రాష్ట్ర శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు ఈ నెల 6నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం నోటిఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ ఆదేశాల ప్రకారం 15వ శాసనసభ మండలి సమావేశాలు 6న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. మార్చి 6న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తరువాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ చర్చ జరుగుతుంది. రెండు రోజుల విరామం అనంతరం ఈనెల 10న రాస్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం భావిస్తున్న దృష్ట్యా ఈనెల 25 వరకూ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కాగా, మండలి సమావేశాలు మాత్రం కేవలం 4 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పట్టణ ప్రగతి ఈనెల 4తో ముగియనుంది. ఆ వెంటనే ఒక రోజు విరామం ఇచ్చి 6న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ను సిద్ధం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సభాప్రాంగణాన్ని సిద్ధం చేశామని అసెంబ్లీ సెక్రటరీ వేదాంతం నరసింహాచార్యులు పేర్కొన్నారు.ఈ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
2020-21 ఆర్థిక సంవత్సరం అంచనాలతో ప్రవేశపెట్టే బడ్జెట్కోసం రాష్ట్రంలోని వాణిజ్యవర్గాలన్నీ ఆశగా ఎదురుచూస్తున్నాయి. అదేవిధంగా ఈ పద్దులలో ఉద్యోగుల ఆశలకు సమాధానాలను లభిస్తాయని, పీఆర్సీపైన అంచనాలు ఉంటాయని అంటున్నారు. రెవెన్యూ చట్టంపైన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరలోనే చాలాసార్లు వివరణలు ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చి తీరుతామని స్పష్టం చేశారు కూడా. విద్యుత్తు బిల్లులు, మున్సిపాలిటీల పన్నులు పెంచేందుకు ఈ సమావేశాల్లో చర్చ ఉంటుందని అంటున్నారు. కొత్తమున్సిపల్చట్టం,కొత్త పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం ఇంటిపన్నులు, నీటిపన్ను తదితర అంశాలపైన చర్చలు ఉంటాయిపట్టణాలలో, మహానగరాలలో డిజిటల్ ఇంటినెంబర్లు ఇచ్చే ప్రతిపాదనలు ఉన్నందున, ఈ డిజిటల్ ప్రక్రియకు మార్గదర్శకాలపైన చర్చించనున్నారు.