రాష్ట్రంలో కొరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మంగళవారం రాత్రి 8 గంటల వరకు 592కు చేరింది. రోజురోజకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసి పరిధిలో ఏర్పాటు చేసిన కంటైన్మెంట్ జోన్లలో చర్యలకు ప్రభుత్వం మార్గదర్శకాలను ఏర్పాటు చేసింది. కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించిన ప్రతీ ప్రాంతంలో అధికారులు ఇకపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఆ ప్రాంతంలో రోడ్లన్నీ పూర్తిగా మూసివేయడంతో పాటు 8 ఫీట్ల ఎత్తున్న బారికేడ్లను ఏర్పాటు చేస్తారు. లోపలి ప్రజలను బయటికి, బయటి వారిని లోనికి వెళ్లకుండా చేస్తారు. 24 గంటల పాటు ఆ ప్రాంతంపై పోలీసు అధికారుల నిఘా ఉంటుంది. ప్రజలకు నిత్యావసర వస్తువులను కూడా అధికారులే పంపిణీ చేస్తారు.
వృద్ధులు, వికలాంగులు ఉంటే వారికి అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఆహారం పంపిణీ చేయడంతో పాటు ఇల్లు లేని నిరాశ్రయులు, ఇతర రాష్ట్రాల కార్మికులు, ఫుట్‌పాత్‌పై ఉండే బిచ్చగాళ్లను జీహెచ్ఎంసి షెల్టర్లకు తరలిస్తారు. ఎవరికైనా కొరోనా లక్షణాల ఉంటే వారిని వైద్య అధికారులు గుర్తించి హోం క్వారంటైన్ లేదా ఆసుపత్రికి తరలించారు. కొరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రజలు చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై కరపత్రాలు, వాల్ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిలో పోలీసు, హెల్త్ , మున్సిపల్ అధికారుల ఫోన్ నంబర్లు కూడా ముద్రించాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది.