Take a fresh look at your lifestyle.

ఆపరేషన్‌ ‌పోలోకు 72 ఏండ్లు

రైతులు పండించిన పంటలు దక్కకుండా చేయడం, నాడు వేలమంది మహిళలు మానభంగాలకు గురవడం, హిందూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించడం, గోళ్ళ కింద గుండుసూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసి. సిగరెట్లతో కాల్చడం, బొటనవేళ్లకు తాళ్ళు కట్టి తలకిందులుగా వేలాడదీత,చెవులకు బరువులు కట్టడం, ఛాతీపై పెద్దబండలు పెట్టడం, కాగే నూనెలో వేళ్లు ముంచడం ,ముక్కుపిండి పన్నులు వసూలుచేయడం లాంటి ఎన్నో దురాగతాలు మానవరక్తాన్ని తాగే రాకాసి మూకలైన రజాకార్ల కాలం లో జరిగాయి. హైదరాబాదు సంస్థానాధీశుడు ఏడవ నిజాం నవాబు ఉస్మాన్‌ ఆలీ ఖాన్‌ ‌నుంచి విముక్తి కోసం సంస్థాన ప్రజలు 1946 నుంచి 1948 మధ్య వీరోచిత పోరాటం చేశారు. దీన్నే తెలంగాణ విమోచనోద్యమంగా పిలుస్తారు. రెండు వందల సంవత్సరాల దోపిడి, అణిచివేతకు నలభై ఏడు సంవత్సరాల తిరుగుబాటు, సాయుధపోరాటం ఒక దశ మాత్రమే. వివిధ సంఘాల, పార్టీల, ప్రజాస్వామికవాదుల, రచయితల, ప్రజల సంఘటిత క్రమ-పరిణామపోరాటమది. హైదరాబాదు సంస్థానంలో ప్రస్తుత తెలంగాణాతో పాటు మరాఠ్వాడ (మహారాష్ట్ర), బీదర్‌ (‌కర్ణాటక) ప్రాంతాలు ఉండేవి. 3 భాషా ప్రాంతాలకు చెందిన మొత్తం 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణా ప్రాంతానికి చెందినవి కాగా, మరాఠా, కన్నడ ప్రాంతాలకు చెందినవి 8 జిల్లాలుండేవి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిననూ నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం లేకపోవడాన్ని ఇక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దేశమంతటా స్వాతంత్య్రోత్సవాలతో ప్రజలు ఆనందంతో గడుపుచుండగా నిజాం సంస్థాన ప్రజలు మాత్రం నిరంకుశ బానిసత్వంలో కూరుకుపోయారు. హైదరాబాదు రాజ్యాన్ని పాలిస్తున్న ఏడవ నిజామ్‌ ‌మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ ‌రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ రజాకార్లను ఉసిగొల్పాడు. నిజాంకు అండగా ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు గ్రామాలపైబడి దోపిడిచేయడం, ఇండ్లు తగలబెట్టడం, నానా అరాచకాలు సృష్టించారు. అతని మతోన్మాద చర్యలు కోరలాల్చి వెయ్యి నాల్కలతో విషంకక్కాయి. హీనమైన బతుకులు వెళ్ళదీస్తున్న జనం గురించి అస్సలు పట్టించుకోకుండా ప్రజల నుండి బలవంతంగా వసూలుచేసుకున్న సొమ్ముతో విలాసాలు, జల్సాలు, భోగభాగ్యాలు చేసుకొనేవారు. దీనితో రామానందతీర్థ నేతృత్వంలో ఆర్యసమాజ్‌ ఉద్యమాలు, కమ్యూనిష్టుల ఆధ్వర్యంలో సాయుధపోరాటాలు ఉధృతమయ్యాయి. మొదట నల్గొండ జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం శరవేగంగా నైజాం సంస్థానం అంతటా విస్తరించింది.

నిజాం సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్యకు ఆపరేషన్‌ ‌పోలో అని పేరు. జనరల్‌ ‌జె.ఎన్‌.‌చౌదరి నేతృత్వంలో 1948 సెప్టెంబర్‌ 13‌న సైనిక చర్య మొదలైంది. సైన్యం రెండు భాగాలుగా విడిపోయి విజయవాడ నుంచి ఒకటి, బీదర్‌ ‌దిశగా రెండోది కలిసింది. మొదటి రెండు రోజులు నిజాం సైన్యం తిరగబడినా ఆ తర్వాత క్షీణించింది. తాను ఓటమి అంచుల్లో ఉన్నట్లు గమనించి నిజాం నవాబు దిక్కుతోచని స్థితిలో లేక్వ్యూ అతిథి గృహంలో బంధించిన భారత ఏజెంట్‌ ‌మున్షీని కలిసి లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. దీనితో ఆపరేషన్‌ ‌పోలో విజయవంతమైంది. సెప్టెంబర్‌ 13‌న జె.ఎన్‌.‌చౌదరి నాయకత్వాన ప్రారంభమైన దాడి సెప్టెంబర్‌ 17‌న నిజాం నవాబు లొంగిపోవడంతో ఆపరేషన్‌ ‌పోలో పేరుతో చేపట్టిన చర్య పూర్తయింది.

సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ ప్రజలు రజాకార్ల అకృత్యాలు, అరాచకాలు, అఘాయిత్యాల నుంచి విముక్తి పొందిన దినం. తెలంగాణ ప్రజల ధీరోదాత్త పోరాటానికి విజయం లభించిన దినం. అటువంటి సెప్టెంబర్‌ 17‌ను విజయోత్సవ దినోత్సవంగా, విమోచన దినోత్సవంగా జరుపుకోవాలన్నది తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్షను విస్మరించడం ఏ ప్రభుత్వానికైనా సరే తగదు. రజాకార్ల దౌర్జన్యాలకు ధన, మాన, ప్రాణాలను కోల్పోయిన వారిని స్మరించుకోవడం, రాజాకార్లకు వ్యతిరేకంగా సాహసోపేతంగా ఎదురు తిరిగి బలిదానం చేసిన వారిని స్మరించుకోవడం, ప్రతి తెలంగాణ బిడ్డ బాధ్యత. దానిని విస్మరించడమంటే చరిత్రను మరచిపోవడమే అవుతుంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ వీరోచిత పోరాటాల చరిత్రను మరుగున పరిచేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ ప్రయత్నాలను తెలంగాణ వారు ఎదుర్కొన్నారు. అభ్యంతర పెట్టారు. ప్రత్యేక తెలంగాణ వాదం బలమైన సెంటిమెంట్‌ ‌గా ప్రజలలో పాతుకపోవడానికివిమోచన దినోత్సవాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా ఒక కారణం.

తెలంగాణ భాషను, యాసనే కాదు, చరిత్రనూ అపహాస్యం చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ ప్రజాకాంక్ష నెరవేరి ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత కూడా తెలంగాణ యోధుల చరిత్రను, వారి త్యాగాలను మరుగున పరిచే యత్నాలు కొనసాగడం శోచనీయం. తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణపై తెలంగాణ ఉద్యమ సమయంలో గొప్పగా మాట్లాడిన ఉద్యమ నాయకులు అధికారంలోనికి వచ్చిన తరువాత ఉద్దేశపూర్వకంగా ఆ విషయాన్ని పట్టించుకోకపోవడం దారుణం. జాతీయోద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు నిజాం దుర్మార్గ పాలన, రజాకార్ల అరాచకాలు, అకృత్యాల నుంచి విముక్తి కోసం జరిపిన చారిత్రాత్మక పోరాటాన్ని నాడు జాతీయోద్యమ నాయకులు విస్మరించారు.స్వాతంత్య్రం అనంతరం అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా విస్మరించింది. చిన్నచూపు చూసింది. అయితే జనం మాత్రం ఆ పోరాట స్ఫూర్తిని, అమరుల త్యాగాలను పదిలంగా గుండెల్లో దాచుకున్నారు. ఏటా విమోచన దినం రోజును ఘనంగా నిర్వహించుకుంటూ నివాళులర్పిస్తూ వచ్చారు. పల్లె పల్లె తిరగబడింది. ఊరు, ఊరూ కదన కాంక్షతో కదిలింది. జనం స్వచ్ఛందంగా పెత్తందారీ తనాన్ని, దొరల దౌర్జన్యాలనూ ఎదిరించేందుకు అందినఆయుధాన్ని పట్టి తిరగబడ్డ పోరాటం అది. నిజమైన ప్రజా పోరాటం.ఆ పోరాట స్ఫూర్తిని భవిష్యత్‌ ‌తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత, నాటి పోరాటంలో త్యాగాలు చేసిన వీరులకు నివాళులర్పించాల్సిన బాధ్యత విస్మరించడం తగదు. ప్రభుత్వం ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.

md quaza
డా।। ఎండి ఖ్వాజా మొయినొద్దీన్‌
‌ప్రొఫెసర్‌, అకౌంటింగ్‌ అం‌డ్‌ ‌ఫైనాన్స్, 9492791387

Leave a Reply