Take a fresh look at your lifestyle.

ఎపిలో కొత్తగా 68 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు

  • కొరోనాతో కర్నూలు జిల్లాలో మరొకరు మృతి
  • నెల్లూరును వణికిస్తున్న కోయంబేడు ఘటన

అమరావతి,మే 20 : కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్‌ ‌వ్యాప్తి తగడ్డం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ‌లో 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వివరాలను వెల్లడించింది. 9,159 మంది శాంపిల్స్‌ని పరీక్షించగా 68 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కరోనాతో కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బాధితుల సంఖ్య ఇప్పటి వరకు 2,407కు చేరుకుంది. ఇందులో 1,639 మంది డిశ్చార్జి కాగా, మొత్తం 53 మంది మరణించారు. ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నారు. ఇకపోతే నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చెన్నై కోయంబేడు మార్కెట్‌ ‌లింక్‌లు ఎక్కువగా ఉండడంతో కొత్త కేసులు వేగంగా వెలుగు చూస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజే 19 కేసులు నమోదయ్యాయి. అందులో 17 సూళ్లూరుపేట పట్టణానికి చెందినవి కావడం గమనార్హం. తాజా వాటితో కలిపి కేసుల సంఖ్య 183కి చేరింది.

దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అనుమానితులను, పాజిటివ్‌దారులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని క్వారంటైన్‌ ‌కేంద్రాలకు తరలిస్తున్నారు. కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అధికారులను అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. జిల్లాలోని 12 క్వారంటైన్‌ ‌సెంటర్లకు 489 మంది అనుమానితులను తరలించిన వైద్యులు వారికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా ప్రస్తుతం 74 మంది ఐసోలేషన్‌ ‌వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నిర్దారణ పరీక్షలు ఇక నుంచి నెల్లూరులోనే చేయనున్నారు. నగరంలోని పెద్దాస్పత్రిలో ఏర్పాటుచేసిన వైరాలజీ ల్యాబ్‌లో మంగళవారం నుంచి పీసీఆర్‌ ‌పరీక్షలు ప్రారంభించారు. తొలిరోజు 14 పాజిటివ్‌ ‌కేసులు ప్రకటించారు.

Leave a Reply