Take a fresh look at your lifestyle.

‌ప్రమాదకరంగా 603 భవనాలు

  • జోషీమఠ్‌ను వీడిన గ్రామస్థులు
  • ఇళ్లను వీడడంతో కన్నీటి పర్యంతం

డెహ్రాడూన్‌,‌జనవరి9 : ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుచించుకుపోతున్నది. దాదాపు 603 భవనాలు బీటలు వారాయి. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్‌ ‌వేశారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో సుయి గ్రామాన్ని ఖాళీ చేయించగా.. జనమంతా కన్నీటితో తమ ఇండ్లను వీడి వెళ్తున్నారు. బాధితులనంతా మనోహర్‌భాగ్‌కు తరలించారు. బాధితులు తమ వస్తువులతో తరలివెళ్లారు. ఇండ్లను ఖాళీ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు అందరినీ భావోద్వేగానికి గురి చేస్తున్నాయి. కళ్లల్లో నీళ్లు తిరుగుతూ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. వెళ్లేందుకు ఇష్టం లేకపోయినా.. విధిలేని పరిస్థితుల్లో గ్రామం నుంచి వీడుతున్నారు.

సీఎం ధామి ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి నాక్షి సుందరం జోషిమఠ్‌లోని భవనాలు, అక్కడ నివసిస్తున్న వారి వివరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇదిలా ఉండగా.. జల్‌శక్తి మంత్రిత్వశాఖకు చెందిన హైపవర్‌ ‌కమిటీ జోషిమఠ్‌కు చేరింది. శనివారం జోషిమఠ్‌లో అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ.. భవనాలకు చాలా పగుళ్లు వచ్చాయని, ఆయా భవనాలను వీలైనంత త్వరగా కూల్చివేయాలని ప్రభుత్వానికి సూచించింది. జోషిమఠ్‌లో 603 భవనాలు బీటలువారాయి. అధికారులు ఆయా భవనాలను పరిశీలించి.. 67 కుటుంబాలను తాత్కాలిక నివాసాలకు తరలించారు. ఇదిలా ఉండగా.. చిన్నపాటి పగుళ్లు పెరిగే ప్రమాదం ఉందని, ప్రస్తుతానికి ఈ భవనాలు నివాసయోగ్యం కాదని అధికారులు పేర్కొన్నారు. అధికారుల బృందం భవనాల్లో ఉంటున్న వారి సంఖ్య వారు వృత్తి ఏంటీ? కుటుంబంలో ఉన్నది ఎంత మంది ఎక్కడ శాశ్వత పునరావాసం కోరుకుంటున్నారనే వివరాలపై ఆరా తీస్తున్నారు.

Leave a Reply