కు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే, ఇలాంటి సమస్యలతో కొవిడ్ రోగులు చనిపోవడానికి వీల్లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్సిజన్ సరఫరా, అందుబాటులో ఉన్న ట్యాకర్లు, కాన్సంట్రేటర్లు, డ్రైవర్స్‌తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం హాస్పిటల్ ని సందర్శించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ మెడికల్ ఆక్సిజన్ లభ్యత, దాని సరఫరాలో కొన్ని లోపాలు ఉన్నట్టు చెప్పారు. కొవిడ్ రోగుల మరణాలకు అవే కారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు. కాగా, 48.1 శాతం పాజిటివిటీ రేటుతో దేశంలోనే గోవా ముందుంది. గోవాలో కొరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. అక్కడ సగటున రెండు పరీక్షల్లో ఒకటి పాజిటివ్‌గా వస్తోంది. ఇదిలా ఉంటే.. ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
మొత్తం నాలుగు రోజుల్లో 74 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్ సిలిండర్ల రవాణాలో ఎదురైన కొన్ని సమస్యల కారణంగానే ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఆక్సిజన్ కొరతతో చోటు చేసుకుంటున్న మరణాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు విచారణ జరుపుతోంది. కోర్టులో విచారణ జరుగుతుండగానే.. జీఎంసీహెచ్‌లో హాస్పిటల్ కి ఆక్సిజన్ సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఓ కమిటీ ఏర్పాటు చేసింది.