- పూర్తిగా నిండిన 185 చెరువులు
- నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్ వెల్లడి
గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమైంది. నగరంలో కురిసిన భారీ వర్షాలకు 185 పెద్ద చెరువులు పూర్తిగా నిండాయి. నగరంలో ఏటా సగటున 800 మి.మీ.ల వర్షపాతం నమోదవుతుండగా, ఈ ఏడాది కేవలం వారం రోజుల్లోనే 700 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజకుమార్ జల సౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో చెరువులకు గండి పడకుండా చేపట్టాల్సిన చర్యలపై ప్రధానంగా సమీక్షించారు.
ఈ సందర్బంగా రజత్‌కుమార్ మాట్లాడుతూ నగరంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 185 చెరువులు పూర్తి స్థాయిలో నిండినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ బృందాలు ప్రతీ చెరువును పూర్తి స్థాయిలో తనిఖీ చేసి సమగ్ర నివేదిక అందజేస్తాయనీ, ఆ వివరాల ఆధారంగా త్వరలోనే చెరువుల మరమ్మత్తులకు నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. చెరువుల పునరుద్ధరణకు గాను రాష్ట్ర పురపాలక శాఖ నుంచి రూ. 2 కోట్లు విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. నగరంలో మరో 53 చెరువులు పాక్షికంగా దెబ్బతిన్నాయనీ, వీటికి కూడా త్వరలోనే మరమ్మత్తులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో చెరువులకు గండ్లు పడి తెగిపోయి భారీగా నష్టం వాటిల్లిందనీ, దీనికి కబ్బాలే కారణమని గుర్తించామని తెలిపారు. త్వరలోనే చెరువుల కబ్జాపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా రజత్‌కుమార్ స్పష్టం చేశారు.