- 3 రోజుల్లోనే రైతులకు.. నగదు బదిలీ
- ఉమ్మడి మెదక్ జిల్లాను హరితవనంగా మార్చాలి
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో రైతుబంధు కింద రూ.6,888.43 కోట్లు జమ చేశామని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. మొత్తం 54.22 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయ్యిందని చెప్పారు. జిల్లాలోని పటాన్‌టెరు మండలం పెద్దకంజర్లలో రైతు వేదికకు మంత్రి భూమిపూజ చేశారు. మొత్తం కోటి 33 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందించామన్నారు. సీఎం ఆదేశాల మేరకు 3 రోజుల్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నగదు బదిలీ చేశామని వెల్లడించారు. రైతును శక్తిగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సంగారెడ్డి జిల్లాలో 116 రైతువేదికలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్‌కు ఢోకా లేదని హరీశ్ రావు పేర్కొన్నారు.
నిర్మాణ రంగంలో కొత్త ప్రాజెక్టులు రావడంవల్ల ఉపాధి పెరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని వెల్లడించారు. మిగతా నగరాలకంటే హైదరాబాద్‌కు రియల్ఎస్టేట్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. పటాన్చెరు దర్గాలో జరిగిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీలు ప్రభాకర్ రెడ్డి, బీబీ పాటిల్‌తో కలిసి మంత్రి మొక్కలు నాటారు. ఉమ్మడి మెదక్ జిల్లాను హరితవనంగా మార్చాలని హరీశ్ రావు పిలుపు నిచ్చారు. పటాన్ చెరు శివారు ఈద్గాలో మంత్రి ప్రార్థనలు చేశారు. అనంతరం మొదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, కలెక్టర్ హనుమంతరావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. భవిష్యత్ తరాలకు మనమే పచ్చదనాన్ని అందించాలని సూచించారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. ఊరూరా విరివిగా మొక్కలు నాటాలని మంత్రి కోరారు.